ప్రాణం తీసిన అరెస్టు భయం
ABN, Publish Date - May 18 , 2025 | 01:31 AM
రొయ్యూరు కృష్ణానది ఒడ్డున పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేయటంతో అరెస్టు చేస్తారనే భయంతో ఓ వ్యక్తి పారిపోయో క్రమంలో నదీపాయలో దూకి ప్రాణాలు కోల్పోయాడు.
-రొయ్యూరు - మద్దూరు లంకలో పేకాట శిబిరం
- దాడి చేసిన తోట్లవల్లూరు పోలీసులు
- కృష్ణానదీపాయలోకి పరారవుతూ నీటిమడుగులో దూకిన ఇద్దరు
- మునిగిపోయి ఒకరు మృతి.. మరొకరు క్షేమం
- పోలీస్ స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన
తోట్లవల్లూరు/కంకిపాడు, మే 17ఆంధ్రజ్యోతి): రొయ్యూరు కృష్ణానది ఒడ్డున పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేయటంతో అరెస్టు చేస్తారనే భయంతో ఓ వ్యక్తి పారిపోయో క్రమంలో నదీపాయలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం... రొయ్యూరు - మద్దూరు లంకలో ఓ పది మంది పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న తోట్లవల్లూరు ఎస్సై సీహెచ్.అవినాష్ తన సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం పేకాట శిబిరంపై దాడి చేశారు. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు, కంకిపాడు మండలం మద్దూరు గ్రామాలకు చెందిన పదిమంది పేకాట ఆడుతున్నారు. వారు పోలీసులను చూసి పరారయ్యారు. కంకిపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన వల్లభనేని గోపాలం అలియాస్ గోపి(30), వడుగు వెంకటేశ్వరరావు పేకాట శిబిరం నుంచి కృష్ణానదీపాయలోకి పరారవుతూ నీటి మడుగులోకి దూకారు. గోపాలం నీటిలో మునిగిపోయాడు. మరోవ్యక్తి వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటకు వచ్చాడు. గోపాలం నీటిలో మునిగిపోవటంతో ఘటనా స్థలం నుంచి పోలీసులు వచ్చేశారు. ఆ తర్వాత బంధువులు వచ్చి గోపాలం మృతదేహాన్ని బయటకు తీశారు. మద్దూరు నుంచి గోపాలం బంధువులు తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్సైను కలిసి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గోపాలానికి భార్య, ఇద్దరు చిన్నారులు సంతానం. వారికి తగిన న్యాయం చేయాలని రాత్రి పొద్దుపోయో వరకు బంధువులు స్టేషన్ వద్దే ఉన్నారు.
Updated Date - May 18 , 2025 | 01:31 AM