కొడుకు.. కుట్ర!
ABN, Publish Date - Aug 03 , 2025 | 12:45 AM
బీమా సొమ్ముల కోసం మానవత్వాన్ని మంటకలిపి కన్న తండ్రినే చంపాలనుకున్నాడు కొడుకు. మోటారుసైకిల్‌పై వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొన్నాడు. పైగా గుర్తు తెలియని వాహనం ఢీకొందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసువిచారణలో ఆలస్యంగా నిజాలు బయటపడడంతో కటకటాల పాలయ్యాడు.
బీమా కోసం మానవత్వాన్ని
మంటకలిపి కన్నతండ్రిపై కొడుకు హత్యాయత్నం
ప్రాణాలతో బయటపడ్డ తండ్రి
కటకటాల పాలైన కొడుకు
బీమా సొమ్ముల కోసం మానవత్వాన్ని మంటకలిపి కన్న తండ్రినే చంపాలనుకున్నాడు కొడుకు. మోటారుసైకిల్‌పై వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొన్నాడు. పైగా గుర్తు తెలియని వాహనం ఢీకొందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసువిచారణలో ఆలస్యంగా నిజాలు బయటపడడంతో కటకటాల పాలయ్యాడు.
అమలాపురం రూరల్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): హత్యాయత్నం కేసులో విప్పర్తి హర్షవర్థన్‌ను అమలాపురం తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను శనివారం అమలాపురం తాలూకా ఎస్‌ఐ వై.శేఖరబాబు విలేకర్లకు వివరించారు. కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సాకుర్రుకు చెందిన విప్పర్తి వెంకటరమణ వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి కుమారుడైన హర్షవర్థన్ కంప్యూటర్‌లో డిప్లమో పూర్తిచేసి ఖాళీగా ఉంటున్నాడు. వైసీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అనుంగ అనుచరుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇటీవల హర్షవర్ధన్ సోదరి వివాహం చేశాడు. ఇల్లు కూడా కట్టుకున్నాడు. అయితే అప్పులు పెరిగిపోవడంతో తండ్రి వెంకటరమణ కోరమండల్ ఫైనాన్స్‌లో రూ.13లక్షలు రుణంగా తీసుకున్నాడు. అదే సమయంలో ఇన్సూరెన్సు ప్రీమియం కింద రూ.20వేలు కట్ చేశారు. ఆ విషయాన్ని అప్పట్లోనే హర్షవర్థన్ మదిలో పెట్టుకున్నాడు. అంతే తండ్రిని చంపేస్తే తన ఈఎంఐల బాధ ఉండదు. ఇన్సూరెన్సు వస్తుందని పక్కా పథక రచన చేశాడు.
రూ.500 కావాలని పిలిచి..
ఏప్రిల్ 21న ఓ ఇన్నోవా కారును దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వద్ద అద్దెకు తీసుకున్నాడు. పేరూరు వై.జంక్షన్‌లో కారుతో వెళ్లి తండ్రి వెంకటరమణకు ఫోన్ చేసి అర్జెంటుగా రూ.500 కావాలని చెప్పాడు. కొడుకుకు ఏ అవసరం వచ్చిందోనని మోటారుసైకిల్‌పై వెంకటరమణ భట్నవిల్లి బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్నాడు. తర్వాత స్వగ్రామమైన సాకుర్రు వెళ్లేందుకు బైపాస్ రోడ్డులో వెంకటరమణ మోటారుసైకిల్‌పై బయలుదేరాడు. కామనగరువు సమీపంలో తండ్రి బైక్‌ను కారుతో వేగంగా వచ్చి హర్షవర్థన్ ఢీకొన్నాడు. తండ్రి చనిపోయాడని భావించి డ్యామేజ్ అయిన కారును తీసుకుని రోళ్లపాలెంలోని ఖాళీ స్థలంలో వదిలేసి హర్షవర్థన్ బయటపడ్డాడు. బైపాస్ రోడ్డులో తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న వెంకటరమణను స్థానికులు గుర్తించారు. అతడి వద్దనున్న సెల్‌ఫోన్‌లో చివరిగా ఫోన్ మాట్లాడిన కొడుకు హర్షవర్థన్‌కు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో చేసేదేదిలేక తండ్రిని కిమ్స్ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు అమలాపురం తాలూకా పోలీసులు ఏప్రిల్ 22న కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ వై.శేఖర్‌బాబు కేసు దర్యాప్తు చేపట్టారు.
పట్టించిన కారు..
తెలుపురంగు కారు గుద్ది వెళ్లినట్టు స్థానికులు చెప్పారు. అయితే బైపాస్ రోడ్డుకు సమీపంలోనే డ్యామేజ్ అయిన కారును ఉంచిన విషయాన్ని ఆ తోట యజమాని పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. అది కూడా తెల్లకారే కావడంతో ఆ కారే ప్రమాదానికి వినియోగించిన కారుగా భావించారు. ఇన్నోవా కార్లను రాజమహేంద్రవరంలో కంపెనీ షోరూం వద్ద మరమ్మతులు చేస్తారని గుర్తించి అక్కడికి వెళ్లారు. ప్రమాదం జరిగిన తరువాత ఇప్పటి వరకు ఎన్నికార్లకు మరమ్మతులు చేశారో రికార్డులు పరిశీలించగా 5 తెలుపురంగు కార్లను గుర్తించారు. అయితే వాటిలో నాలుగు కార్లు కేవలం సర్వీసింగ్‌కు వచ్చినట్టు గుర్తించారు. ఒక కారు మాత్రం మరమ్మతులు చేసినట్టు గుర్తించి సంబంధిత నంబరుకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. చెట్టును ఢీకొనడం వల్ల ముందు భాగం దెబ్బతిందని చెప్పడంతో కారు యజమాని దుర్గాప్రసాద్ కొన్ని రోజుల అనంతరం అక్కడి నుంచి కారును తీసుకువెళ్లి మరమ్మతులు చేయించుకున్నట్టు చెప్పాడు. అంతేకాకుండా హర్షవర్థన్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే సూచించడంతో హర్షవర్థనే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈనెల 1న సాయంత్రం సాకుర్రు పీఆర్వో అయినాపురపు కృష్ణ ఎదుట హర్షవర్ధన్ లొంగిపోవడంతో పోలీసులకు ఆయన సమాచారం అందించాడు. హర్షవర్థన్‌ను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శేఖర్‌బాబు తెలిపారు. అమలాపురం ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరుచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. తండ్రిని చంపేందుకు ఉపయోగించిన ఇన్నోవా క్రిష్టా కారును సీజ్ చేశామన్నారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన రూరల్ సీఐ డి.ప్రశాంత్‌కుమార్, ఎస్‌ఐ శేఖర్‌బాబు, సిబ్బంది సీహెచ్ ఏసుబాబు, ఎం.నాగరాజు, కె.ఫణీంద్రకుమార్‌ను ఎస్పీ బి.కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. కొడుకే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలుసుకున్న తండ్రి తల్లడిల్లి పోయాడు. పోలీసుల అదుపులో ఉన్న కొడుకుకు తండ్రే శనివారం భోజనం క్యారేజీ తీసుకురావడం చూసి అందరిక కళ్లు చెమర్చాయి.
Updated Date - Aug 03 , 2025 | 12:45 AM