Excise Department: ‘మద్యం ఉత్పత్తి’లో నాకేంటి
ABN, Publish Date - Apr 25 , 2025 | 04:33 AM
ఎక్సైజ్ శాఖలో ఒక అధికారి ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్(ఈఎన్‌ఏ) సరఫరా అనుమతులు జారీ చేయకుండా ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు మద్యం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయాలని కంపెనీలు నిర్ణయించాయి.
ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి చేతివాటం
ఈఎన్‌ఏ అలాట్‌మెంట్‌లో అడ్డంకులు
కంపెనీల నుంచి ముడుపుల డిమాండ్
ఫిర్యాదు చేసే యోచనలో కంపెనీలు
అనుమతులు ఆపుతున్నారని ఆవేదన
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మద్యం ఉత్పత్తి, అమ్మకాల్లో పారదర్శకత ఉండాలని ప్రభుత్వం చెబుతుంటే.. ‘ఉత్పత్తికి అనుమతిస్తే నాకేంటి’ అంటూ ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి అడ్డంకులు సృష్టిస్తున్నారు. మద్యం ఉత్పత్తికి ముడిసరుకు అయిన ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్(ఈఎన్‌ఏ) సరఫరా అనుమతులు సకాలంలో ఇవ్వకుండా మద్యం కంపెనీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో మద్యం ఉత్పత్తి అంతరాయాల మయంగా మారుతోందని కంపెనీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉండగా.. వాటిలో కొన్నింటిలో మాత్రమే ఈఎన్‌ఏ ఉత్పత్తి ఉంది. ఈఎన్‌ఏ ఉత్పత్తి లేని డిస్టిలరీల్లో మద్యం తయారు చేసుకునే కంపెనీలు.. ఫలానా డిస్టిలరీ నుంచి ఈఎన్‌ఏ తెచ్చుకుంటామని ఎక్సైజ్‌కు దరఖాస్తు చేసుకుంటాయి. లక్ష లీటర్ల వరకు అయితే మధ్య స్థాయి అధికారులు, లక్ష దాటితే ఉన్నతాధికారులు ఈఎన్‌ఏ అలాట్‌మెంట్ అనుమతులు జారీ చేయాలి. 4 లీటర్ల ఈఎన్‌ఏతో ఒక కేసు మద్యం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల ఎక్కువ కంపెనీలు లక్ష లీటర్ల కంటే తక్కువే తీసుకుంటూ ఉంటాయి. కాగా ఎక్సైజ్ శాఖలోని ఓ మధ్య స్థాయి అధికారి అనుమతులు జారీ చేయకుండా ముడుపులు డిమాండ్ చేస్తున్నారని కంపెనీలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 30కి పైగా కంపెనీలు మద్యం ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రతి కంపెనీ నెలకు ఇంత ఇవ్వాలనే డిమాండ్ పెట్టి ఆ అధికారి వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఆ మేరకు ముడుపులు సమర్పించని కంపెనీల ఫైళ్లు ఆలస్యంగా పరిష్కరిస్తున్నారని అంటున్నాయి. దీనిపై త్వరలో ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయాలని కంపెనీల ప్రతినిధులు భావిస్తున్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 25 , 2025 | 04:33 AM