CM Chandrababu: హరిత అమరావతి
ABN, Publish Date - Aug 01 , 2025 | 06:10 AM
రాజధాని అమరావతి నగరాన్ని ప్రకృతితో మమేకమయ్యేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్-బ్లూ మాస్టర్‌ప్లాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నగరాన్ని ప్రకృతితో మమేకమయ్యేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అతిపెద్ద లంగ్‌స్పేస్ నగరంగా, అమరావతి ఇన్ నేచర్ అనే కాన్సెప్ట్‌తో హరిత ప్రణాళికల్ని అమలు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్-బ్లూ మాస్టర్‌ప్లాన్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధానిలో రోడ్లు, బఫర్ జోన్లు, గ్రీన్ జోన్లు, ముఖ్యమైన కూడళ్లు అత్యంత ఆహ్లాదకరంగా ఉండేలా పచ్చదనాన్ని పెంపొందించాలని, అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని అధికారులకు నిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఔషధ మొక్కల పెంపకంపై యోగా గురువు బాబారామ్‌దేవ్ సలహాలు తీసుకోవాలన్నారు. రివర్‌ఫ్రంట్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. గ్రీన్, బ్లూ నగరంగా అమరావతిని తీర్చిదిద్దడంతో పాటు ప్రజలను ఆకర్షించేలా ఏడాది పొడవునా వివిధ కాలాల్లో వికసించే పుష్ప జాతులు, ఫలాల మొక్కలు నాటాలని సీఎం పేర్కొన్నారు. సుందరంగా తీర్చిదిద్దేందుకు బెంగుళూరుతో పాటు సింగపూర్ సహా వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించాలని చెప్పారు.
అందరికీ అందుబాటులో గృహనిర్మాణం
రాజధాని అమరావతిలో అత్యంత నాణ్యమైన, అందరికీ అందుబాటులో గృహ నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సింగపూర్‌లోని బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు తరహాలో రాజధాని నగరంలో గృహ నిర్మాణ ప్రాజెక్టుల వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చెట్లు, పార్కులు నిర్మించాలని చెప్పారు. 250 ఎకరాలల్లో 10 వేల మంది నివశించేలా బిడదారి ఎస్టేట్‌ను నిర్మించారన్నారు. పార్కులకు వివిధ దేశాల పేర్లను పెట్టడంతో పాటు ఆయా దేశాల్లో పెరిగే పుష్ప జాతి మొక్కలు ఉండేలా చూడాలన్నారు. కృష్ణా తీరం ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలని, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
Updated Date - Aug 01 , 2025 | 06:11 AM