COVID 19: రాష్ట్రంలో మళ్లీ కరోనా.. విశాఖలో తొలి కేసు
ABN, Publish Date - May 23 , 2025 | 05:27 AM
విశాఖపట్నంలో మళ్లీ కరోనా తొలి కేసు నమోదు అయింది. 28 ఏళ్ల మహిళకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది, ఆమె ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంది.
28 ఏళ్ల మహిళకు కొవిడ్-19 నిర్ధారణ
అమరావతి, విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరపెడుతోంది. విశాఖపట్నంలో తొలి కేసు నమోదయింది. మద్దిలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బుధవారం ఉదయం ఆమె చలిజ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, వైద్య పరీక్షల్లో కొవిడ్-19గా నిర్ధారణ అయ్యింది. ఆరోగ్యశాఖ అధికారులు కేజీహెచ్‌లో మరోసారి శాంపిల్‌ను పరీక్షించగా, అది కూడా పాజిటివ్‌గానే నిర్ధారణ అయ్యింది. అయితే, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో వైద్యులు గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయగా, హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ వెంటనే ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మద్దిలపాలెంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులిద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలు సేకరించి కేజీహెచ్‌కు పంపించారు.
హెచ్చరికలు.. ఉపసంహరణ
ఏపీలో తొలి కొవిడ్ కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు కొవిడ్-19 జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ కోరింది. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈమేరకు గురువారం హెల్త్ డైరెక్టర్ పద్మావతి ప్రత్యేక సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. బస్సు, రైలు ప్రయాణాల్లో విధిగా మాస్కు ధరించాలని చెప్పారు. తరచూ చేతులు శుభ్రపరుచుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కేరళలో 95, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 55, కర్ణాటకలో 13, పాండిచ్చేరిలో 10 కేసులు నమోదైనట్లు తెలిపారు. ముఖ్యంగా ఫంక్షన్లు, ప్రార్థనా మందిరాల్లో జనం గుమిగూడరాదని కోరారు. జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న మాల్స్, సినిమా హాల్స్, ప్రార్థనా మందిరాలు, మార్కెట్లలో సామాజిక దూరం పాటించాలని, దీర్ఘకాలిక సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు ప్రయాణాలు మానుకోవడం మంచిదని సూచించారు. అయితే, డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సీఎంఓ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై ఒకటి రెండ్రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇలాంటి హెచ్చరికలు జారీచేయడం సరికాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News
Updated Date - May 23 , 2025 | 05:28 AM