ప్రత్యేక..పర్యవీక్షణ!
ABN, Publish Date - Jun 23 , 2025 | 12:32 AM
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 22 ప్రముఖ ఆలయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించగా వాటిలో అన్నవరం, వాడపల్లి ఆలయాలు ఉన్నాయి.
భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం
అన్నవరం, వాడపల్లి ఆలయాలు ఎంపిక
ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
ఆలయాలపై ప్రత్యేక దృష్టిపెట్టేలా బాధ్యత
అన్నవరంలో యథేచ్ఛగా భక్తుల దోపిడీ
(అన్నవరం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 22 ప్రముఖ ఆలయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించగా వాటిలో అన్నవరం, వాడపల్లి ఆలయాలు ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం శానిటేషన్, క్యూ లైన్లు, నాణ్యమైన ప్రసాదం, అన్నదానంలో రుచి, శుచి తదితర సౌకర్యాలపై ప్రత్యేకాధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి సమీక్షలు నిర్వహించి దేవదాయశాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలి. దీంతో ఆ రెండు ఆలయాల్లో ఇకపై మార్పులు వచ్చే అవకాశం ఉంది. అన్నవరం సత్యదేవుడు భక్తుల ఆరా ధ్యదైవం. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా సత్యనారాయణస్వామిని కొలుస్తుంటారు. నిత్యం ఈ ఆలయం రద్దీగానే ఉంటుంది.శని, ఆదివారాలు వారాంతాలు కావడంతో మరింతగా భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడ భక్తులకు సౌకర్యాల కల్పనలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ప్రతినెలా ఐవీఆర్‌ఎస్ సర్వే కూడా నిర్వహిస్తోంది. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని ఆయా ఆలయాలకు ర్యాంక్‌లు ప్రకటిస్తూ వచ్చింది. ఐదు నెలలుగా ఈ సర్వే నిర్వహిస్తుండగా తొలి నెలలో అన్నవరం దేవస్థానం చివరిర్యాంక్ సాధించింది. కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టిసారించడంతో కొంత పరిస్థితి మెరుగుపడినా అసంతృప్తి కొనసాగింది. సౌకర్యాలను మెరుగుపర్చేందుకు ప్రత్యేక అధికారుల నియామకంలో భాగంగా అన్నవరం దేవస్థానానికి ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ త్రినాధరావును నియమించారు.ఆయన ఆర్‌జేసీతో పాటు సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లు అన్నవరం ఆలయ ఈవోగా పనిచేయడంతో ఆయనకు అన్నవరం దేవస్థానంపై పూర్తి అవగాహన ఉంది.
దర్శనంలో జాప్యం
సాధారణ రోజుల్లో భక్తులకు అన్నవరం దేవస్థానంలో తక్కువ సమయంలో దర్శనం పూర్తవుతున్నా రద్దీ రోజులు, పర్వదినాల్లో సంతృప్తికరంగా ఉండడంలేదనే సమాధానం వస్తోంది. ఐవీఆర్ ఎస్‌లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా 370 మంది పనిచేస్తున్నారు. మరో 30 మంది వరకు దేవస్థానం నుంచి నేరుగా జీతాలు పొందుతారు. దేవస్థానం ద్వారా నేరుగా జీతాలు పొందే కార్మికులు భక్తుల నుంచి డబ్బులు వసూలుపై దృష్టిపెట్టి శానిటేషన్‌ను గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏజెన్సీ ద్వారా పనిచేసే కార్మికులకు కొన్నిచోట్ల పనిలేకపోయినా అక్కడే ఉంచుతున్నారు. వీరిని పరిస్థితిని బట్టి మిగిలిన చోట్ల వినియోగించుకుంటే మరింత పరిశుభ్ర వాతావరణం ఉంటుంది. మరోపక్క న్యూ, ఓల్డ్ సెంటినరీ, సీతారామ సత్రాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు పూర్తిస్థాయిలో సేవలందించడం లేదనే విమర్శలున్నాయి. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ అధ్వానంగా ఉండడంతో ఐవీఆర్‌ఎస్‌లో 40 శాతం మంది శానిటేషన్ నిర్వహణ సరిగా లేదనే సమాధానం ఇస్తున్నారు. దేవస్థానానికి విచ్చేసే భక్తులకు వివాహాలు, రద్దీరోజుల్లో గదులు లభించక కొంత అసంతృప్తి చెందుతున్నారు. మొత్తం 450 గదులు మాత్రమే ఉండడంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాదం ఆలస్యం కావడంతో భక్తులనుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.అన్నప్రసాద భవనంలో ఒకసారి 400 మందికి మాత్రమే తినే అవకాశం ఉండడంతో గంటసేపు నిరీక్షించాల్సి వస్తోంది. ఇటీవల కలెక్టర్ ఆదేశాలతో బఫే విధానం పెట్టినా పూర్తిస్థాయి భవనం లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రసాద్ స్కీం ద్వారా నూతన అన్నదాన భవనం నిర్మించేందుకు అనుమతులు వచ్చినా టెండర్ ఖరారు ప్రక్రియ పూర్తికాలేదు.
అన్నవరంలో మహాదోపిడీ..
అన్నవరం దేవస్థానంలో భక్తుల దోపిడీ అధికంగా ఉంది. వ్రతం సామగ్రి ఆలయ ధరల ప్రకారం రూ.180 ఉంటే షాపుల వద్ద రూ.300లు వసూలు చేస్తున్నారు. అందులో కేవలం 6 కొబ్బరి కాయలు, ఆరు అరటి పండ్లు, ఆకులు తీసేసిన తులసి కొమ్మలు, పది పువ్వులు ఉంటున్నాయి. టీ రూ.10లు ఉంటే రూ. 20 వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి వస్తువుపై అధిక దోపిడీ చేస్తున్నారు. ఒక గుండు కొట్టించుకుంటే రూ.50 ఇవ్వాల్సిందే. అయినా పట్టించుకునేవారే లేరు. మరో వైపు ఆలయ అర్చకులు ప్రతి ద్వారం వద్ద డైరెక్టుగా దక్షిణకు డిమాండ్ చేయడం పరి పాటిగా మారింది. ఈ ఆలయ ఆవరణలో ఎంత ఎక్కువ దక్షిణ ఇస్తే అంత బాగా దర్శనం జరుగుతుంది. ఆలయ ఆవరణలో మద్యం విక్రయాలు సాగుతు న్నాయి.వాడపల్లిలో కూడా ఇదే పరిస్థితి ఉంది.భక్తులు అధిక సంఖ్యలో దోపిడీకి గురవుతున్నారు. దేవదాయ శాఖాధికారులు సామాన్యుడిలా ఆయా షాపుల్లో తని ఖీలు చేస్తే దోపిడీదారులు పట్టుబడే అవకాశం ఉంటుంది. ప్రొటోకాల్ పాటిస్తే వాళ్లు అదే చేస్తారు.
వాడపల్లి వెళ్లినా ఇబ్బందే..
(ఆత్రేయపురం-ఆంధ్రజ్యోతి)
ఎర్రచందన స్వరూపుడైన వాడపల్లి వెంకటేశ్వరస్వామి మహిమాన్వితుడు.ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలంగా భావిస్తూ భక్తజనం స్వామివారికి ఏడు ప్రదక్షిణల నోము ఆచరిస్తున్నారు. కోరిన కోర్కెలు నెరవేరడంతో ప్రతి శనివారం 50 వేల నుంచి 70 వేల మంది భక్తులు తరలివస్తున్నా రు. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. 300 మంది సిబ్బం ది క్షేత్రంలో విధులు నిర్వహిస్తున్నారు. 2023లో ఈ క్షేత్రానికి డిప్యూటీ కమిషనర్ హోదా దక్కింది.స్వామి వార్షికాదాయం రూ.25 కోట్లకు చేరుకుంది. డిప్యూటీ కమిషనర్‌గా నల్లం సూర్యచక్రధరరావు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆలయంలో కొన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. పార్కింగ్ ప్రదేశం బురదమయం. వర్షం వస్తే మరీ అధ్వానం. వాహనాల పార్కింగ్‌కు స్థలం లేదు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరుగుదొడ్లు లేవు.క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.అన్నదాన భవనం వద్ద సౌకర్యాలు అంతంతమాత్రమే.వసతి గదుల్లేక భక్తులు ఇబ్బందులు ప డుతున్నారు.ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి చర్యలు చేపట్టి ఈ సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.
Updated Date - Jun 23 , 2025 | 12:32 AM