Foreign Job Scam: ఉపాధి కోసం వెళ్లారు...ఉగ్ర మూకల బారిన పడ్డారు
ABN, Publish Date - Jul 13 , 2025 | 04:12 AM
మెరుగైన ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లిన యువత ఉగ్ర, డ్రగ్స్ ముఠాల చేతుల్లో చిక్కుకోవడంతో స్థానికంగా వారి తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు. తమ పిల్లలను...
ఇన్‌స్టా ఉద్యోగ ప్రకటనతో మోసపోయిన ఇంజనీరింగ్ నిరుద్యోగులు
థాయ్‌ల్యాండ్ వచ్చిన వారిని మయన్మార్‌కు తరలింపు
డ్రగ్స్ తీసుకోవాలంటూ చిత్రహింసలు
రక్షించాలని తల్లిదండ్రులకు ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,మంత్రి లోకేశ్‌ను కలిసిన తల్లిదండ్రులు
విజయనగరం, జూలై 12(ఆంధ్రజ్యోతి): మెరుగైన ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లిన యువత ఉగ్ర, డ్రగ్స్ ముఠాల చేతుల్లో చిక్కుకోవడంతో స్థానికంగా వారి తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు. తమ పిల్లలను రక్షించి, సురక్షితంగా స్వస్థలాలకు రప్పించాలంటూ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మే నెలలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఉద్యోగ ప్రకటన వచ్చింది. ఆకర్షణీయమైన ప్యాకేజీ కావడంతో విశాఖపట్నం నుంచి ముగ్గురు, విజయనగరం నుంచి ఇద్దరు, కడప జిల్లా నుంచి నలుగురు, హైదరాబాద్ నుంచి ముగ్గురు... మొత్తం 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన థాయ్‌ల్యాండ్ ప్రతినిధులతో వారు మాట్లాడారు. ఇంజనీరింగ్ చేసి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న నిరుద్యోగ యువత... ప్రకటనదారులు చెప్పిన తీయని, ఆకర్షణీయమైన కబుర్లను నమ్మారు. వారు సూచించినట్లుగా వారివారి ప్రాంతాల నుంచి బయలుదేరి మే 9న థాయ్‌ల్యాండ్‌కు చేరుకున్నారు. థాయ్‌ల్యాండ్‌లో మొదటి రోజు చక్కగా చూసుకున్న ప్రకటనదారులు... ఆ మరుసటి రోజునే ఉద్యోగం కోసం వచ్చిన వారికి ముసుగులు వేసి మయన్మార్ తరలించారు. వారి కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారం మేరకు... ఉద్యోగార్థులందరినీ మయన్మార్‌లో ఒక నది ఒడ్డున ఉన్న క్యాంప్‌లో ఉంచారు. చిత్రహింసలు పెట్టారు. డ్రగ్స్ తీసుకోవాలంటూ ఒత్తిడి చేశారు.
నిరాకరించిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వెళ్లిన 12 మందిలో విశాఖ, హైదరాబాద్‌కు చెందిన వారు ఇద్దరు... వారి చెర నుంచి తప్పించుకొని స్వస్థలాలకు చేరుకున్నారు. మిగిలిన 10 మంది అక్కడే ఉన్నారు. ఎవరూ లేని సమయంలో తల్లిదండ్రులకు ఫోన్‌లో తమ పరిస్థితిని బాధితులు వివరించారు. తామున్న ప్రాంతం లొకేషన్‌ను షేర్ చేశారు. తమను రక్షించాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో బెంబేలెత్తిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే కడప, హైదరాబాద్ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనితలను బాధితుల కుటుంబ సభ్యులు కలిశారు. స్పందించిన పవన్ కల్యాణ్, లోకేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో మాట్లాడారు. ఆ ఉగ్రమూకల చెరలో మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది వరకూ ఉన్నట్లు సమాచారం. తాము చేసుకున్న విన్నపాలపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ లేకపోవడంతో బాధితుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలతో తమ పిల్లలను ఇళ్లకు చేర్చాలని వారు కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Updated Date - Jul 13 , 2025 | 04:17 AM