Panchayat Secretary: కార్యదర్శుల పదోన్నతుల్లో కిరికిరి
ABN, Publish Date - Jun 17 , 2025 | 04:43 AM
రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థద్వారా ఉనికిలోకి వచ్చిన గ్రేడ్-5, గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల వ్యవహారం గందరగోళంగా మారింది. కార్యదర్శులకు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయించి...
పంచాయతీల్లో గ్రేడ్-6కు పదోన్నతులు
వెంటనే డ్రాయింగ్ అధికారాలు అప్పగింత
ఐదేళ్లుగా పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శులు
అయినా వీరికి దక్కని పంచాయతీ అధికారాలు
వైసీపీ తెచ్చిన వ్యవస్థలో తీవ్ర గందరగోళం
ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రమోషన్లు పూర్తి
తమకు న్యాయం చేయాలని ‘గ్రేడ్-5’ గగ్గోలు
గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థలో.. ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ, విధివిధానాల రూపకల్పన ఆద్యంతం గందరగోళంగా ఉంది. సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్ట్ మారినప్పుడు, బదిలీలు జరిగినప్పుడు, పదోన్నతులు జరుగుతున్న సందర్భంలో గ్రేడ్-5 కార్యదర్శులకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది.
(అమరావతి/గుంటూరు-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థద్వారా ఉనికిలోకి వచ్చిన గ్రేడ్-5, గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల వ్యవహారం గందరగోళంగా మారింది. కార్యదర్శులకు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయించి కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శి పదోన్నతులు.. గ్రేడ్-5 కార్యదర్శులకు తలనొప్పిగా మారింది. దాదాపు ఐదేళ్లుగా అదే కేడర్‌లో సేవలు అందిస్తున్న గ్రేడ్-5 కార్యదర్శులకు పదోన్నతుల ప్రక్రియ ఇబ్బందిగా మారింది. మేజర్ పంచాయతీల పరిధిలోని సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శులకు ఇప్పటి వరకు కార్యదర్శి అధికారాలు, డ్రాయింగ్ అధికారి హోదా దక్కలేదు. కానీ, గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శులైన డిజిటల్ అసిస్టెంట్లకు ఆ అవకాశం దక్కడం వారిని విస్మయానికి గురిచేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు సచివాలయ కార్యదర్థులకు ఎలాంటి జాబ్ చార్ట్ లేకుండానే పని చేయించింది. గత ఏడాది ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో 11 ద్వారా అధికారాలు, డ్రాయింగ్ పవర్ ఇస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకొంది. ఆ జీవో ప్రకారమే ప్రస్తుత ప్రభుత్వం గ్రేడ్-5 కార్యదర్శులకు పంచాయతీలను అప్పగించింది. ఈ క్రమంలో మేజర్ పంచాయతీల్లో ఉన్న సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శులకు అన్యాయం జరిగింది.
మేజర్ పంచాయతీల్లో ప్రధాన సచివాలయంలో గ్రేడ్ 1, 2, 4 కార్యదర్శులు ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తుంటారు. సచివాలయ వ్యవస్థను రూపొందించే సమయంలో జనాభా ఎక్కువగా ఉండే మేజర్ పంచాయతీల్లో 2 నుంచి 5 సచివాలయాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో మెరిట్ అభ్యర్థులందరూ సదుపాయాలు మెరుగ్గా ఉండే మేజర్ పంచాయతీలను ఎంచుకున్నారు. వారంతా గ్రేడ్ 1, 2, 4 కార్యదర్శుల కింద ఉన్న మిగిలిన సచివాలయాల్లో పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తాజాగా గ్రేడ్-5 ఉద్యోగులకు పంచాయతీ అధికారాలు, డీడీవో అధికారాలు అప్పగించింది. ఆ సమయంలో వీరికి నష్టం జరిగింది. మెరిట్ వచ్చిన వీరంతా గ్రేడ్ 1, 2, 4 కార్యదర్శుల కింద సబార్డినేట్స్‌గానే ఉండిపోయారు. వీరికి డీడీవో అధికారాలు దక్కలేదు. అయితే, మెరిట్లో వీరికంటే వెనుక ఉన్నవారు అప్పట్లో వీరు కాదనుకున్న చిన్న పంచాయతీలు ఎంచుకున్నారు. ఇప్పుడు వారందరికీ పంచాయతీ కార్యదర్శి అధికారాలతోపాటు, డీడీవో హోదా కూడా వచ్చింది. కార్యదర్శి అధికారాలను అప్పగించే సమయంలో ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అధికారాలు అప్పగించి, పంచాయతీలు కేటాయించలేదని దీంతో తమంతా సబార్డినేట్ ఉద్యోగులుగానే మిగిలిపోయామని వారు వాపోతున్నారు.
గ్రేడ్-5ను కాదని గ్రేడ్-6కు అధికారాలు..
రాష్ట్ర వ్యాప్తంగా గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు 6,166 మంది ఉన్నారు. వీరిలో పంచాయతీ కార్యదర్శి అధికారాలు లేకుండా గ్రేడ్ 1, 2, 4 కార్యదర్శుల కింద సచివాలయాల్లో పనిచేస్తున్నవారు రాష్ట్ర వ్యాప్తంగా 1,800 మంది ఉన్నారు. ప్రస్తుతం పదోన్నతుల ప్రక్రియ మొదలైన తూర్పు గోదావరి జిల్లాలో 160 మంది, కృష్ణా జిల్లాలో 79 మంది, శ్రీకాకుళంలో 97 మంది, విజయనగరం జిల్లాలో 57 మంది గ్రేడ్-5 నుంచి గ్రేడ్-4 కార్యదర్శులుగా పదోన్నతులు పొందారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 8,950 మంది డిజిటల్ అసిస్టెంట్లు ఉన్నారు. గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శుల హోదాలో ఎంపికైన వారిని ప్రభుత్వం గ్రేడ్-5 కార్యదర్శులుగా ప్రమోట్ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో 260 మంది, కృష్ణా జిల్లాలో 52 మంది, శ్రీకాకుళం జిల్లాలో 50 మంది, విజయనగరంలో 61 మంది, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 63 మంది గ్రేడ్-5 కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. అయితే, అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఇలా గ్రేడ్-5గా ఎంపికైన మరుక్షణమే, కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఉన్న వారికి గ్రామ పంచాయతీలు కేటాయించడం, కార్యదర్శి అధికారాలు కల్పించడంతోపాటు డ్రాయింగ్ అధికారాలను కూడా కట్టబెట్టారు. మొత్తంగా ఈ ఐదు జిల్లాల్లో సుమారు 200 మందికి ఇలా పదోన్నతులు వచ్చాయని తెలుస్తోంది. ఈ పరిణామం పంచాయతీ కార్యదర్శుల్లో అసంతృప్తికి దారితీసింది. తమకు పదే పదే జరుగుతున్న అన్యాయంపై వారు ఆందోళన చెందుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని చిన్నఉప్పరపల్లె గ్రామంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శి తాజాగా గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. అతడికి మేలుమాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.
అదే జిల్లాలో సోమల-1 గ్రామ పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్‌గా ఉన్న ఒకరు తాజాగా గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి పదోన్నతి పొందారు. అతనికి అదే జిల్లాలోని అంకంబట్టు పంచాయతీని అప్పగించి డ్రాయింగ్ అధికారాలు కూడా ఇచ్చారు. కానీ, అదే జిల్లాలో ఐదేళ్లుగా గ్రేడ్-5 కార్యదర్శులుగా ఉన్న అనేక మందికి ఇప్పటి వరకు ఎలాంటి హోదా దక్కలేదు. ఇలా ఈ ఒక్క జిల్లాలోనే కాదు.. పదోన్నతుల ప్రక్రియ మొదలైన అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాతోపాటు విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే పదోన్నతుల ప్రక్రియ మొదలైంది. ఈ 4 జిల్లాల్లో సుమారు 450 మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు సచివాలయం 2, 3, 4, 5లలో విధులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్లుగా గ్రేడ్-5 కార్యదర్శులుగా ఉన్నవారిని కాదని, గ్రేడ్-6గా ఉన్న డిజిటల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇచ్చి డ్రాయింగ్ అధికారాలు కట్టబెట్టడం వీరిని ఆవేదనకు గురిచేస్తోంది.
Updated Date - Jun 17 , 2025 | 04:43 AM