Greenfield Highway: నెల్లూరు టు బద్వేల్ రయ్..రయ్
ABN, Publish Date - May 29 , 2025 | 04:09 AM
కడప-నెల్లూరు మధ్య ‘పోర్టు రోడ్డు టు బద్వేల్’ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అనుమతి మంజూరు చేసింది. ఈ రహదారి రాయలసీమ కనెక్టివిటీని మెరుగుపరిచి పారిశ్రామికీకరణకు గణనీయంగా ఊతం ఇవ్వనుంది.
4 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు కేంద్రం ఓకే
108 కి.మీ దూరం.. 3,653 కోట్ల అంచనా
సీమ పారిశ్రామికాభివృద్ధిలో కీలక ప్రాజెక్టు
ఇప్పటికే పూర్తయిన భూసేకరణ పనులు
వచ్చే నెలలో టెండర్లు పిలిచే అవకాశం
ముంబై హైవేపై తగ్గనున్న ట్రాఫిక్, ప్రమాదాలు
నెల్లూరు/న్యూఢిల్లీ, మే 28(ఆంధ్రజ్యోతి): కడప-నెల్లూరు జిల్లాల మధ్య కీలక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాయలసీమ కనెక్టివిటీకి అత్యంత కీలకమైన గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి అంగీకారం తెలిపింది. నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు రోడ్డు నుంచి కడప జిల్లా బద్వేల్ వరకు నాలుగు వరుసల జాతీయ రహదారిని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం ఉన్న నెల్లూరు-బద్వేలు రోడ్డుకు(ముంబై హైవే) ప్రత్యామ్నాయంగా ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. మనుబోలు మండలం గురువిందపూడి సమీపంలోని కృష్ణపట్నం పోర్టు రోడ్డు నుంచి బద్వేల్ మండలం గోపవరం వరకు 108.13 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు.
డీబీఎ్‌ఫవోటీ పద్ధతిలో
‘పోర్టు రోడ్డు టు బద్వేల్’ జాతీయ రహదారి ప్రాజెక్టును డిజైన్-బిల్ట్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్(డీబీఎ్‌ఫవోటీ) పద్ధతిలో నిర్మించనున్నారు. మనుబోలు, పొదలకూరు, చేజర్ల, అనంతసాగరం, మర్రిపాడు మండలాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుపుకోనుంది. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు, ఇతర పరిశ్రమల నుంచి వాహనాలు రాయలసీమ ప్రాంతానికి వెళ్లాలంటే ముంబై హైవేపైనే ఆధారపడుతున్నారు. అది ఎక్కువ దూరం ఉండటమేగాక ఊళ్ల మధ్యలో సమయం, ఖర్చు ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల కిందట ‘పోర్టు రోడ్టు టు బద్వేల్’ 4 వరుసల రహదారి ప్రతిపాదన తెరమీదికొచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే ప్రాథమిక ఆమోదం తెలపడంతో భూసేకరణ ప్రక్రియ మొదలైంది. దాదాపు 90 శాతానికిపైగా భూసేకరణ పూర్తయింది. మొత్తంగా ఈ రోడ్డు ప్రాజెక్టుకు రూ.3653.10 కోట్లను ఖర్చు చేయనున్నారు. తాజాగా కేంద్రం ఆర్థిక అనుమతి కూడా ఇవ్వడంతో టెండర్లు పిలవడమే మిగిలింది. వచ్చే నెలలో జాతీయ రహదారుల అథారిటీ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి.
పారిశ్రామికీకరణకు ఊతం
పారిశ్రామికంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందుతోంది. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల పరిధిలో జిల్లా ఉండడం కలిసి వస్తోంది. ఇప్పటికే సాగరమాల ప్రాజెక్టు కింద సముద్ర తీరం వెంబడి జాతీయ రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. అదే సమయంలో క్రిస్ సిటీ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమకు కనెక్టివిటీని మరింత సులభతరం చేస్తూ నిర్మించనున్న ‘పోర్టు రోడ్ టు బద్వేల్’ జాతీయ రహదారితో పారిశ్రామికీకరణకు మరింత ఊతం లభించనుంది. ఈ రహదారి నిర్మాణం ఫలితంగా విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లోని కొప్పర్తి, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఓర్వకల్, చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని కృష్ణపట్నంలకు మరింత కనెక్టివిటీ ఏర్పడుతుంది. సరుకు రవాణా సామర్థ్యాన్ని ఈ నూతన రోడ్డు ప్రాజెక్టు మరింత పెంచుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
పశ్చిమ ప్రాంతానికి వరం!
నూతన జాతీయ రహదారి నిర్మాణం జిల్లా పశ్చిమ ప్రాంత వాసులకు కనెక్టివిటీని పెంచుతుంది. చెన్నై, గూడూరు వైపు నుంచి ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ రహదారి చాలా సులభంగా మారనుంది. అలానే పోర్టు, పరిసర పరిశ్రమల నుంచి ఇప్పటి వరకు భారీ వాహనాలు నెల్లూరులోకి వచ్చి వెళుతుండగా, ఇకపై ఆ బాధ ఉండదు. అలానే ముంబై హైవేపై పెద్ద వాహనాలు వెళుతుండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నూతన రహదారి పూర్తయితే ముంబై హైవేపై ట్రాఫిక్‌తో పాటు ప్రమాదాలు కూడా తగ్గనున్నాయి. ఇప్పటి వరకు కృష్ణపట్నం పోర్టు నుంచి బద్వేల్ వరకు 142 కి.మీ. ఉండగా, కొత్తగా నిర్మించే రహదారి ఫలితంగా ఆ దూరం 108 కిలోమీటర్లకు తగ్గుతుంది. ఈ జాతీయ రహదారిపై రెండు ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలు నిర్మించనున్నారు. ఈ రోడ్డు పనులు మొదలైతే సుమారు 20 లక్షల పనిదినాల ఉపాధి లభిస్తుంది.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News
Updated Date - May 30 , 2025 | 03:07 PM