గుల్లలమోదలోని క్షిపణి పరీక్షా కేంద్రానికి త్వరలో శంకుస్థాపన
ABN, Publish Date - Mar 17 , 2025 | 12:34 AM
ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న దివిసీమలోని గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఇప్పటికే గ్రాండ్ ఎంట్రన్స్, పరిపాలనా భవనాలు సిద్ధం కాగా, త్వరలో పరీక్షా కేంద్రానికి కూడా శంకుస్థాపన చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని, వెనువెంటనే క్షిపణి పరీక్షలు మొదలుపెట్టాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. కాగా, అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన నిమిత్తం ఏప్రిల్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగానే ఈ క్షిపణి పరీక్షా కేంద్రానికి కూడా శంకుస్థాపన చేయించాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
- ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా భూమిపూజ..?
- అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన సందర్భంలోనే..
- ఇప్పటికే గ్రాండ్ ఎంట్రన్స్, పరిపాలనా భవనం పూర్తి
- రూ.2 వేల కోట్లతో తొలిదశలో అభివృద్ధి
- భవిష్యత్తులో రూ.20 వేల కోట్ల వరకు విస్తరణ
- కీలకమైన క్షిపణుల పరీక్షలు ఇక్కడే..
ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న దివిసీమలోని గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఇప్పటికే గ్రాండ్ ఎంట్రన్స్, పరిపాలనా భవనాలు సిద్ధం కాగా, త్వరలో పరీక్షా కేంద్రానికి కూడా శంకుస్థాపన చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని, వెనువెంటనే క్షిపణి పరీక్షలు మొదలుపెట్టాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. కాగా, అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన నిమిత్తం ఏప్రిల్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగానే ఈ క్షిపణి పరీక్షా కేంద్రానికి కూడా శంకుస్థాపన చేయించాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దశాబ్దంన్నర కాలంగా ఎదురుచూస్తున్న మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ (క్షిపణి పరీక్షా కేంద్రం) శంకుస్థాపనకు కౌంట్‌డౌన్ మొదలైంది. త్వరలో నాగాయలంకలోని మిస్సైల్ టెస్టింగ్ సెంటర్‌కు భూమిపూజ జరిపేందుకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్‌లో పరిపాలనా భవనం పూర్తయింది. టెస్టింగ్ అవసరాలకు సంబంధించిన యూనిట్లను, బ్లాక్‌లను నిర్మించాల్సి ఉంది. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్రమోదీ వచ్చినపుడు ఈ మిస్సైల్ టెస్టింగ్ సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేయించే అవకాశాలున్నాయి. వాస్తవానికి ఇటీవల మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంలోనే ఆయనతో వర్చువల్‌గా శంకుస్థాపన చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో దీనిని తప్పించాల్సి వచ్చింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు కావటంతో మోదీతో ప్రత్యేకంగా భూమిపూజ చేయించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అనూహ్యంగా అమరావతి పునర్నిర్మాణ పనులకు పీఎం వస్తే తప్పకుండా ఆయనతో ఈ టెస్టింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయించాలని భావిస్తున్నారు. అమరావతి కార్యక్రమం లేకపోయినప్పటికీ త్వరలో మోదీ చేతులమీదుగానే ఈ కార్యక్రమం జరిగే అవకాశముంది.
ఏళ్ల నిరీక్షణకు తెర
ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ కార్యకలాపాలు కొద్దిరోజుల్లోనే ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర విభజన కు ముందే కేంద్ర ప్రభుత్వం ఈ మిస్సైల్ టెస్టింగ్ సెంటర్‌ను మంజూరు చేసింది. అప్పట్లో నాగాయలంక మండలం గుల్లలమోద ఆమోదయోగ్యమైనదిగా నిర్ణయించారు. గుల్లలమోద సముద్రతీర ప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల మిస్సైల్స్ టెస్టింగ్ చేసిన క్రమంలో శకలాలు సముద్రంలో పడిపోతాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదు. పర్యావరణానికి కూడా విఘాతం ఉండదని అప్పట్లో నిర్ణయించారు. ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర విభజన జరిగాక గతంలోని టీడీపీ ప్రభుత్వం చొరవ కారణంగా గుల్లలమోదలో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్‌కు సంబంధించి కదలిక వచ్చింది. 381 ఎకరాలను కేటాయించారు. ఈ భూములు కేటాయించిన ప్రాంతంలో మడ అడవులు ఉండటంతో పర్యావరణకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మడ అడవులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి భూములు కేటాయించటం వల్ల సమస్య తొలగింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ అనుమతులు కూడా అవసరం కాబట్టి కాలాతీతం జరిగింది. ఇటీవల కాలంలో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ పరిపాలనా భవ నం పనులు పూర్తయ్యాయి. కాంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ మార్గాలను అభివృద్ధి చేశారు. మిస్సైల్ టెస్టింగ్‌కు సంబంధించిన మిగిలిన విభాగాలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడకు మిస్సైల్స్ తరలించి పరీక్షించటమే తరువాయి.
భారత రక్షణ పరిశోధనల్లో కీలకం
గుల్లలమోదలో ఏర్పాటుచేసే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ భారత రక్షణ పరిశోధనలో కీలకమైనదిగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును రూ.2 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. భారత రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నిర్వహించే మిస్సైల్స్ ప్రాజెక్టుల పరీక్షలు, అభివృద్ధిలో ఈ కేంద్రం తనదైన పాత్రను పోషించనుంది.
మిస్సైల్స్ పరీక్షలు
ఈ సెంటర్‌లో ప్రధానంగా డీఆర్‌డీవో ఆవిష్కరించే అనేక రకాల మిస్సైల్స్‌ను పరీక్షిస్తారు. పరీక్షల అనంతరం గుర్తించిన అంశాలతో వీటిని మరింత అభివృద్ధి చేస్తారు. ప్రత్యేకంగా రెండు రకాల మిస్సైల్స్‌కు ఇక్కడ పరీక్షలు నిర్వహించే అవకాశముంది. దూరప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే బాలిస్టిక్ మిస్సైల్స్‌తో పాటు క్రూజ్ మిస్సైల్స్, యాంటీ మిస్సైల్స్ సిస్టమ్స్ వంటివి ఇక్కడ పరీక్షిస్తారు. మిస్సైల్ గైడెన్స్ సిస్టమ్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్‌తో పాటు అనేక కీలక సాంకేతిక విభాగాలు ఏర్పాటు చేస్తారు. సిమ్యులేషన్, డేటా విశ్లేషణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. మిస్సైల్స్‌ను పరీక్షించిన సందర్భంలో డేటాను విశ్లేషించేందుకు కంప్యూటర్ ఆధారితంగా సిమ్యులేషన్ వ్యవస్థలను ఉపయోగించుకుంటారు.
Updated Date - Mar 17 , 2025 | 12:34 AM