ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kurnool: గోదావరి-బనకచర్ల వరమా.. భారమా

ABN, Publish Date - Jul 13 , 2025 | 03:52 AM

బనకచర్లకు గోదావరి జలాలు తెస్తామంటున్నారు. కరువు సీమకు నీళ్లు తెచ్చే ఏ ప్రాజెక్టైనా మంచిదే! అయితే... బనకచర్ల కంటే ముందు రాయలసీమలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయండి.

  • రూ.80 వేల కోట్ల అతి భారీ ప్రాజెక్టు

  • పాతికేళ్లకూ పూర్తయ్యే అవకాశం లేదు!

  • సీమకు 200 టీఎంసీల నీరివ్వడమే లక్ష్యం

  • ఇప్పటికే ఉన్న సీమ ప్రాజెక్టుల మాటేమిటి?

  • దశాబ్దాలుగా పూర్తికాని జలాశయాలు

  • కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాక నెరవేరని సాగునీటి పంపిణీ లక్ష్యాలు

  • రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే అన్నీ పూర్తి

  • 3-4 ఏళ్లలోనే లక్షల ఎకరాలకు నీరు

  • ఎలాంటి వివాదాలూ లేకుండానే ఫలాలు

  • రాష్ట్ర విభజన చట్టంలో వీటికి గ్రీన్‌సిగ్నల్‌

  • ‘బనకచర్ల’పై సీమ నిపుణుల్లో చర్చ

ఇలా చేస్తే..

తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్సార్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టుల మొత్తం ఆయకట్టు 14.42 లక్షల ఎకరాలు. కానీ... పంటకాల్వలు లేక, ఇతర నిర్మాణాలు పూర్తికాక కేవలం 3.55 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఆ పనులు పూర్తి చేస్తే మరో పదిలక్షల ఎకరాలకు నీరందుతుంది.

ఏది మేలు?

‘గోదావరి - బనకచర్ల’ చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. కానీ... ఇప్పటికే చేపట్టిన తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి తదితర ప్రాజెక్టులకు ఈ సమస్య లేదు. ‘ఆన్‌ గోయింగ్‌’ ప్రాజెక్టులపై తెలంగాణ కూడా అభ్యంతరం వ్యక్తం చేయబోదు. పైగా... ఈ ప్రాజెక్టులన్నింటినీ కొనసాగించవచ్చని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. వీటికి నీటి కేటాయింపులూ చేయాలన్నారు. కేవలం రూ.4 వేల నుంచి 5వేల కోట్లు ఖర్చు పెట్టి కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేస్తే... ‘గోదావరి-బనకచర్ల’తో సమానమైన జలఫలాలు రాయలసీమకు అందే అవకాశముంది. అది కూడా... ఎలాంటి వివాదాలు లేకుండా... మూడు నాలుగేళ్లలోనే!

కృష్ణా జలాలతోనే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-1) 811 టీఎంసీల కృష్ణా నికర జలాలు కేటాయించింది. ఏపీలోని ప్రాజెక్టులకు 512 టీఎంసీలు, తెలంగాణ ప్రాజెక్టులకు 299 టీఎంసీలు వినియోగంలో ఉన్నాయి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకుని... వరద జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయగలిగితే సీమకు నీటి కరువన్నదే రాదు. ‘బనకచర్ల’ కోసం ఎదురు చూడాల్సిన అవసరమూ ఉండదు. దీంతోపాటు వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ, గుండ్రేవులు.. వంటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరముందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు.

(కర్నూలు - ఆంధ్రజ్యోతి)

‘‘బనకచర్లకు గోదావరి జలాలు తెస్తామంటున్నారు. కరువు సీమకు నీళ్లు తెచ్చే ఏ ప్రాజెక్టైనా మంచిదే! అయితే... బనకచర్ల కంటే ముందు రాయలసీమలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయండి. పంట కాలువలను తవ్వండి’’... ఇదీ రాయలసీమ సాగునీటి నిపుణుల డిమాండ్‌! వారు ప్రభుత్వానికి చేస్తున్న వినతి! ముఖ్యమంత్రి చంద్రబాబు ‘బనకచర్ల’ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో... దీనిపై రాయలసీమలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సీమకు త్వరగా, గరిష్ఠంగా మేలు జరగాలంటే... పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి, పంటకాలువలు నిర్మించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏమిటీ బనకచర్ల?

చంద్రబాబు పాతికేళ్ల ముందుచూపుతో ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అందులో... గోదావరి - బనచకర్ల అనుసంధానం ప్రాజెక్టు ఒకటి. ఏటా కడలిపాలవుతున్న వేల టీఎంసీల గోదావరి జలాల్లో... 200 టీఎంసీలను మూడు దశల్లో ఎత్తిపోసి, నంద్యాల జిల్లా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ ఎగువన కలపాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80వేల కోట్లు! మన ప్రభుత్వాల ట్రాక్‌ రికార్డును గమనిస్తే... ఏ పాతికేళ్లకోగానీ గోదావరి- బనకచర్ల అనుసంధానం పూర్తయ్యే అవకాశం లేదు. అదికూడా... అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తకుండా ఉంటే! బనకచర్లపైనే దృష్టి సారించి పెండింగ్‌లో ఉన్న సీమ ప్రాజెక్టులను వదిలేస్తారా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏదీ తెలుగుగంగ..

40 ఏళ్లైనా తెలుగుగంగ ప్రాజెక్టు కాల్వల నిర్మాణం పూర్తి కాలేదు. శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 29 టీఎంసీలు మళ్లించి ఉమ్మడి కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో 5.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. మెయిన్‌ కెనాల్‌ను 5 వేల క్యూసెక్కుల ప్రవాహానికి విస్తరించడం, నంద్యాల జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పంట కాలువలు, కడప జిల్లా బ్రహ్మంసాగర్‌ కుడి, ఎడమ కాలువల లైనింగ్‌, పంట కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు పూర్తిచేస్తే 2.75లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ... 1.25 లక్షల ఎకరాలకు మించి సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. రూ.850 కోట్లు ఖర్చుపెడితే... మరో లక్ష ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

వీటిని పూర్తి చేస్తే..

దశాబ్దాల కిందట మొదలుపెట్టిన తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాలేదు. ఏటేటా నిర్మాణ వ్యయం పెరుగుతోందే తప్ప లక్ష్యాలను చేరుకోవడం లేదు. వీటిని పూర్తిచేసి... ఇతర ప్రాజెక్టుల కింద పంటకాలువలను పూర్తిస్థాయిలో తవ్వితే కృష్ణా వరద జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. గోదావరి-బనకచర్ల సాకారమయ్యే దాకా ఆగాల్సిన అవసరమే లేదు. గరిష్ఠంగా రూ.5వేల కోట్లు ఖర్చు చేయగలిగితే ఒకటి రెండేళ్లలోనే సీమ మొత్తం సస్యశామలమవుతుంది.

గాలేరు-నగరి ‘గోడు’

గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుద్వారా కడప, చిత్తూరు జిల్లాల్లో 2.60లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 5 లక్షల జనాభాకు తాగునీరు అందించాలని లక్ష్యం. 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీనికింద కర్నూలు, కడప జిల్లాల్లో 62.64 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు పూర్తిచేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పులివెందుల బ్రాంచి కెనాల్‌, లింగాల కాలువ ద్వారా చెరువులు, వాగులు, కుంటలకు నీటిని వదులుతున్నారు. పంట కాలువలు, డిస్ట్రిబ్యూటర్లు అసంపూర్తిగా ఉండటంతో ఆయకట్టుకు నీరివ్వడం లేదు. రూ.950కోట్లతో ఈ పనులు పూర్తి చేయగలిగితే ఉమ్మడి కడప జిల్లాలో 3.37లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఫేజ్‌-2లో భాగంగా తిరుపతి జిల్లాలో బాలాజీ, అడవికొత్తూరు, వేణుగోపాల సాగర్‌, వేపగుంట, మల్లెమడుగు రిజర్వాయర్లకు 10 టీఎంసీలు మళ్లించి 1.03 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. రైల్వే కోడూరు నుంచి తిరుపతి జిల్లాకు కృష్ణా జలాలు పారాలంటే దాదాపు 24 కిలోమీటర్ల పొడవునా రెండు ప్రధాన టన్నెల్స్‌ తవ్వాల్సి ఉంది. ఈ ప్రాంతంలో అభయారణ్యాలు ఉండడంతో అనుమతులు రాకపోవడంతో పనులు ఆగిపోయాయి.

హంద్రీనీవా విస్తరణ సరే.. పంట కాలువలు ఏవీ?

హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి 1989లో ఆనాటి సీఎం ఎన్టీఆర్‌ శ్రీకారంచుట్టారు. దీనిని శ్రీశైలం జలాశయంలో 834 అడుగుల లెవెల్‌ నుంచి నీటిని తీసుకునేలా డిజైన్‌ చేశారు. మల్యాల నుంచి 40 టీఎంసీల కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం. 2012 నవంబరులో ట్రయల్‌రన్‌ పూర్తిచేశారు. అప్పటినుంచి ఏటా కృష్ణాజలాలు ఎత్తిపోస్తున్నా ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. పంట కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, సంబంధిత నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలకుగాను 25వేల ఎకరాలకే నీరందుతోంది. రూ.210 కోట్లు ఖర్చుచేసి పత్తికొండ రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాలువలు పూర్తిచేస్తే 45వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు శూన్యం. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3.45 లక్షల ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. రూ.1,250 కోట్లతో పంటల కాలువలు పూర్తి చేస్తే ప్రాజెక్టు ఫలాలు పూర్తిస్థాయిలో అందుకోవచ్చు.

‘బనకచర్ల’... బృహత్తర ప్రాజెక్టు

  • వృథాగా కడలి పాలవుతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మళ్లించాలనే లక్ష్యంతో గోదావరి-బనకచర్లను తెరపైకి తెచ్చారు. ఖర్చు, నిర్మాణం కోణంలో చూస్తే... ఇదో భారీ, సంక్లిష్టమైన ప్రాజెక్టు అని చెప్పక తప్పదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80,112 కోట్లు అవసరమని అంచనా చేసి.. నిధుల సేకరణకు ‘జల హారతి కార్పొరేషన్‌’ ఏర్పాటు చేశారు.

  • దీనిద్వారా 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 22.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

  • గోదావరి-బనకచర్ల ఫేజ్‌-1లో పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి వరద జలాలు కృష్ణా నదిలోకి మళ్లిస్తారు. ఫేజ్‌-2లో సాగర్‌ కుడి కాలువ దాటి కొత్తగా 150టీఎంసీల సామర్థ్యం తో నిర్మించే బొల్లాపల్లి జలాశయంలోకి మళ్లిస్తారు. ఫేజ్‌-3లో భాగంగా బొల్లాపల్లి రిజర్వాయర్‌ నుంచి నంద్యాల జిల్లా పాములపాడు వద్ద బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ ఎగువన శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువలో పోస్తారు.

  • కాలువలు, జలాశయాల నిర్మాణం కోసం 47,999 ఎకరాల భూసేకరణ చేయాలి.

  • 400.4 కి.మీ. గ్రావిటీ కెనాల్‌, 10 లిఫ్టులు, 38.01 కి.మీ. 3భారీ టన్నెల్స్‌, 16.7 కి.మీ. పైపులైన్‌ కెనాల్‌ నిర్మించాల్సి ఉంటుంది.

సీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలి

రాయలసీమను సస్యశామలం చేసేందుకు ఏ ప్రాజెక్టు చేపట్టినా కాదనం. తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు విభజన చట్టంలో నీటి హక్కులు కల్పించారు. కాలువలు అసంపూర్తిగా ఉండడం, సరైన నిర్వహణ లేకపోవడంతో కృష్ణాజలాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. బనకచర్ల ప్రాజెక్టుపై మాకు ఏ అభ్యంతరం లేదు. అదే క్రమంలో తొలిప్రాధాన్యతగా అసంపూర్తిగా ఉన్న సీమ కాలువలు, పంట కాలువలను పూర్తి చేయాలి.

- బొజ్జ దశరథరామిరెడ్డి,

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు,

నంద్యాల

శ్రీశైలంలో పుష్కలంగా జలాలు...

1984 నుంచి 2024 వరకు అంటే 40 ఏళ్లలో శ్రీశైలం జలాశయానికి చేరిన నీటి రికార్డులు పరిశీలిస్తే.. 12 ఏళ్లు 1501 నుంచి 2 వేల టీఎంసీలు వచ్చాయి. తొమ్మిదేళ్లు వెయ్యి నుంచి 1500 టీఎంసీలు, 14 ఏళ్లు 500 నుంచి వెయ్యి టీఎంసీల వరకు వరద చేరింది. రెండేళ్లు మాత్రమే 250 నుంచి 500 టీఎంసీలు వచ్చాయి. మూడేళ్లు మాత్రం కనిష్ఠంగా 250 టీఎంసీల కంటే తక్కువ వరద నమోదైంది. వెరసి... 40 ఏళ్లలో 35 సంవత్సరాలు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నమోదైందని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

‘బనకచర్ల’కూ కాలువలు కావాల్సిందే!

గోదావరి - బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా... గోదావరి వరద జలాలు రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోస్తామంటున్నారు. ఈ జలాలను సద్వినియోగం చేసుకోవాలన్నా... కాలువల నిర్మాణం పూర్తి చేయాల్సిందే. దీనికోసం గాలేరు నగరి (జీఎన్‌ఎ్‌సఎ్‌స), తెలుగుగంగ కాలువలు త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రస్తుతం వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కులు, గోరకల్లు రిజర్వాయర్‌ నుంచి జీఎన్‌ఎ్‌సఎ్‌స ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ ద్వారా 10 వేల క్యూసెక్కులకు మించి తీసుకోలేని పరిస్థితి నెలకొంది. తెలుగుగంగ కాలువకు లైనింగ్‌ చేయకపోవడం, అవుకు ట్విన్‌ టన్నెల్స్‌ పనులు, కాలువ పనులు అసంపూర్తిగా ఉండడమే ఇందుకు కారణం. డిస్ట్రిబ్యూటరీలు, పంట కాలువలు సరేసరి. వీటిని పూర్తి చేయకుండా గోదావరి వరద జలాలు బనకచర్ల ఎగువన పోసినా, ఎస్కేప్‌ చానల్‌ ద్వారా నిప్పులవాగు, కుందు నది ద్వారా పెన్నా నదిలోకి మళ్లించి అక్కడి నుంచి సోమశిల, కండలేరుకు పంపడం తప్పా మరో మార్గం లేదు. రెండు మూడేళ్లలో తెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు-నగరి సులజ స్రవంతి ప్రాజెక్టు, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులను ప్రధాన కాలువల మొదలుకొని పంట చేలకు సాగునీరందించే డిస్ట్రిబ్యూటరీ కాలువలు, పంట కాలువలు (సబ్‌ మైనర్‌).. వంటి వివిధ పనులు పూర్తి చేయాల్సిన అవసరముంది. అదే జరిగితే... ‘గోదావరి - బనకచర్ల’ పూర్తయ్యేదాకా వేచి చూడాల్సిన అవసరమూ ఉండదు.

Updated Date - Jul 13 , 2025 | 05:32 AM