Former CM YS Jagan : బట్టలూడదీయిస్తాం!
ABN, Publish Date - Feb 19 , 2025 | 03:55 AM
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులను, నాయకులను బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు.
రిటైరైనా, సముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం
టీడీపీ కలకాలం అధికారంలో ఉండదు
మళ్లీ నేను వస్తాను.. ఎవరినీ వదిలిపెట్టను
పోలీసులపై జగన్ దురుసు వ్యాఖ్యలు
జైలులో 40 నిమిషాలు వంశీతో ములాఖత్
బెదిరింపులు మానుకోవాలి.. పోలీస్ అధికారుల సంఘం డిమాండ్
విజయవాడ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పోలీసులపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి దురుసు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులను, నాయకులను బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కలకాలం తెలుగుదేశం ప్రభుత్వం ఉండబోదనీ, మళ్లీ అధికారంలోకి వస్తాననీ, ఎవరినీ వదలననీ తీవ్ర స్వరం వినిపించారు. అన్యాయంగా కేసులు పెట్టి, దిగజారిపోయి వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారీ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. విజయవాడ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మంగళవారం కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు సెల్యూట్ చేయడం మానుకోవాలని వ్యాఖ్యానించారు. ‘‘వంశీని అరెస్టు చేసేటప్పుడు ఒక సీఐ తాను ఏడాదిలో రిటైర్ అయిపోతానని చెప్పారని తెలిసింది. రిటైర్ అయినా, సప్తసముద్రాల అవతల ఉన్నా మొత్తం అందర్నీ పిలిపించి చట్టం ముందు నిలబెడతాం. ఇప్పుడు బాధితులుగా ఉన్న వారికి అప్పుడు న్యాయం చేస్తాం. అన్యాయం చేస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా శిక్షిస్తారు. అలాంటి అన్యాయంలో పోలీసులు భాగస్వాములు కావద్దు’’ అని జగన్ అన్నారు. ప్రజాస్వామ్యం దిగజారి పోయిందనడానికి వంశీ కేసు ఒక నిదర్శనమన్నారు. వంశీతో జైలు ములాఖత్‌లో సుమారు 40 నిమిషాలపాటు జగన్ మాట్లాడారు.
వంశీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా
వంశీని పది రోజులకు కస్టడీ ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్, తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ వేసిన పిటిషన్లపై విచారణను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
20 వేల కోసం పది రోజులు కస్టడీ కోరతారా?: వంశీ సతీమణి
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికేసులో ఫిర్యాదుదారు అయిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి వంశీ రూ.20 వేలు లాక్కుంటే, దాన్ని రికవరీ చేయడానికి ఆయనను పదిరోజులకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎలా పిటిషన్ వేస్తారని వంశీ సతీమణి పంకజశ్రీ ప్రశ్నించారు. జైలు ముందు ఆమె మీడియాతో మంగళవారం మాట్లాడారు. నెల్లూరు జైలుకు ముగ్గురు నిందితులు: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లొంగిపోయిన ముగ్గురు నిందితులను మంగళవారం విజయవాడ మూడో ఏసీఎంఎం కోర్టులో హాజరు పరిచారు. ఆ కేసులో ఉన్న ఏ47 షేక్ ఎంఎం కలాం, ఏ55 షేక్ సర్దార్ జానీ, ఏ68 రాచేటి రూతుమ్మలకు న్యాయమూర్తి మార్చి 4వ తేదీ వరకు రిమాండ్ విధించారు. విజయవాడ జైలులో ఖాళీ లేకపోవడంతో వారిని నెల్లూరు జైలుకు తరలించారు.
గ్లామర్‌గా ఉన్నారని టార్గెట్ చేశారు
చంద్రబాబు, లోకేశ్ కంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని గ్లామర్‌గా ఉండడం వల్లే వారిని టార్గెట్ చేశారని జగన్ అన్నారు. చంద్రబాబు సామాజికవర్గం నుంచి నేతలుగా వారిద్దరూ ఎదుగుతుండడంతో కడుపు మండుతోందన్నారు. త్వరలో ఏదో ఒక రోజున దేవినేని అవినాశ్ కూడా వారికి టార్గెట్ అవుతాడన్నారు. కాగా, జైలులోని వంశీని కలవడానికి జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, వైసీపీ నేతలు సింహాద్రి రమేశ్, కొడాలి నాని, పేర్ని నాని, నందిగం సురేశ్ ఉన్నారు. ములాఖత్‌కు వీరందరి పేర్లు జైలు అధికారులకు వైసీపీ నేతలు ఇచ్చారు. జాబితాను పరిశీలించిన జైలు అధికారులు.. జగన్, పంకజశ్రీ, సింహాద్రి రమేశ్‌కు మాత్రమే అనుమతించారు. కాగా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేశ్.. జగన్ వెంట కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Feb 19 , 2025 | 03:55 AM