ఎరువుల ‘మాయ’ం!
ABN, Publish Date - Aug 04 , 2025 | 01:04 AM
జిల్లాలో రైతులను యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పలువురు వ్యాపారులు ఎరువులను దాచేసి కృత్రిమ కొరతను సృష్టించి, అధిక ధరలకు విక్రయించేస్తున్నారు. వరినాట్లు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఎరువుల విక్రయాలపై నిఘా పెంచాల్సిన వ్యవసాయశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఎస్‌కేల్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు బ్లాక్‌మార్కెట్‌లో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన అధికధర చెల్లించి కొనుగోలు చేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
- అందుబాటులో లేని యూరియా, కాంప్లెక్స్ ఎరువులు
- జిల్లాలో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
- రూ.266.50 యూరియా బస్తా రూ.350 నుంచి రూ.450 విక్రయం
- జింక్ ప్యాకెట్ కొంటేనే కాంప్లెక్స్ ఎరువుల అమ్మకం అంటూ షరతు
- జిల్లాస్థాయి డీలర్ల గుప్పిట్లో ఎరువులు!
- పట్టించుకోని అధికారులు.. ఆర్థికంగా చితికిపోతున్న రైతులు
జిల్లాలో రైతులను యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పలువురు వ్యాపారులు ఎరువులను దాచేసి కృత్రిమ కొరతను సృష్టించి, అధిక ధరలకు విక్రయించేస్తున్నారు. వరినాట్లు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఎరువుల విక్రయాలపై నిఘా పెంచాల్సిన వ్యవసాయశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఎస్‌కేల్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు బ్లాక్‌మార్కెట్‌లో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన అధికధర చెల్లించి కొనుగోలు చేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
కృష్ణాజిల్లాకు సంబంధించి యూరియాతో పాటు మిగిలిన కాంప్లెక్స్ ఎరువులు మొత్తం గుడివాడ నుంచి పంపిణీ జరుగుతుంది. ఆయా కంపెనీల నుంచి వచ్చిన యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులను గుడివాడలోని గోడౌన్‌లలో దింపి, అక్కడి నుంచి ఆర్‌ఎస్‌కేలు, జిల్లా డీలర్లు, రిటైల్ వ్యాపారులకు అందజేస్తారు. ముందస్తుగా ఆర్‌ఎస్‌కేలకు మార్క్‌ఫెడ్ ద్వారా ఎరువులను డిమాండ్‌కు అనుగుణంగా పంపాలి. రైతులు పీఏసీఎస్‌ల వద్దకు వెళితే యూరియా, ఇతర ఎరువులు స్టాక్‌లేవనే సమాధానం వస్తోంది. 45 కిలోల బ్యాగ్ మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు. అది కూడా కొంతమందికే ఇచ్చి స్టాక్ అయిపోయిందని అంటున్నారు. రిటైల్ వ్యాపారుల వద్దకు వెళితే మా వద్ద స్టాక్‌లేదని, అధికధర ఇస్తామంటే తెలిసినవారి వద్ద ఉందని, కావాలంటే ఫోన్ చేసి చెబుతామని, అక్కడకు వెళ్లాలని బాహాటంగానే చెబుతున్నారు. జిల్లాకు ఇప్పటి వరకు ఎరువులు ఎంతమేర వచ్చాయనే విషయంపై సరైన సమాచారం వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించడంలేదు.
ధరలో వ్యత్యాసం
45 కిలోల యూరియా బస్తాను రూ.266.50లకు విక్రయించాలి. హోల్‌సేల్ డీలర్లు, డీలర్లు ఎరువులను దాచేసి కృత్రిమ కొరతను సృష్టించడంతో ప్రస్తుతం బ్లాక్ మార్కెట్‌లో 45 కిలోల యూరియా బస్తాను రూ.350 నుంచి రూ.450లకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇందుకు రవాణా చార్జీలు అధనం, రవాణా చార్జీలు పెట్టుకోవడానికి ఇబ్బందిలేదని, అసలు ధరకన్నా అఽఽధిక ధరను నిర్ణయించి విక్రయాలు జరుపుతున్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారుల వద్ద అధిక ధరకు యూరియాను కొనుగోలు చేయలేక రైతులు ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌ల వద్దకు వెళితే ఎరువుల కోసం ఇండెంట్ పెట్టామని, త్వరలో స్టాక్ వస్తుందని, కబురు చేసినపుడు రావాలని చెప్పి రైతులను వెనక్కు పంపేస్తున్నారు. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరకే యూరియాను రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఎరువుల దుకాణ యజమానులకు, వ్యవసాయశాఖ అధికారులకు ఉన్న అనుబంధం కారణంగా యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులను కృత్రిమ కొరత సృష్టించినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో 4.02 లక్షల ఎకరాల్లో ఈ ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు జరుగుతుందని అంచనాగా ఉంది. ఇప్పటివరకు 2.40 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. కాలువ శివారు ప్రాంతాల్లో ఇంకా వరినాట్లు వేస్తూనే ఉన్నారు. మొదటి, రెండో కోటాల్లో కాంప్లెక్స్ ఎరువులైన డీఏపీ, 28-28, 14-36, 10-26 వంటి రకాలను చల్లుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఎకరానికి కనీసంగా 25కిలోల యూరియాను కలిపి చల్లాల్సిందే.
జింక్ ప్యాకెట్ కొనుగోలు చేస్తేనే కాంప్లెక్స్ ఎరువులు
రైతులు వ్యాపారుల వద్దకు ఎరువులు కొనుగోలు చేసేందుకు వెళితే జింక్ ప్యాకెట్‌ను కొనుగోలు చేయాల్సిందేనని చెప్పి మరీ విక్రయిస్తున్నారు. డీఏపీ బస్తా రూ.1,350 ధర ఉండగా, అరకిలో జింక్ ప్యాకెట్ రూ.400 ధరపెట్టి కొనుగోలు చేయాల్సిందేనని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. అదేమని రైతులు ప్రశ్నిస్తే జిల్లా డీలర్లు తమకు కాంప్లెక్స్ ఎరువులు విక్రయించే సమయంలో జింక్‌పాకెట్లను అంటగడుతున్నారని, వాటిని మేము ఏం చేసుకుంటామని, అందుకే మీకు విక్రయిస్తున్నామని వివరిస్తున్నారు.
యూరియా ఏమైపోయింది?
ఈ సీజన్‌లో జిల్ల్లాలో 36 వేల టన్నుల యూరియా, 46 వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతుందని అంచనాగా ఉంది. మార్క్‌ఫెడ్ ద్వారా డీలర్‌లకు, ఆర్‌ఎస్‌కేలకు యూరియా, కాంప్లెక్స్ ఎరువులను పంపామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నా, ఇవి ఎటువైపునకు తరలిపోయాయో తెలియనిస్థితి. అత్యవసరస్థితిలో ఉపయోగించేందుకు మార్క్‌ఫెడ్ వద్ద బఫర్ గోడౌన్‌లో స్టాక్ ఉంచిన నాలుగు వేల టన్నుల ఎరువులను కూడా ఇటీవల తరలించేశారు. ఈ స్టాకు ఎటు తరలిపోయిందో కూడా తెలియనిస్థితి. ప్రస్తుతం రైతులు ఎరువులు అధికంగా వినియోగించేకాలం కావడంతో ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
Updated Date - Aug 04 , 2025 | 01:04 AM