School Reopening: తల్లికే తొలి వందనం!
ABN, Publish Date - Jan 03 , 2025 | 04:54 AM
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యే సమయంలో ‘తల్లికి వందనం’ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. గురువారం కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక చర్చ జరిగింది.
బడికెళ్లే పిల్లలందరికీ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
ఆన్ గోయింగ్ పథకాలపై కేబినెట్‌లో చర్చ
‘తల్లికి వందనం’ ఇవ్వాలన్న మంత్రులు
వేసవి సెలవుల అనంతరం హామీ అమలు
త్వరలోనే రైతులకు ‘అన్నదాత సుఖీభవ’
కేంద్రం పెంచిన 10 వేలకు మరో పది వేలు
కలిపి రూ.20 వేలు ఇద్దామన్న చంద్రబాబు
నిధుల లభ్యతను బట్టి ‘ఆడబిడ్డల నిధి’ కూడా..
మత్స్యకారులకు ఇరవై వేలు ఏప్రిల్‌లో చెల్లింపు
ఎన్ని ఇబ్బందులు ఉన్నా వరుస క్రమంలో
హామీలు అమలు చేద్దామన్న ముఖ్యమంత్రి
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యే సమయంలో ‘తల్లికి వందనం’ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. గురువారం కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం .. ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నా ఇచ్చిన హామీలు ఇప్పటికే కొన్ని అమలు చేశామని, మిగతా హామీలనూ వరుస క్రమంలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బడికి వెళ్లే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ పేరుతో రూ.15వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులు కోరారు. వేసవి సెలవుల తర్వాత తిరిగి పాఠశాలలు తెరిచేసమయంలో తల్లుల ఖాతాలో ‘తల్లికి వందనం’ డబ్బులు వేస్తామని చంద్రబాబు తెలిపారు. వాగ్దానం ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ డబ్బులు ఇస్తామని ప్రకటించారు.
ఆలస్యం అవుతుందేమో అని కొందరు మంత్రులు సందేహం వ్యక్తం చేశారు. ‘పాఠశాలల్లో హాజరు డెబ్భై శాతం ఉన్న పిల్లలకు ‘తల్లికి వందనం’ కింద డబ్బులు ఇస్తామని ప్రకటించాం. ఈ విద్యా సంవత్సరంలో హాజరు చూసి అర్హత ఉన్నవారికి తిరిగి పాఠశాలలు తెరిచే ముందు డబ్బులు ఇవ్వబోతున్నాం. ఇది సరైందే’ అని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పఽథకం కింద రైతులకు కూడా డబ్బులు త్వరలో ఇవ్వబోతున్నట్లు సీఎం తెలిపారు. ‘ఈ పఽథకం కింద కేంద్రం ఇచ్చే మొత్తాన్ని రూ.పది వేలకు పెంచింది. దానికి మరో రూ.పది వేలు కలిపి రైతులకు మొత్తం రూ.20వేలు ఇస్తాం. కేంద్రం ఎన్ని వాయిదాల్లో ఇస్తే మనం కూడా అదే సమయంలో అంతే మొత్తం అన్నే వాయిదాల్లో ఇస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు. పేదల పింఛన్లు రూ.3వేల నుంచి రూ. 4వేలు చేశామనీ, అన్న క్యాంటీన్లు తెరిచామనీ, ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పఽథకం అమలు చేశామంటూ ఇప్పటిదాకా అమలుచేసిన హామీల గురించి సీఎం వివరించారు. అలాగే.. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులను పట్టాలు ఎక్కించామని తెలిపారు. చేపలు గుడ్లు పెట్టే సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇచ్చే మొత్తం రూ.ఇరవై వేలు ఏప్రిల్‌లో ఇవ్వాలని కూడా మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకొంది.
చేపల వేట నిషేధం ఏప్రిల్ మధ్యలో ప్రారంభమై నలభై ఐదు రోజులు కొనసాగుతుంది. కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పఽథకం కింద గత ప్రభుత్వం పెద్ద మొత్తం బకాయిలు పెట్టి వెళ్లిందని, ముందు ఎంతోకొంత ఇస్తే వారికి కొంత ఉపశమనం కలుగుతుందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు బకాయిల్లో కొంత ఈ నెలలో విడుదల చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం వారి ఖాతాల్లో ఫీజుల డబ్బులు వేస్తున్నందువల్ల రాష్ట్రం ఇచ్చే డబ్బులు కూడా, వారి వరకూ ఆ విద్యార్థుల ఖాతాల్లోనే వేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ వర్గాల విద్యార్థులకు ఫీజుల మొత్తంలో అరవై శాతం కేంద్రం ఇస్తోంది. కాలేజీలకు బకాయిలు కొంత మేర విడుదల చేస్తున్నందువల్ల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులు బాధ్యత తీసుకొనేలా చూడాలని సమావేశం నిర్ణయించింది. ఆడబిడ్డల నిధి పఽథకం కూడా వరుస క్రమంలో అమలు చేద్దామని, నిధుల లభ్యత చూసుకొని వెళ్దామని ముఖ్యమంత్రి చెప్పారు.
Updated Date - Jan 03 , 2025 | 04:54 AM