Women Attack: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ఇంటిపై మహిళల దాడి
ABN, Publish Date - Jul 08 , 2025 | 03:36 AM
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంపై మహిళలు దాడిచేశారు. ఫర్నిచర్, కారు ధ్వంసం చేశారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలే కారణం
ఆమె వల్ల ఆమె భర్త వేమిరెడ్డికి ప్రాణహాని ఉందన్న ప్రసన్న
ఆయన్ను నిద్రలోనే లేపేస్తారని వ్యాఖ్య
ఆగ్రహంతో మాజీ ఎమ్మెల్యే ఇంటికెళ్లిన మహిళలు
నెల్లూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంపై మహిళలు దాడిచేశారు. ఫర్నిచర్, కారు ధ్వంసం చేశారు. సోమవారం సాయంత్రం ప్రసన్న కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఓ పిచ్చోడు కాబట్టి ఆమె మాయలో పడ్డారు. ప్రభాకర్‌రెడ్డిని బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి ఆమె పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆయన కూడా ఆమె వల్ల సంతోషంగా లేరు. ఇదేమి ఖర్మని బాధపడుతున్నాడు. ఆమె వల్లే ఆయనకు ప్రాణహాని ఉంది. ఆయన్ను నిద్రలోనే లేపేస్తారు. ప్రభాకరరెడ్డన్నా.. నీకు చెబుతున్నా, నీవు నిద్రలోనే చనిపోతావు, బయటైనా ఎక్కడో ఒక చోట లేపేస్తారు, నీకు వేల కోట్ల ఆస్తులున్నాయి, మంచోడు, తెలివైన వాడని పేరుంది. జాగ్రత్తగా ఉండాలి నువ్వు’ అని అన్నారు. ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు జిల్లాలో సంచలనం రేపాయి. ఒక మహిళా ఎమ్మెల్యేనుద్దేశించి ఇంత నీచంగా మాట్లాడతారా అని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో పెద్దసంఖ్యలో నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో ప్రసన్న నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోని ఫర్నిచర్‌ను, కారును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, వైసీపీ నాయకులు హుటాహుటిన ప్రసన్న నివాసం వద్దకు చేరుకున్నారు. పోలీసులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. దీనిపై అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి సంఘటన ఇదివరకు ఎన్నడూ జరుగలేదన్నారు. 9సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవులు చేపట్టిన ఓ కుటుంబంపై ఇలా దాడి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దాడి వెనుక ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హస్తం ఉందని, వారిద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jul 08 , 2025 | 03:39 AM