ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Education: సీట్లు ఫుల్‌.. అడ్మిషన్లు డల్‌

ABN, Publish Date - Jul 28 , 2025 | 04:40 AM

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలు ఒకప్పుడు కళకళలాడుతుండేవి. కానీ, రానురాను మారుతున్న విద్యావ్యవస్థ, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిరుచుల కారణంగా

  • పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌లో భారీగా మిగిలిపోతున్న సీట్లు

  • డిప్లొమాలో మిగిలింది 34 వేలు.. ఇంజనీరింగ్‌లో భర్తీకానివి 34 వేలు.. డిగ్రీలో భర్తీ 35 శాతంలోపే

  • అయినా సీట్లు పెంచుకుంటున్న కాలేజీలు

  • అదనంగా అందుబాటులో మేనేజ్‌మెంట్‌ కోటా

రాష్ట్రంలో విద్యారంగం తీరు మారుతోంది. ఓ వైపు ఏటా వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నా కొత్త కాలేజీలు పుట్టుకొస్తున్నాయి. ఉన్న కాలేజీలు సీట్లు పెంచుకుంటున్నాయి. ఫలితంగా సీట్లున్నా.. విద్యార్థులు లేక కాలేజీలు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే డిగ్రీ కాలేజీల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పుడు ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీలు కూడా అదే దారి పడుతున్నాయి.

అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలు ఒకప్పుడు కళకళలాడుతుండేవి. కానీ, రానురాను మారుతున్న విద్యావ్యవస్థ, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిరుచుల కారణంగా పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ చదివేవారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీంతో ఆయా కాలేజీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంజనీరింగ్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో దాదాపు 34 వేల సీట్లు మిగలగా, తాజాగా పూర్తయిన పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌లోనూ 34 వేల సీట్లు భర్తీకాకుండా పోయాయి. ఇంజనీరింగ్‌లో మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. కానీ, పాలిటెక్నిక్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ పూర్తయినా మరో 34 వేల సీట్లు మిగిలిపోవడం గమనార్హం.

ఇంజనీరింగ్‌లో 33,721 మిగులు

ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల తొలి విడత కౌన్సెలింగ్‌ ఇటీవల పూర్తయింది. కన్వీనర్‌ కోటాలో 1,52,246 సీట్లు ఉంటే వాటిలో 1,18,525 భర్తీ అయ్యాయి. 33,721 సీట్లు మిగిలిపోయాయి. యూనివర్సిటీ కాలేజీల్లో 848, ప్రైవేటు యూనివర్సిటీల్లో 1,111 సీట్లు మిగిలాయి. ప్రైవేటు కాలేజీల్లో ఏకంగా 31,762 సీట్లు భర్తీ కాలేదు. ఈ సంవత్సరం రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఏఐసీటీఈ 2 లక్షలకు పైగా సీట్లు మంజూరు చేసింది. వీటిలో మేనేజ్‌మెంట్‌ కోటాలో దాదాపు 50 వేల సీట్లు ఉన్నాయి. కన్వీనర్‌ కోటాలో అన్ని విడతల్లోనూ సీట్లు భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే అందులోనూ కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు మినహా ఇతర కోర్‌ గ్రూపుల్లో సీట్లు అలాగే ఉండిపోతున్నాయి. అయితే ఎక్కువ కాలేజీల్లో అసలు మేనేజ్‌మెంట్‌ కోటా అవసరమే ఉండడం లేదు. మారుమూల ప్రాంతాల్లో, పెద్దగా పేరు లేని కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీ కావడమే గగనమైంది. దీంతో కన్వీనర్‌ కోటా అయినా పూర్తిగా భర్తీ చేసుకోవాలని ఆయా కాలేజీలు నానా పాట్లు పడుతున్నాయి.

గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు పెరుగుతున్నాయి. అనేక మంది విద్యార్థులు తొలుత ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రయత్నించి అక్కడ సీటు రాకపోతే ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారు. టాప్‌ ర్యాంకర్లు ఎవరూ ప్రైవేటు కాలేజీల్లో చేరట్లేదు. రాష్ట్రంలో కొత్తగా కొన్ని కాలేజీలు డీమ్డ్‌ యూనివర్సిటీలుగా మారడంతో ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లను ప్రభావితం చేస్తోందని తెలుస్తోంది.

ఇంజనీరింగ్‌ కోసమే డిప్లొమా

ఒకప్పుడు డిప్లొమా కోర్సులకు విపరీతమైన డిమాండ్‌ ఉండేది. కానీ, ఇప్పుడు డిప్లొమా అంటే ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఒక మార్గంగానే విద్యార్థులు భావిస్తున్నారు. 90శాతం పాలిటెక్నిక్‌ విద్యార్థులు కోర్సు పూర్తవగానే ఈసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో చేరుతున్నారు. డిప్లొమాతో ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉన్నా వాటివైపు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఉత్సాహంతో దాదాపు అందరూ ఇంజనీరింగ్‌ బాట పడుతున్నారు. దీంతో పాలిటెక్నిక్‌లో అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దాదాపు సగం సీట్లు మిగిలిపోతున్నాయి. 2025-26లో రాష్ట్రవ్యాప్తంగా 79,367 సీట్లు అందుబాటులో ఉంటే వీటిలో 45,283(57శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. 34,084 సీట్లు మిగిలిపోయాయి. వీటిలోనూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో అడ్మిషన్లు కొంత మెరుగ్గానే ఉన్నా, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 46శాతం సీట్లు మిగిలిపోయాయి.

డిగ్రీ.. మరీ దారుణం

ఇంజనీరింగ్‌ విద్య పెరిగిన తర్వాత సాధారణ డిగ్రీ కోర్సుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇంజనీరింగ్‌లో సీటు రానివారు, ఊర్లోనే ఉంటూ చదువుకోవాలనుకునేవారు, డిగ్రీలో బీసీఏ, బీబీఏ, డేటా సైన్స్‌లాంటి కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో 1,200 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 4.5 లక్షల సీట్లు ఉండగా, గత మూడేళ్ల నుంచి లక్షన్నర సీట్లు దాటి భర్తీ కావడం లేదు. అంటే సగటున 33శాతం సీట్లు మాత్రమే నిండుతున్నాయి. కొన్ని కాలేజీల్లో 5-10 శాతం సీట్లు కూడా భర్తీ కావట్లేదు. ఇక, డిగ్రీ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాను చాలా కాలేజీలు ఎప్పుడో తీసేశాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రముఖ కాలేజీల్లో కొన్ని కోర్సుల్లో మాత్రమే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు నిండుతున్నాయి. 270 కాలేజీల్లో గత మూడేళ్లలో 25శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. దీంతో అసలు మేనేజ్‌మెంట్‌ కోటానే రద్దుచేయాలని డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటా రద్దుచేస్తే కొన్ని కోర్సుల సీట్లయినా వంద శాతం భర్తీ అవుతాయిని యాజమాన్యాలు భావిస్తున్నాయి.

విద్యార్థుల్లోనూ మూస ధోరణి

విద్యార్థులు, తల్లిదండ్రుల్లోనూ మూస ధోరణి పెరుగుతోంది. ఎక్కువ మంది ఏం చదివితే అదే చదవాలి అనే ఆలోచనా విధానమే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా ఏం చదవాలనేది నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు పదో తరగతి, ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను కూడా ఇంజనీరింగ్‌ చదివించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంజనీరింగ్‌ కాలేజీలు అందుబాటులోకి రావడంతో ఏదో ఒక కోర్సు అయినా ఇంజనీరింగ్‌లోనే చేర్పిస్తున్నారు. ఐటీఐ, ఇతర వృత్తి విద్య కోర్సుల్లో అడ్మిషన్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

డిప్లొమా అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ పూర్తి

రాష్ట్రంలో 88 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 17,943 సీట్లు అందుబాటులో ఉంటే 11,954(67శాతం) భర్తీ అయ్యాయి. 5,987 మిగిలిపోయాయి. 165 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 61,424 సీట్లు ఉండగా వాటిలో 33,329(54శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. తుది విడత కౌన్సెలింగ్‌లో 4,628 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. పాలీసెట్‌లో మొత్తం 1,33,359 మంది అర్హత సాధించారు. వారిలో 49,707 మంది కౌన్సెలింగ్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. కాగా, ఈ నెల 14 నుంచే డిప్లొమా తరగతులు ప్రారంభమయ్యాయి. తుదిదశలో సీట్లు పొందినవారు సోమవారం నుంచి ఈ నెల 30లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో

బద్వేల్‌లో ఉప ఎన్నిక‌.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 04:45 AM