AP Govt: 5 వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశక్తి
ABN, Publish Date - Jul 04 , 2025 | 05:04 AM
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు విద్యాశక్తి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహించేందుకు గతేడాది ఒప్పందం చేసుకుంది.
ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లతో ‘జూమ్’ తరగతులు
విద్యార్థులకు గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల బోధన
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ‘విద్యాశక్తి’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహించేందుకు గతేడాది ఒప్పందం చేసుకుంది. 2024-25లో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 5వేల పాఠశాలల్లో అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులో 4,424 నాన్ రెసిడెన్షియల్, 576 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. రోజూ బడి ముగిసిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు జూమ్ ద్వారా ఆన్‌లైన్‌లో గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధిస్తారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీలుగా భాషాపర ఇబ్బంది లేకుండా తెలుగు ప్రొఫెసర్లను మాత్రమే కేటాయించాలని ప్రభుత్వం కోరింది. కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, యోగాపై కూడా తరగతులు నిర్వహిస్తారు. అలాగే 74 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఇటీవల విద్యాశక్తి ప్రారంభమైంది. ఎంపీసీ విద్యార్థులకు గణితం, సైన్స్, ఇతర గ్రూపుల విద్యార్థులకు ఇంగ్లిష్ బోధిస్తారు. ఈ కార్యక్రమం కో-ఆర్డినేటర్లుగా నియమితులైన వారికి పాఠశాల విద్యాశాఖ ఇటీవల విజయవాడలో శిక్షణ ఇచ్చింది. విద్యాశక్తితో పదో తరగతి ఫలితాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో కార్యక్రమ ఫలితం ఆధారంగా వచ్చే ఏడాది నుంచి పాఠశాలల సంఖ్యను పెంచనున్నారు.
Updated Date - Jul 04 , 2025 | 05:06 AM