ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యాండే.. పుల‘సండే’!

ABN, Publish Date - Jul 20 , 2025 | 01:16 AM

పులస... పులసోయ్‌ పులస... నోరూరించే పులస.. పుస్తెలమ్మయినా కొనుక్కుని తినాల్సిన పులస.. సాధారణంగా ఏ స్వీట్లు గురించో వింటే ఠక్కున నోరూరుతుంది.. చేపల్లో పులస గురించి వింటే జిహ్వచాపల్యం ఆగదు.. ఎలాగైనా.. ఎంత పెట్టి కొని అయినా తినాలనిపించే ఈ చేప గురించి ఎంత చెప్పినా తక్కువే.. వర్షాకాలం వస్తే గోదావరికి ఎర్రనీరు ఎలా పోటెత్తుతుందో... పులస కూడా అలా సముద్రం నుంచి గోదావరికి ఎదురీది పులస ప్రియుల నోట్లోకి జారుతుంది..

యానాంలో ఇటీవల రూ.18 వేలకు విక్రయించిన పులస
  • గోదారి ఎర్రనీట్లో సందడి చేస్తోన్న పులస చేప

  • గతంతో పోల్చితే ఇవి అరుదుగా దొరుకుతుండడంతో భారీ ధర

  • ఇటీవల రూ.18 వేలు పలికిన కేజీన్నర చేప..

  • గతేడాది ఏకంగా రూ.25 వేలు

  • సీజన ప్రారంభమవడంతో ఈ దఫా అయినా భారీగా దొరికేనా అని మత్స్యకారుల్లో ఆశ

పులస... పులసోయ్‌ పులస... నోరూరించే పులస.. పుస్తెలమ్మయినా కొనుక్కుని తినాల్సిన పులస.. సాధారణంగా ఏ స్వీట్లు గురించో వింటే ఠక్కున నోరూరుతుంది.. చేపల్లో పులస గురించి వింటే జిహ్వచాపల్యం ఆగదు.. ఎలాగైనా.. ఎంత పెట్టి కొని అయినా తినాలనిపించే ఈ చేప గురించి ఎంత చెప్పినా తక్కువే.. వర్షాకాలం వస్తే గోదావరికి ఎర్రనీరు ఎలా పోటెత్తుతుందో... పులస కూడా అలా సముద్రం నుంచి గోదావరికి ఎదురీది పులస ప్రియుల నోట్లోకి జారుతుంది.. సాధారణంగా చికెన..మటన.. చేప తింటే బయటకొచ్చి దీని గురించి ఎవరూ పెద్ద గొప్పగా చెప్పుకోరు.. కానీ పులస తిన్నవాళ్లు మాత్రం రోజుల తరబడి ఊరంతా చెప్పుకోవడం ఓ ప్రెస్టేజీ కూడా.. గోదారోళ్లకు మహా ఇష్టమైన...ఖరీదైన.. చుట్టాలు, స్నేహితులకు గొప్ప గిఫ్ట్‌లా పేరొందిన పులస సీజన ఇప్పుడు గోదావరిలో మొదలైంది. భారీ వర్షాలతో వరద పోటెత్తుతుండడంతో ఒక్కో పులస అలా అలా ఈదుకుంటూ పులసప్రియుల నోటికి చిక్కడానికి ఇప్పుడిప్పుడే కదులుతోంది... పదండి... ఇంకా దీని గురించి చెప్పుకుందాం...

(కాకినాడ/యానాం-ఆంధ్రజ్యోతి)

వానాకాలం వస్తే అందరి నోట్లో నానే పదం పులస. ఇప్పుడు వానాకాలం కావడంతో గోదావరి ఎర్రనీరు సముద్రంలో కలుస్తుండ డంతో పులసల సీజన మొదలైపోయింది. ఇప్పటికే యానాం గౌతమి గోదావరిలో అక్కడక్కడా పులసలు దొరుకుతున్నాయి. ఇటీవల యానాం మార్కెట్‌లోకి పలువురు వ్యాపారులు పులసలను తెచ్చి విక్రయించారు. వేలు ఖర్చుపెట్టి మరీ ఈ చేపలు కొనేందుకు ఎగబడ్డారు. వాస్తవానికి పుస్తులమ్మయినా పులస తినాలి అనేది గోదావరి జిల్లాల్లో పులస చేప కోసం వినబడే నానుడి. ఎందుకంటే దీని ధర ఎంతకు ఎగబాకుతుందో ఎవరికీ తెలియదు. చేపలను మార్కెట్లో ఇలా వెళ్లి అలా తెచ్చుకోవచ్చు.. కానీ పులసను మాత్రం వేలంలోకి వెళ్లి తెచ్చుకోవాలి. ఎందుకంటే దీనికి ఉన్న గిరాకీ అంత మరి. ధన వంతుల నుంచి సెలబ్రిటీల వరకు... మధ్యతరగతి నుంచి సామా న్యుల వరకు పులస వచ్చిందా.. పులస దొరుకుద్దా.. అంటూ ఈ సీజ నలో ఆరా తీయడం మామూలుగా ఉండదు. చాలామంది తమ పనుల కోసం ప్రముఖులను ప్రసన్నం చేసుకునేందుకు, కావాల్సిన పనులను చేయించుకునేందుకు ఈ పులస పులను పంపడం ఓ అనవాయితీగా మారింది. అంతేకాదండోయ్‌.. ఈ సీజనలో విదేశాల్లో ఉన్న గోదావరివాసులు తమ వారితో సరదాగా పులస దొరికిందా.. పులస తిన్నారా అని అడగకుండా ఉండరంటే అతిశయోక్తికాదు.

పులసే తినాలా...

అవును.. పులసే తినాలి... ఇది తింటే ఆ రుచే వేరు.. వాస్తవా నికి ఇవి వెండి రంగులో ఉంటాయి. ఆరోహక వలస జాతికి చెం దిన పులసలు సాఽధారణంగా సముద్రంలో జీవిస్తాయి. అయితే సంతాన ఉత్పత్తి కోసం ఆసే్ట్రలియా, న్యూజిలాండ్‌, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి హిందూ మహాసముద్రంలో ప్రవేశించి అక్కడ నుంచి బంగాళాఖాతం గుండా వరదల సమయంలో గోదావరిలోకి వచ్చి చేరతాయి. గోదావరి వరదనీరు వచ్చి సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టిన తర్వాత అక్టో బర్‌ నాటికి తిరిగి సాగరానికి చేరుకుంటాయి. అలా వెళ్లే క్రమంలో జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదలు వచ్చినప్పుడు కొన్ని చేపలు సముద్రం నుంచి గోదారిలో ఎదురీదుకుంటూ వెళ్తూ జాలర్లకు చిక్కుతాయి. పూర్వం సముద్రంలోంచి ఈదుకుంటూ ధవళేశ్వరం బ్యారేజీ వరకు వెళ్లేవి. బ్యారేజీ దిగువన పులసల్లంక అనే లంక కూడా ఉంది. అరుదైన ఈ పులస చేపలు గోదావరిలో తప్ప ఇంకెక్కడా దొరకవు. అందుకే అంత గిరాకీ. వాస్తవానికి పులస సముద్రంలో ఉంటే విలస చేప.. నదిలో దొరికితే పులస అవుతుం ది. గత పది రోజుల నుంచి గౌతమి గోదావరిలోకి ఎర్రనీరు రావడంతో పులసలు వచ్చి పడుతున్నాయి. వాస్తవానికి ఈ పులస యానాం వద్ద సముద్రం నుంచి ఎగువకు గోదావరిలో ఎగబాకు తూ ధవళేశ్వరం వరకు ఎదురెళ్తాయి. ఈ క్రమంలో ఎక్కడ మత్స్య కారులకు చిక్కుతుందో తెలియదు. చిక్కిందంటే పంట పండినట్టే.

ఎన్ని ప్రత్యేకతలో..

నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. పులస చనిపోయినా రెండు రోజుల వరకు కూడా పాడవకుండా ఉండటం మరో విశేషం. అయితే ఈ పులస చేప ధర వేలం పాట లో పాల్గొన్న వ్యక్తుల ఆధారంగా రేటు పెరుగుతుంది. సముద్రాని కి దగ్గరగా ఉండే యానాం, కోనసీమ ప్రాంతాల్లో కిలో చేప రూ. 25 వేలకు కూడా వెళ్తుంది. ప్రధానంగా అల్లవరం మండలం రెబ్బనపల్లికి చెందిన చేపల వ్యాపారి సాయి ఏటా పులస చేపల వ్యాపారం చేస్తారు. ఇతడికి అనేకమంది నేతలు, ప్రముఖులు ముందే అడ్వాన్సులు ఇచ్చేసి చేప చేజిక్కించుకుంటారు. గతేడాది జూలైలో కోనసీమ జిల్లా వశిష్ఠ గోదావరిలో మలికిపురం మండ లం రామరాజులంక గంగపుత్రులకు వలలో కేజీన్నర చేపపడగా రూ.25వేల ధర పలికింది. తాజాగా జూలై 12న యానాం వద్ద కేజీన్నర చేప రూ.18 వేలు పలికింది. గోదావరిలో తీపి నీరు, సముద్రంలో ఉప్పునీరు కలవడంతో ఈ చేప శరీరతత్వం మారుతుంది. అందుకే అంత రుచి. సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీదుకుంటూ వెళ్లడం వలనే పులసలకు అంత టేస్ట్‌. ఈ పులస చేపల్లో ఆడ, మగ చేపలుండగా, వీటిలో ఆడ చేపకు ధర ఎక్కువ. ఇక పులసను రకరకాలుగా వండి జిహ్వచాపల్యం తీర్చు కుంటారు. కొందరు వంకాయ, బెండకాయ కలిపి వండుతారు.

అంతకంతకూ మాయం..

కొన్నేళ్లుగా గోదావరిలో పులస లభ్యత తగ్గిపోయింది. సముద్ర జలాలు కాలుష్యం కావడం, చమురు సంస్థల డ్రెడ్జింగ్‌ వల్ల అనేక చేపలు మరణిస్తున్నాయి. అటు సముద్రం, గోదావరి కలిసే మొగ ప్రాంతంలో ఇసుక మేటలు పేరుకుపోవడంతో పులస గోదావరి లోకి రావడం తగ్గిపోతోంది. అలాగే మత్స్యకారులు భారీ వలలతో వేటాడే సమయంలో తల్లి పులసలు చిక్కడంతో సంతానం తగ్గి పోతోంది. అందుకే వలకు గుడ్డుతో ఉన్న తల్లి చేప కనిపిస్తే నది లో వదిలేయాలని మత్స్యశాఖ ఎప్పటినుంచో ప్ర చారం చేస్తోంది. వాస్తవానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 2010కి ముందు సరాసరి సీజ నలో మూడు టన్నుల పులస చిక్కేది. కానీ ఇప్పు డు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు క్వింటాళ్లకు పడిపోయింది. వాస్తవానికి కోనసీమ జిల్లాలో యానాం వద్ద, రాజోలు మార్కెట్‌ పులస లకు పెట్టింది పేరు. కానీ ఎప్పుడోగానీ పులస జాడ ఉండడం లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే పులస దొరకడంతో ఈ దఫా చేప లభ్యత పెరిగే అవకాశం ఉందని మత్స్యకారులు ఆశిస్తున్నారు.

విలసలకూ యమా డిమాండు

పిఠాపురం/మండపేట, జూలై19: కొంచెం అదే రుచి, అదే మాధుర్యం, పట్టిపట్టి చూస్తేనే కాని తెలుసుకోలేని వైరుధ్యం. అదే ఒడిశా పులస. గోదావరి పులసలను వేలల్లో పెట్టి కొనలేని వారు వీటిని కొని వండుకుంటారు. ఇప్పుడిప్పుడే విలసల విక్రయాలు మొదలయ్యాయి. ఒడిశా ప్రాంతంలో సముద్ర తీరప్రాంతాల్లో చెరువులు తవ్వి పెంచే పులస జాతి చేపలను ఒడిశా పులసలుగా, ఇలసలుగా పిలుస్తారు. కొందరు సముద్రంలో దొరికే విలసలనూ విక్రయిస్తారు. గోదావరి పులస రూ.5 వేల నుంచి పాతిక వేలు ఉంటే, ఒడిశా పులస మాత్రం సైజును బట్టి రూ.500 నుంచి రూ.1500 వరకూ మాత్రమే ఉంటుంది. కొందరు వీటినే పులసలుగా చెప్పి విక్రయించి మోసగిస్తారు. హోటళ్ల వారూ వీటినే పులసలుగా వండి వడ్డిస్తారు.

Updated Date - Jul 20 , 2025 | 01:16 AM