హెల్త్ డేంజర్ బెల్స్!
ABN, Publish Date - Apr 08 , 2025 | 12:52 AM
ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడనుంది. ప్రాణాంతక వ్యాధులకు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా దగ్గరవుతుండగా.. కృష్ణాజిల్లా నేను కూడా నీ వెంటే అన్నట్టుగా ఆ తర్వాత స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం. హృద్రోగాలు, క్యాన్సర్, బీపీ, షుగర్ వంటి ప్రాణాంతక వ్యాధులలో ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలు గణనీయమైన స్థానాల్లో ఉన్నాయి. డేంజర్ బెల్స్‌ను మోగిస్తున్నాయి. ప్రజల ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకోవటంతో పాటు ఒత్తిడి లేని జీవితం గడిపితేనే ఈ ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. లేదంటే ఈ సంఖ్య మరింత పెరిగి.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రజలు ఎదుర్కోవాల్సి పరిస్థితులు రావచ్చు.
- ప్రమాదంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజల ఆరోగ్యం
- ఎన్టీఆర్ జిల్లాకు హార్ట్ స్ర్టోక్.. రాష్ట్రంలోనే మొదటి స్థానం
- డయాబెటిస్‌లో వరుసగా రెండు, మూడు స్థానాలు
- షుగర్, న్యూరో, లివర్ వ్యాధులలోనూ హెచ్చు కేసులు
- జీవన అలవాట్ల మార్పుతోనే ఆరోగ్యం
ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడనుంది. ప్రాణాంతక వ్యాధులకు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా దగ్గరవుతుండగా.. కృష్ణాజిల్లా నేను కూడా నీ వెంటే అన్నట్టుగా ఆ తర్వాత స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం. హృద్రోగాలు, క్యాన్సర్, బీపీ, షుగర్ వంటి ప్రాణాంతక వ్యాధులలో ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలు గణనీయమైన స్థానాల్లో ఉన్నాయి. డేంజర్ బెల్స్‌ను మోగిస్తున్నాయి. ప్రజల ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకోవటంతో పాటు ఒత్తిడి లేని జీవితం గడిపితేనే ఈ ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. లేదంటే ఈ సంఖ్య మరింత పెరిగి.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రజలు ఎదుర్కోవాల్సి పరిస్థితులు రావచ్చు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో గుండె జబ్బులు ప్రధానమైనవి. దురదృష్టం కొద్దీ ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నివేదిక ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో సగటున 15,665 మందికి గుండె జబ్బులు వచ్చాయి. కృష్ణా జిల్లా 6వ స్థానంలో ఉంది. మొత్తం 13,106 కేసులు ఈ ఏడాది కొత్తగా నమోదు అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 50-54 సంవత్సరాల మధ్య వయస్సు వారికి, కృష్ణాజిల్లాలో 60 - 64 సంవత్సరాల మధ్య వయస్సుల వారికి ఎక్కువుగా గుండె వ్యాధులు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవటం, దురలవాట్ల కారణంగా ఈ వ్యాధులు వస్తున్నాయి. గుండెను పదిలపరచుకోవటానికి మద్యం, సిగరెట్, గుట్కాలు, మాదక ద్రవ్యాలు, నాన్ వెజ్‌కు దూరంగా ఉండాలి. పోషకాహారం ఎక్కువుగా తీసుకోవటం, వ్యాయామం చేయటం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
డయాబెటిస్‌లో టాప్- 2, 3లుగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు
డయాబెటిస్‌లో ఎన్టీఆర్ జిల్లా 59,921 కేసులతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా 58,136 కేసులతో మూడో స్థానంలో ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 45- 59 సంవత్సరాల మధ్య వయస్సు వారు డయాబెటిస్ బారిన పడుతుండగా.. కృష్ణా జిల్లాలో 50- 54 మధ్య వయస్కులు డయాబెటిస్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. బీపీ, డయాబెటిస్‌లను కలిపి చూసినా కూడా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు రాష్ట్రంలోనే 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఎన్టీఆర్ జిల్లాలో 1,25,339 కేసులు, కృష్ణాజిల్లాలో 1,11,932 కేసులు ప్రస్తుతం ఉన్నాయి. బీపీ, షుగర్ రెండూ కూడా ప్రాణాంతక జబ్బులే కావడం గమనార్హం.
బీపీలోనూ తగ్గేదే లేదు
బీపీ కేసుల్లో కూడా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు వరుసగా 3, 5 స్థానాల్లో ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 98,337 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 94,266 కేసులు నమోదు అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 50-54 సంవత్సరాల లోపు ఉన్న వారికి, కృష్ణాజిల్లాలో 60 - 64 మధ్య వయస్కులకు బీపీ వస్తోంది.
క్యాన్సర్ వ్యాధుల్లోనూ దూసుకువస్తున్న ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడిప్పుడే క్యాన్సర్ కేసుల్లోనూ దూసుకు వస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా 5,151 కేసులతో రాష్ట్రంలోనే 7వ స్థానంలో ఉంది. కృష్ణాజిల్లా ఈ విషయంలో 4,376 కేసులతో 17వ స్థానంలో నిలిచింది. ఇటీవల విజయవాడలోని క్యాన్సర్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. ఈ దృశ్యాలు డేంజర్ బెల్స్‌ను మోగిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా కేసుల తీవ్రతను తెలియచెప్పింది. క్యాన్సర్ అనేది రాకుండా చూసుకోవటానికి అవగాహన తప్పనిసరి. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ స్ర్కీనింగ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.
కాలేయ సంబంధిత వ్యాధుల్లోనూ..
ఎన్టీఆర్ జిల్లా 1,351 కాలేయ సంబంధిత కేసులతో రాష్ట్రంలోనే 9వ స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా ఈ విషయంలో 1,002 కేసులతో 17వ స్థానంలో నిలిచింది. ఈ వ్యాధులు ఎక్కువుగా రెండు జిల్లాల్లో కూడా 50 - 54 సంవత్సరాల వారిలోనే ఎక్కువుగా నమోదవుతున్నాయి.
మిగిలిన వ్యాధుల్లోనూ..
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో న్యూరో కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి. కృష్ణాజిల్లాలో 4,154 కేసులతో 10వ స్థానంలోనూ, ఎన్టీఆర్ జిల్లాలో 4,063 కేసులతో 11వ స్థానంలోనూ నిలిచాయి. అలాగే కిడ్నీ కేసుల్లో ఎన్టీఆర్ జిల్లా 6,291 కేసులతో 16వ స్థానంలోనూ, కృష్ణాజిల్లా 4,761 కేసులతో 22వ స్థానంలో ఉంది.
Updated Date - Apr 08 , 2025 | 12:53 AM