Permanent Judges: ఆ నలుగురు అదనపు జడ్జీలకు శాశ్వత న్యాయమూర్తుల హోదా
ABN, Publish Date - Jul 29 , 2025 | 04:49 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న నలుగురు అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు.
జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి,జస్టిస్ విజయ్ పేర్లను సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం
రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత ప్రమాణం
తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు
అమరావతి/న్యూఢిల్లీ, జూలై 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న నలుగురు అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు. జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లను శాశ్వత జడ్జీలుగా నియమించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత వీరు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు. వీరు అదనపు న్యాయమూర్తులుగా 2023 అక్టోబరు 21న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కాగా.. గాడి ప్రవీణ్ కుమార్, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా మొహుద్దీన్‌లను తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఈ నెల 2న కొలీజియం చేసిన సిఫారసును కేంద్రం సోమవారం ఆమోదించింది.
Updated Date - Jul 29 , 2025 | 04:54 AM