ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త కార్డుకు కష్టాలు

ABN, Publish Date - May 16 , 2025 | 01:08 AM

కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఆనందం ఆన్‌లైన్‌ కష్టాలతో ఆవిరైపోతోంది. దరఖాస్తులకు పెట్టిన నిబంధనలతో ప్రజలు సచివాలయాల చుట్టూ ప్రద క్షిణలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులతడకగా ఉన్న హౌస్‌ మ్యాపింగ్‌ను ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణకు ప్రామాణికంగా తీసుకోవడంతో పాట్లు తప్పట్లేదు.

  • నూతన రేషన్‌కార్డులకు ఆన్‌లైన్‌లో అవస్థ

  • మ్యాపింగ్‌ ఆధారంగానే దరఖాస్తుల స్వీకరణ

  • నాటి హౌస్‌మ్యాపింగ్‌లో పలు లోపాలు

  • కొత్త కార్డుల జారీకి అదే ప్రామాణికం

  • మ్యారేజ్‌ సర్టిఫికెట్‌కు తంటాలు

  • అవసరం లేదంటున్న మంత్రి నాదెండ్ల

  • బయోమెట్రిక్స్‌ పడకుంటే నో ఛాన్స్‌

  • ఓటీపీ ఆప్షన్‌ డిజేబుల్‌

  • రేషన్‌కార్డు దరఖాస్తు ఉచితం

  • రూ.100 వసూలు చేస్తున్న సిబ్బంది

  • సచివాలయాల్లో దరఖాస్తులకు పాట్లు

(పిఠాపురం- ఆంధ్రజ్యోతి)

కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఆనందం ఆన్‌లైన్‌ కష్టాలతో ఆవిరైపోతోంది. దరఖాస్తులకు పెట్టిన నిబంధనలతో ప్రజలు సచివాలయాల చుట్టూ ప్రద క్షిణలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులతడకగా ఉన్న హౌస్‌ మ్యాపింగ్‌ను ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణకు ప్రామాణికంగా తీసుకోవడంతో పాట్లు తప్పట్లేదు. అందులో కుటుంబసభ్యుల మ్యా పింగ్‌ ఒకేచోట జరగకుంటే వారి దరఖాస్తులు ఆన్‌లైన్‌ కావట్లేదు. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయడంతో అది ఎలా తెచ్చుకోవా లో తెలియక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇది తప్పనిసరి కాదని మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రకటించినా అది లేకుండా దరఖాస్తు తీసుకోకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్ప డం లేదు. తాజాగా ఆశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ సైతం ప్రకటించారు. ఇక బయోమెట్రిక్స్‌ పడకపోయినా దరఖాస్తు ఆన్‌లైన్‌ కావట్లేదు. ఓటీపీ ఆప్షన్‌ డిజేబుల్‌ చేయడంతో వేలిముద్రలు పడని వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే స్థితి నెలకొంది.

నిబంధనాలు

కూటమి ప్రభుత్వం నూతన రేషన్‌కార్డుల జారీ, కార్డుల విభజన, కొత్తగా కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామా మార్పులకు దరఖాస్తుల స్వీకరణతో పాటు ఇప్పటికే రైస్‌ కార్డులు ఉన్న వారు వాటిని ప్రభుత్వానికి సరెండర్‌ చేసే అవకాశాన్ని కల్పించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో కొన్ని రోజులుగా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది.దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియలో విధించిన నిబంధనలు ఇప్పుడు కొత్త కష్టాలు తెచ్చిపెట్టా యి. అన్ని సరిచూసుకుని అప్‌లోడ్‌ చేసే సమయానికి సర్వర్లు పనిచేయక దరఖాస్తు చేసుకునేందుకు మూడు, నాలుగుసార్లు సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. కార్డులకు ఇన్ని నిబంధనలు ఉంటే ఎలాగంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మ్యాపింగ్‌ తంటా..

రేషన్‌కార్డుకు వివాహమై పిల్లలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలంటే భార్యాభర్తలు, పిల్లలు ఒకేచోట హౌస్‌ మ్యాపింగ్‌ ఉండాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల ద్వారా కుటుంబాల స్థితిగతులను తెలుసుకునేందుకు హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు దీనినే ప్రామాణికంగా నిర్దేశించింది. తల్లిదండ్రులు, వారి పిల్లలు ఒకే కుటుంబం అయినప్పటికీ మ్యాపింగ్‌లో ఒకేచోట లేకపోతే దరఖాస్తు స్వీకరణ సమయంలో ఆన్‌లైన్‌లో ఎర్రర్‌ చూపిస్తోంది. అప్పుడు వలంటీర్లు చేసిన తప్పిదాలు ఇప్పుడు రేషన్‌కార్డు దరఖాస్తుదారులకు శాపంగా మారాయి. మ్యాపింగ్‌లో మార్పులు, చేర్పులు, ఎడిట్‌ చేసే అవకాశాన్ని ఇవ్వకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే కొత్త రేషన్‌కార్డు పొందే అవకాశాన్ని కోల్పోతారు.

నిబంధనలు సడలించాలి..

హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ నిబంధన తొలగించడంతోపాటు ఆధార్‌ ఆధారంగానే దరఖాస్తుల స్వీకరణ ఉండాలని, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ నిబంధన తొలగించి వీఆర్వో లేదా సంబంధిత పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణతో ఆన్‌లైన్‌ చేసే అవకాశం కల్పించాలని, బయోమెట్రిక్స్‌తోపాటు ఓటీపీ ఆప్షన్‌ ఇవ్వాలని, ఉమ్మడి కార్డులో ఉన్న ఎంతమందైనా విడిగా కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని పలువురు సూచిస్తున్నారు.

దరఖాస్తు చేయాలంటే రూ.100

రేషన్‌కార్డు దరఖాస్తు ప్రభుత్వం ఉచితమని ప్రకటించింది. అయితే సచివాలయ సిబ్బంది మాత్రం కార్డుకు రూ.100 వసూలు చేస్తున్నట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని ఒక సచివాలయంలో దరఖాస్తుదారుల నుంచి ఒక్కో కార్డుకు రూ.100 వసూలు చేస్తున్నట్టు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది.

మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అక్కర్లేదు!

కొత్తగా కార్డు పొందడానికి మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేశారు. వివాహమైన వారిలో 95 శాతం మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోరు. దీంతో ఇప్పుడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. అయితే మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గురువారం ప్రకటించారు.

బయోమెట్రిక్స్‌...

కార్డుల దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియలో ప్రధాన దరఖాస్తుదారుడు తప్పనిసరిగా తన బయోమెట్రిక్స్‌ (వేలిముద్రలు) వేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్స్‌ పడకుంటే దరఖాస్తు ఆన్‌ లైన్‌ కావట్లేదు. గతంలో ఆధార్‌కు లింక్‌ అయిన మొబైల్‌కు ఓటీపీ వచ్చేది. దీని వల్ల బయోమెట్రిక్స్‌ పడనివారికి ఉపయోగకరంగా ఉండేది. ఓటీపీ ఆప్షన్‌ డిజేబుల్‌ చేశారని చెబుతున్నారు.

విభజనలో కొత్త కష్టాలు

తల్లిదండ్రులతో కలిసి ఉన్న కొడుకులు, కుమార్తెలకు వివాహమై కొత్త కార్డు పొందేందుకు విభజన అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వం దానిని ఒక్కరికే పరిమితం చేసింది. ఇద్దరు పిల్లలు ఉండి, వారికి వివాహమైతే అందులో ఒక్కరినే విభజించే అవకాశం ఉండడంతో రెండో వారు దరఖాస్తు చేసుకునే వీల్లేకుండా పోతోంది.

ఫ మ్యాపింగ్‌ సమయంలో భర్త వేరే ప్రాంతంలో ఉండడంతో పేరు కుటుంబంలో చేర్చకున్నా భార్య,పిల్లలకు కార్డు రావడం లేదు. భర్త లేకుండా విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.

ఆధార్‌ చిరునామాతోనే...

ఫ ఆధార్‌ కార్డులో ఉన్న చిరునామానే దరఖాస్తు స్వీకరణ సమయంలో పరిగణనలోకి తీసుకుంటున్నారు. చిరునామా మార్పునకు అవకాశం ఇవ్వకపోవడంతో పాత చిరునామాలతోనే దరఖాస్తు చేస్తున్నారు. వివాహమైన తర్వాత ఆధార్‌లో భార్య ఇంటి పేరు మారకున్నా, భార్యాభర్తల ఇంటి పేర్లు ఒకేలా లేకున్నా ఆన్‌లైన్‌లో తీసుకోవట్లేదు. చదువుకున్న వారు ఉద్యోగాల కోసం ఆధార్‌లో ఇంటి పేరు మార్చుకోవడం లేదు. అటువంటి వారికి ఇబ్బంది ఎదురవుతోంది.

ఫ చిన్నారుల బాల ఆధార్‌ అప్‌డేట్‌ అయితే కానీ వారి పేర్లను తల్లిదండ్రుల కార్డుల్లో చేర్చడానికి అవకాశం ఉండట్లేదు. ఇప్పుడు అప్‌డేట్‌ చేయించాలంటే కార్డుల దరఖాస్తు గడువు ముగిసిపోతుందని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడువు ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - May 16 , 2025 | 01:08 AM