ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఫ్రీ హోల్డ్‌కు రైట్‌ రైట్‌

ABN, Publish Date - Jul 05 , 2025 | 03:06 AM

చట్టప్రకారం అర్హత గల భూములకు నిషేధిత జాబితా 22(ఏ) నుంచి స్వేచ్ఛ (ఫ్రీ హోల్డ్‌) కల్పించే విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖను ఆదేశించారు.

  • అర్హత గల అసైన్డ్‌ భూములకు స్వేచ్ఛ కల్పించండి

  • 22ఏలోని ఇనాం, చుక్కలు, షరతు పట్టా భూములకూ

  • రెవెన్యూ శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

  • నిషేధిత జాబితా నుంచి తొలగించడంపై స్పష్టత

  • ఆగస్టు 25 నుంచి కొత్త పాసు పుస్తకాల జారీ

  • రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం ఆదేశం

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై చర్చ

  • వైసీపీ వారికి మేలు చేసేలా వార్తలు: అనగాని

  • మంత్రి వాదనను తోసిపుచ్చిన చంద్రబాబు

  • అన్నీ కరెక్టుగా ఉన్నవి ఎందుకు ఆపుతున్నారు?

  • వార్తలో ఉన్నది అదే కదా అంటూ ప్రశ్న

వీటికి లైన్‌ క్లియర్‌

ఫ్రీ హోల్డ్‌కు అర్హులైన వారు వైసీపీ కార్యకర్తలయినా, టీడీపీ కార్యకర్తలైనా, ఏ పార్టీ వారైనా చేయాల్సిందే. అర్హత ఉన్న అసైన్డ్‌ భూములకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోండి. ఈ విషయంలో ఇక నాన్చుడు ధోరణి వద్దు. అసైనీలు భూమిపై పొజిషన్‌లో ఉన్నవి, పక్కా అసైన్‌మెంట్‌ రికార్డులు కలిగి ఉండి 20 ఏళ్లు గడువు దాటిన వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీ హోల్డ్‌ చేయండి.

వీటికి ఫ్రీ హోల్డ్‌ వద్దు

అసైన్‌మెంట్‌ రికార్డులు లేని భూములు, కలెక్టర్‌ ఉత్తర్వులు లేనివి, జీఓ 596కి విరుద్ధంగా ఉన్నవి, అధిక విస్తీర్ణం క్లెయిమ్‌ చేసేవి, అసలైన అసైనీలు భూమిపై పొజిషన్‌లో లేనివి, ఇతరులు క్లెయిమ్‌ చేసే భూములు, అభ్యంతరాలున్న పోరంబోకు భూములు, నీటి వనరులున్న పోరంబోకు భూములు, 20 ఏళ్లు గడువుదాటని అసైన్డ్‌ భూములు.

- రెవెన్యూ శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): చట్టప్రకారం అర్హత గల భూములకు నిషేధిత జాబితా 22(ఏ) నుంచి స్వేచ్ఛ (ఫ్రీ హోల్డ్‌) కల్పించే విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఫ్రీ హోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ల కొనసాగింపుపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలు ఇంకెంతకాలం ఇబ్బంది పడాలని, రెవెన్యూ శాఖ ఎందుకు స్పష్టమైన వైఖరి తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖపై సమీక్ష చేశారు. అసైన్డ్‌ భూములను ఫ్రీ హోల్డ్‌ ఎలా చేయాలన్న విషయంలో స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ చట్టం-1977 చట్టసవరణ మేరకు అర్హత గల భూములను ఫ్రీ హోల్డ్‌ చేసే విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. పక్కా నిబంధనల ప్రకారం ఉన్న భూములను ఫ్రీహోల్డ్‌ చేయాలని సీఎం స్పష్టం చేశారు. 22ఏలోని ఇనాం, చుక్కలు, షరతు పట్టా భూములకూ వర్తించనుంది. జగన్‌ ప్రభుత్వంలో 2024 మే నాటికి 13.59 లక్షల ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్‌ చేశారు. అందులో 5.74 లక్షల ఎకరాలను చట్టవిరుద్ధంగా, అక్రమంగా నిషేఽధిత జాబితా నుంచి తొలగించారని రెవెన్యూ శాఖ గుర్తించింది. చట్టప్రకారం, నిబంధనల మేరకు ఫ్రీహోల్డ్‌ అయిన భూములు 7.16లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇందు లో నిజమైన అసైనీలే పొజిషన్‌లో ఉన్నవాటిని పక్కా రికార్డులను పరిశీలించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు. ఇకపై అసైన్డ్‌ చట్టసవ రణ ప్రకారం 20 ఏళ్ల కాలపరిమితి దాటిన భూములు, అసైనీలే పొజిషన్‌లో ఉన్నవాటిని ఏటా ఫ్రీ హోల్డ్‌ అయ్యేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాలపై మరోసారి చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి సిఫారసులతో కూడిన నివేదిక ఇవ్వనుంది. ఇదంతా జరగడానికి అక్టోబరు దాకా పట్టొచ్చని మంత్రి అనగాని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం వీలైనంత త్వరగా ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.

సమీక్షలో కీలక నిర్ణయాలు

  • ప్రస్తుతం భూముల రీ సర్వే 2.0 కొనసాగుతోంది. 2027 డిసెంబరు నాటికి రీ సర్వేను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

  • ఆగస్టు 15 నుంచే రైతులకు కొత్త పాసుపుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

  • రాష్ట్ర, జిల్లా స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అతిథులు, పెద్దలు వచ్చినప్పుడు గౌరవార్థం కోసం రెవెన్యూ శాఖ నుంచి తహసీల్దార్‌, ఆర్‌డీఓ, ఇతర అధికారులు ప్రొటోకాల్‌ డ్యూటీలకు వెళ్తున్నారు. ఇకపై రెవెన్యూ అధికారులు ఆ పని చేయాల్సిన పనిలేదని సీఎం చెప్పారు. ప్రభుత్వ అతిథులు ఏ శాఖకు సంబంధించిన వారు వస్తే సంబంధిత విభాగం అధికారులే ప్రొటోకాల్‌ డ్యూటీ చేసేలా ఏర్పాట్లు చేయాలని, ఇందుకు విధివిధానాలు జారీ చేయాలని ఆదేశించారు.

  • గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌ జరుగుతోంది. ప్రస్తుతం రీ సర్వే 2.0 కొనసాగుతున్నందున వీఆర్‌ఓ, విలేజ్‌ సర్వేయర్లను కదిలించవద్దన్న రెవెన్యూ శాఖ వినతికి సీఎం సానుకూలంగా స్పందించారు.

  • సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న రోవర్ల బిల్లులు చెల్లించేందుకు నిధులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

  • వారసత్వ ధ్రువీకరణ పత్రాలు జారీని సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ తీసుకున్న ఫీజుల విధానానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

  • పేదలు, జర్నలిస్టు గృహ నిర్మాణంపై ఉన్న చట్టపరమైన వివాదాలు, సమస్యలను అక్టోబరు నాటికి పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.

‘నాలా’పై సీఎం అసంతృప్తి

ఏపీ వ్యవసాయ భూమి బదలాయింపు చట్టం (నాలా)పై రెవెన్యూశాఖ ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నాలా చట్టం ఉపసంహరణపై ఇప్పటిదాకా ఎందుకు ఫైలు పంపించ లేదని సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. అధికారులు దీనికేదో కారణాలు చెప్పినట్లు సమాచారం.

ఏఐతో సమస్యల పరిష్కారం: అనగాని

కృత్రిమ మేధతో భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ జయలక్ష్మి, అదనపు సీసీఎల్‌ఏ ప్రభాకర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏఐ టెక్నాలజీతో భూ వివాదాలు కూడా పరిష్కరిస్తామని చెప్పారు. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో మోసపూరిత రిజిస్ట్రేషన్లు, ఎంట్రీలను అడ్డుకుంటామన్నారు. ఆగస్టు 15న రైతులకు కొత్త పాసుపుస్తకాలు అందిస్తామన్నారు. రెవెన్యూ శాఖ కులధ్రువీకరణ పత్రాలను ఓపెన్‌ డొమెయిన్‌లో పెట్టాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై చర్చ

కలెక్టర్ల సమావేశం తర్వాత జరిగిన సమీక్ష కావడంతో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా అసైన్డ్‌ భూముల ఫ్రీ హోల్డ్‌పై చర్చ జరిగింది. ‘ముందు మీరు చెప్పేది చెప్పండి.. ఆ తర్వాత అంశాల వారీగా నేను మాట్లాడుతాను’ అని చంద్రబాబు చెప్పారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘రెవెన్యూ రచ్చ’ వార్త క్లిప్పింగ్‌ను సీఎంకు చూపించారు. జగన్‌ ప్రభుత్వంలో అసైన్డ్‌ భూముల అక్రమాలను రెవెన్యూ శాఖ గుర్తించి ఫ్రీ హోల్డ్‌ రిజిస్ట్రేషన్లు ఆపేస్తే.. ‘ఆంధ్రజ్యోతి’ పెద్ద వార్త రాసిందని, ఫ్రీ హోల్డ్‌ కొనసాగించాలని పేర్కొందని సీఎంకు నివేదించారు. ‘గతంలో వైసీపీ వాళ్లకు మేలు చేశారు. ఇప్పుడు వాళ్లకు మేలు చేయాలన్నట్లుగా వార్త రాశారు’ అని మంత్రి ప్రస్తావించినట్లు తెలిసింది. మంత్రి వాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు తోసిపుచ్చారు. ‘‘వార్తలో ఏముందో నేనూ చూశా. ఫ్రీ హోల్డ్‌ను ఇంకెంతకాలం ఆపుతారు? రికార్డులన్నీ కరెక్టుగా ఉన్నవి, అర్హులైన వారి భూములను ఫ్రీ హోల్డ్‌ చేస్తే తప్పేమిటి? వైసీపీ వాళ్లకు లబ్ధి చేకూరుతుందని అంటున్నారు? పార్టీల పేరు చెప్పి అర్హుల అవకాశాలను అడ్డుకోవడం సరైనదా? ఈ పేరిట ప్రజలను ఇంకెంతకాలం ఇబ్బంది పెడుతారు? ఈ సమస్యను పరిష్కరించాలని ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీరెందుకు ఇప్పటిదాకా ఓ నిర్ణయం తీసుకోలేకపోయారు? ఈ అంశంపై మీకు స్పష్టత ఉందా? అన్నీ కరెక్టుగా ఉన్న భూములకు స్వేచ్ఛ కల్పిస్తే తప్పేమిటి?’’ అని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. కాగా రెవెన్యూ మంత్రి ‘ఆంధ్రజ్యోతి’ వార్తలకు దురుద్దేశ్యాలు ఆపాదించడం ద్వారా ఫ్రీ హోల్డ్‌పై ఇప్పటివరకు ఇటు రెవెన్యూ శాఖ, అటు తన నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోకపోవడం సరైనదేనని ముఖ్యమంత్రి ముందు వాదించే ప్రయత్నం చేశారు. సీఎం అందుకు భిన్నంగా స్పందించారు. అన్నీ కరెక్టుగా ఉన్నవాటిని ఫ్రీ హోల్డ్‌ చేయకుండా ఎందుకు ఆపాలి? ఇంకెంత కాలం ప్రజలు ఇబ్బంది పడాలి? అని గట్టిగా ప్రశ్నించడంతో మంత్రి మారుమాట్లాడలేదని తెలిసింది.

Updated Date - Jul 05 , 2025 | 07:31 AM