తెలుగు..వెలుగు!
ABN, Publish Date - May 21 , 2025 | 12:53 AM
ప్రభుత్వం మారింది.. తెలుగుకు వెలుగొచ్చింది.. రాజమ హేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
సీఎం చొరవతో కేబినెట్ ఆమోదం
రాజమండ్రిలో ప్రధాన కార్యాలయం
1986లో పీఠానికి ఎన్టీఆర్ శంకుస్థాపన
గోదావరి జిల్లాల్లో హర్షాతిరేకాలు
రాష్ట్ర విభజన తర్వాత తొలి వర్శిటీ
55 ఎకరాలు ఇస్తే మిగిలింది 20 ఎకరాలే
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం మారింది.. తెలుగుకు వెలుగొచ్చింది.. రాజమ హేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. నోటిఫికేషన్ జారీకి ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటకు మార్గం సుగమమైంది. గోదావరి ప్రజల కోరిక తీరింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాల యం ఉనికి కోల్పోయింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న విశ్వవిద్యాలయం పేరు మార్పుతోపాటు, ఏపీలోని తెలుగు వర్శిటీకి సంబంధించిన మూడు పీఠాల నిర్వహణ అధ్వాన మైంది. 2016 వరకూ ఇక్కడ అన్ని కోర్సులు జరిగాయి. బొమ్మూరులోని తెలుగు పీఠంలో 2024- 25 నుంచి మొత్తం అడ్మిషన్లు ఆగిపోయాయి. ఈ నెల 3వ తేదీన ఎంఎ తెలుగు చివరి బ్యాచ్ పరీక్షలు పూర్తవడంతో ఈపీఠం ఉనికి ప్రశ్నార్థక మైంది. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందిం చింది.దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు కళలకు పూర్వ వైభ వం వస్తుందనే అభిప్రాయం చిగురించింది. ఇక్కడ ఉద్యోగు లకు జీతాలు రాని పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓఎస్‌డీని నియమించి జీతాలు ఇస్తున్నారు.
1986లో ఆరంభించిన ఎన్‌టీఆర్..
తెలుగు సాంస్కృతిక, సాహిత్య వైభవం విరజిల్లిన ప్రాంతం రాజమహేంద్రవరం..ఈ నేపథ్యంలో 1986 ఏప్రిల్‌లో తెలు గుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీఆర్ తెలుగు భాషను ప్రోత్సహించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయంలో భాగంగా బొమ్మూరులో పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయ పీఠం ఏర్పాటుకు స్వయం గా శంకుస్థాపన చేశారు.శ్రీశైలం, కూచిపూడిలలో కూడా తెలుగు విశ్వవిద్యాలయ పీఠాలు ఏర్పాటు చేశారు. రాజమ హేంద్రవరంలో బొమ్మూరు కొండ మీద సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అడ్మిస్ర్టేషన్ భవనం, తరగ తుల నిర్వహణ, హాస్టల్, హాస్టల్ మెస్, నాలుగు క్వార్టర్స్ నిర్మించారు. బొమ్మూరు తెలుగు పీఠం ఓ వెలుగు వెలిగింది. విభజన నేపథ్యంలో పీఠం శిఽఽథిలస్థితికి చేరింది. క్యాబినెట్ నిర్ణయంతో మళ్లీ జీవం పోసుకుని ఇక్కడ తెలుగు విశ్వ విద్యాలయంగా విరాజిల్లనుంది. తొలి పీఠాధిపతిగా కొత్తపల్లి వీరభద్రరావు నియ మితులయ్యారు. ఎండ్లూరి సుధాకర్ హయాంలో రాష్ట్ర విభజన రావడంతో ఇది పూర్తిగా దెబ్బ తింది. ఇక్కడ తెలుగు ఎంఎ,ఎంఫిల్, పీహెచ్‌డీ తరగతులు నిర్వ హించేవారు. మొదట తరగతికి 25 మంది విద్యార్థులతో ఇది మొదలైంది. తర్వాత 30కి పెరిగింది. ఆరుగురు టీచింగ్ స్టాఫ్, 12 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండేవారు. ఇక్కడ ప్రముఖ ప్రవచనకారుడు గరికిపాటి నరసింహారావు మొదటి ఎంఫిల్ పట్టాపొందారు.ప్రముఖకవి అద్దేపల్లి రామ్మోహన రావు, విమర్శ కుడు ద్వానాశాస్ర్తి ఇక్కడ పీహెచ్‌డీ చేశారు. మారిషన్ దేశం నుంచి వచ్చి ఇద్దరు ఇక్కడ పీహెచ్‌డీలు చేశారు.ఇక్కడ 300 మంది పీహెచ్‌డీలు చేయగా, సుమారు 450 మంది ఎంఫిల్ చేశారు. సుమారు 550 మంది తెలుగు ఎంఎ చేశారు. కాలువ మల్లయ్య వంటి ప్రముఖ కథా రచయితలు ఇక్కడ గోష్ఠుల్లో పాల్గొనడం గమనార్హం. ఇక్కడ 14 మంది ఉద్యోగులు మాత్రం ఉన్నారు. భవనాలు సుమా రుగా శిఽథిలమయ్యాయి. కేవలం 20 ఎకరాల భూమి మిగి లింది. 29 వేల పుస్తకాలతో గ్రంథాలయం మాత్రం ఉంది.
కేబినెట్‌లో ఏం జరిగిందంటే..
అమరావతిలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చట్టం 1985 లోని సెక్షన్ 3(2) ప్రకారం రాజమహేంద్రవరంలో ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఏపీలో విశ్వ విద్యాలయం కార్యకలాపాలు ప్రారంభానికి వీలు కల్పించింది. ఏపీలో ఉన్న మూడు సాహిత్య పీఠాలను నిర్వహణకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పనిచేస్తుందని కేబి నెట్ విశదీకరించింది. రాజమహేంద్రవరంలో తెలుగు వర్శిటీ ఏర్పాటుపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - May 21 , 2025 | 12:53 AM