ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.10 కోట్ల ఆభరణాలతో బంగారం వ్యాపారి పరార్‌!

ABN, Publish Date - Jun 23 , 2025 | 01:20 AM

తండ్రికి ఉన్న పలుకుబడిని ఆసరాగా చేసుకుని వన్‌టౌన్‌ గోల్డ్‌ మార్కెట్‌లోని పలువురు వ్యాపారుల నుంచి రూ.10 కోట్ల విలువైన ఆభరణాలు తీసుకుని వన్‌టౌన్‌ శివాలయం వీధిలో వ్యాపారం చేస్తున్న ఏనుగుల వినోద్‌ పరార్‌ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

-వన్‌టౌన్‌ గోల్డ్‌ మార్కెట్‌ వ్యాపారులే బాధితులు

-తండ్రికి ఉన్న పేరును ఉపయోగించుకుని మోసం

-వారం క్రితం ఘటన.. పోలీసులకు ఫిర్యాదు

-లబోదిబోమంటున్న బాధిత వ్యాపారస్థులు

వన్‌టౌన్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):

తండ్రికి ఉన్న పలుకుబడిని ఆసరాగా చేసుకుని వన్‌టౌన్‌ గోల్డ్‌ మార్కెట్‌లోని పలువురు వ్యాపారుల నుంచి రూ.10 కోట్ల విలువైన ఆభరణాలు తీసుకుని వన్‌టౌన్‌ శివాలయం వీధిలో వ్యాపారం చేస్తున్న ఏనుగుల వినోద్‌ పరార్‌ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... తూర్పు నియోజకవర్గం పటమట పంట కాలువ రోడ్డులో ఏనుగుల చంద్రరావు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. ఈయన సుమారు 50 సంవత్సరాలకుపైగా వన్‌టౌన్‌ శివాలయం వీధిలో రజనీ బంగారు ఆభరణాల షాపు పేరుతో బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు కూడా తండ్రి వద్దే ఉంటూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. చంద్రరావు ఎక్కువగా నెంబరు టూ వ్యాపారం చేసేవాడు. అయితే ఆయనకు వ్యక్తిగతంగా గోల్డ్‌ మార్కెట్‌లో మంచి పేరుంది. ఈ క్రమంలో నోట్లు రద్దు సమయంలో వ్యాపారంలో ఆదాయం ఎక్కువ ఉందనే కారణంతో పాటు, ఇంకా పలు కారణాలతో ఈడీ అధికారులు షాపు, ఇంటి పై దాడులు చేసి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకుని షాపును సీజ్‌ చేశారు. దీంతో ఆ నాటి నుంచి చంద్రరావు వ్యాపార పరంగా ఇబ్బందులు పడ్డారు. పెద్ద కుమారుడు మద్యానికి బానిస కావటంతో రెండవ కుమారుడు వినోద్‌ తమ్ముడుతో కలిసి ఓ షాపును అద్దెకు తీసుకుని బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు. గోల్డ్‌ మార్కెట్‌లో అందరూ బాగా పరిచయస్థులు కావటంతో పలువురు వ్యాపారస్థులు కూడా అతను చెప్పిన మాటలను నమ్ముతూ వచ్చారు.

కస్టమర్స్‌ కావాలని చెప్పి..

ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి వినోద్‌ పలువురు వ్యాపారస్థుల వద్ద వివిధ మోడల్స్‌ బంగారు ఆభరణాలను కస్టమర్స్‌కు కావాలని చెప్పి తన వద్ద పనిచేసే గుమాస్తాను పంపించి తీసుకున్నాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అతను రెండు వారాల క్రితం వ్యాపారస్థుల వద్ద తీసుకున్న బంగారు ఆభరణాలతో పరారైనట్లు బాధితులు చెబుతున్నారు. ఈ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.10కోట్లకుపైగా ఉంటుందని సమాచారం. అయితే వన్‌టౌన్‌ గోల్డ్‌ మార్కెట్‌లోని వ్యాపారస్థుల నుంచే కాకుండా ఇతర ప్రాంతాలలోని వ్యాపారుల వద్ద కూడా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కుటుంబ సభ్యులను తమ్ముడి ఇంటి వద్ద వదిలేసి..

ప్రస్తుతం వినోద్‌ గొల్లపూడిలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడని, అయితే మధురానగర్‌లో ఉంటున్న తమ్ముడి వద్ద కుటుంబ సభ్యులను వదిలేసి పరారయ్యాడని పలువురు బంగారు వ్యాపారస్థులు చెబుతున్నారు. విశాఖపట్నంలో ఉన్న బంధువు వద్దకు గానీ, కర్ణాటక రాష్ట్రం ఖర్గపూర్‌లో ఉన్న భార్య పుట్టింటి వద్దకు గానీ వినోద్‌ వెళ్లి ఉండవచ్చని అతని స్నేహితులు పేర్కొంటున్నారు. వారం రోజుల క్రితమే వినోద్‌ బంగారు ఆభరణాలతో పరారయ్యాడని తెలుసుకున్న పలువురు బాధితులు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు వినోద్‌ షాపు వద్దకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని, అతని షాపు బిల్డింగ్‌లో ఉన్న ఓ షాపులోని సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. బాధితుల్లో ఒకరైన కోటా వేణుగోపాల్‌ పోలీసులకు వినోద్‌ తన వద్ద 655.900 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నాడని ఫిర్యాదు చేశారు. మిగిలిన బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేయకుండా ఆలోచనలో పడ్డారు. వినోద్‌పై ఫిర్యాదు చేస్తే అతను తీసుకున్న బంగారానికి లెక్కలు ఎక్కడ బయటపడతాయోనని బాధితులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.

Updated Date - Jun 23 , 2025 | 01:20 AM