House Owner : ఆయన ఎంతటివాడైతే నాకేంటి? మృతదేహం ఇంటికి తేవద్దు.. అంతే!
ABN, Publish Date - Jan 19 , 2025 | 04:59 AM
రాష్ట్ర అటవీశాఖ కీలక అధికారి విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించగా, మృతదేహాన్ని ఇంటికి తీసుకునీయరాకుండా ఇంటి యజమాని అడ్డుకున్నారు.
ఇంటి యజమాని ఆంక్షలు
విధి నిర్వహణలో గుండెపోటుతో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ మృతి
అటవీశాఖ అతిథిగృహం నుంచే అంతిమ యాత్ర
గుంటూరు సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అటవీశాఖ కీలక అధికారి విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించగా, మృతదేహాన్ని ఇంటికి తీసుకునీయరాకుండా ఇంటి యజమాని అడ్డుకున్నారు. ఈ ఘటన కుటుంబసభ్యులు, బంధువులతోపాటు తోటి అధికారులను, సిబ్బందినీ తీవ్ర వేదనకు గురిచేసింది. జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన ఇండియన్ ఫారెస్టు సర్వీసు అధికారి రమేష్ కుమార్ సుమన్(59) ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారె్‌స్టగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మంగళగిరి సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆయన జీవిత కాలమంతా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ కోసమే పాటుపడ్డారు. మడ అడవుల పెంపకం కోసం పగలూరాత్రి ప్రయాసపడ్డారు. రాష్ట్రంలోని అడవుల అభివృద్ధి, జీవవైవిధ్య పార్కులకు సంబంధించి శిక్షణ నిమిత్తం కొద్దిరోజుల క్రితం ఆయన కేరళలోని కొచ్చికి వెళ్లారు. అక్కడ శిక్షణలో ఉండగానే గుండెపోటుతో ఈ నెల 16న ఆయన మరణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రద్ధాంజలి ఘటించారు. కొచ్చి నుంచి మృతదేహాన్ని మంగళగిరిలోని ఇంటికి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఇంటి యజమాని అందుకు ఒప్పుకోలేదు. ‘ఆయన ఎంతటివాడైతే నాకేంటి?’ అని కరాఖండిగా చెప్పేశారు. దీంతో చేసేది లేక అధికారులు గుంటూరులోని అటవీశాఖ అతిథి గృహానికి మృతదేహాన్ని తరలించారు. కుటుంబ సభ్యులను, బంధువులను కూడా అతిథి గృహానికే రప్పించారు. అతిథి గృహం ఆవరణలోనే టెంటు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతదేహం వద్ద నిశ్చేష్టులుగా నిలబడిన రమేష్ భార్య, ఇద్దరు కుమార్తెల దీన స్థితిని చూసి అటవీశాఖ ఉద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. శనివారం అక్కడి నుంచే అంతిమయాత్ర మొదలైంది. కృష్ణా నది సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Updated Date - Jan 19 , 2025 | 05:00 AM