సత్యదేవా.. ఏమిటీ వైపరీత్యం?
ABN, Publish Date - Jun 05 , 2025 | 01:37 AM
ఏ ఇంట శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చేది అన్నవరం సత్యదేవుడి వ్రతం. ఈ ఆలయం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది.
అన్నవరం దేవస్థానంలో ఇటీవల వరుస వివాదాలు
ఆలయ ప్రతిష్ట మసకబారే ప్రమాదం
కొందరు ఉద్యోగుల్లో బాధ్యతారాహిత్యం.. మరికొందరిలో నిర్లక్ష్యం
(ఆంధ్రజ్యోతి-అన్నవరం)
ఏ ఇంట శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చేది అన్నవరం సత్యదేవుడి వ్రతం. ఈ ఆలయం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. కానీ ప్రస్తుతం వరుస వివాదాలతో ఆలయ ప్రతిష్ట మసకబారే ప్రమాదం పొంచిఉంది. ఈ వివాదాలకు ప్రధాన కారణం కొందరు ఉద్యోగుల్లో బాధ్యతారాహిత్యం, మరికొందరు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుం డడమే కారణం. దీనికితోడు సిబ్బందిని సమన్వ యం చేసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో మితిమీరిన అవినీతి కనిపించినా వివాదాలు రచ్చకెక్కలేదు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నతాధికారికి అవినీతి ఆనవాళ్లు లేకపోయినా అనుభవరాహిత్యంతో ఇతర విభాగాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. ఒక ఏఈవో దేవస్థానానికి జమచేయాల్సిన నగదు రూ.98 వేలు సొంతానికి వాడుకున్నాడు. ఇది రుజువుకావడంతో ఆ మొత్తం ఏఈవోతో దేవస్థానానికి జమ చేయించారు. ఇక రెండు వర్గాలుగా ఉన్న ఉద్యోగుల్లో ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని చూసినా ఎవరికీ అవకాశం దక్కలేదు. ఆలయ వ్యవహారాల్లో ఈవో కుమారుడు పెత్తనం చేయడం అప్పట్లో ఈవో వెన్నంటి ఉండే ఒక సూపరింటెండెంట్ వ్యవహారశైలితో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగుల్లో కొందరు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ.. మరికొందరు సెలవు పెట్టడంతో వివాదం రాజుకుంది. దీనిపై పరిస్థితిని చక్కదిద్దేందుకు దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ విచారణ అధికారిగా అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్ విచ్చేసి నివేదికను సమర్పించారు. ఇందులో ఈవో అవినీతికి పాల్పడలేదని, సిబ్బందిని సమన్వయం చేసుకోలేకపోయారని పొందుపరిచినట్టు సమాచారం. తదనంతరం భక్తుల సౌకర్యాల కల్పనలో అందుతున్న సేవలపై ప్రభుత్వం చేపట్టిన ఐవీఆర్‌ఎస్ సర్వే ల్లో అన్నవరం దేవస్థానం చివరి స్థానానికి చేరడంతో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ నెలకొకసారి పర్యటించి పరిస్థితిని చక్కదిద్దారు. నీటి ఎద్దడి సాకుగా చూపించి దేవస్థానంలో మండు వేసవిలో భక్తులకు ఏసీ గదులు కేటాయించకుండా ఈవో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్ కలుగజేసుకుని ప్రత్యామ్నాయ మార్గం వెతకాలని.. ఏసీ గదుల కేటాయింపు నిలుపుదల చేయడం సరికాదని సుతిమెత్తగా హెచ్చరించడంతో యథావిధిగా గదుల కేటాయింపు చేపట్టారు. సత్యదేవుడి కల్యాణోత్సవాల సమయంలో పలు ఆర్జిత సేవలను నిలుపుదల చేసిన సమయంలో వైదిక కమిటీ గతంలో నిర్వహించిన చండీ, ప్రత్యంగిర హోమాలను అదనంగా నిలుపుదల చేయడం వివాదాస్పదమైంది. దీంతో శృంగేరీపీఠాధిపతుల సూచనలతో ఏకీభవించి వారి అభిప్రాయం తీసుకోవాలని దానికి అనుగుణంగా నడుచుకోవాలని చైర్మన్ తెలపడంతో సద్దుమణిగింది. దేవస్థానంలో సేవ చేసేందుకు తెలంగాణ నుంచి విచ్చేసిన సేవా బృందంపై ఏఈవో దురుసుగా ప్రవర్తించడం తక్షణమే కొండ దిగి వెళ్లిపోవాలని లేకుంటే కేసులు పెడతామని హెచ్చరించడంతో విషయం వివాదాస్పదమైంది. దీంతో సేవకులకు అన్ని సౌకర్యాలు కల్పించి ఏఈవోకు షోకాజు నోటీసు జారీ చేశారు. సత్యదేవుడి దివ్యకల్యాణోత్సవాల్లో శ్రీపుష్పయోగం రోజున తన భార్యపై ఏఈవో అసభ్యకరంగా తాకి తోయడంతో నేరుగా ఆ భక్తుడు సీఎంవోకు ఫిర్యాదు చేయడంతో మరో వివాదం తెరమీదకొచ్చింది. దీంతో ఆ ఏఈవోను ఆలయ విభాగ బాధ్యతల నుంచి తప్పించి మరో విభాగానికి మార్చారు. రెండురోజుల కిందట సీఆర్వోలో గదులు ఖాళీలున్నా కేటాయించకపోవడంతో భక్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి ఈవో సీఆర్వో కార్యాలయానికి చేరుకుని భక్తులకు దగ్గరుండి గదులను ఇప్పించారు. దీనికి అక్కడ పనిచేసే కౌంటర్ గుమస్తాల నిర్లక్ష్యం కారణంగా బాధ్యులను చేస్తూ ఇద్దరిని సస్పెండ్ చేశారు.
క్షేత్ర స్థాయిలో తెలుసుకుంటేనే..
ఈవో క్షేత్రస్థాయిలో తిరగకుండా కేవలం సమీక్షలు, సమావేశాలతో పాలన సాగించడంతో ఈ వివాదాలు పెరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. సిబ్బంది సైతం బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల జీతభత్యాలు, ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్లు అన్నీ.. దేవస్థానం ఖజానా నుంచి చెల్లించాలంటే భక్తుల పట్ల మర్యాదగా మెలగడం ద్వారా స్వామి సన్నిధిలోకి వివిధ రూపాల్లో ఆదాయం పెరుగుతుందని పలువురు సూచిస్తున్నారు.
Updated Date - Jun 05 , 2025 | 01:37 AM