ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ త్యాగాలకు తగిన గుర్తింపు

ABN, Publish Date - May 23 , 2025 | 02:12 AM

గత నాలుగు దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని, ఎవరూ అధైర్యపడకుండా మొక్కవోని దీక్షతో పార్టీ నిర్మాణం కోసం కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

అమలాపురం, మే 22(ఆంధ్రజ్యోతి): గత నాలుగు దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని, ఎవరూ అధైర్యపడకుండా మొక్కవోని దీక్షతో పార్టీ నిర్మాణం కోసం కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కాపు కల్యాణ మండపంలో గురువారం సాయంత్రం కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అధ్యక్షతన ఏర్పాటుచేసిన జిల్లా మహానాడులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై సుదీర్ఘంగా ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో సహా పార్టీ శ్రేణులపై చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల బనాయింపు వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొని టీడీపీ కోసం ఎదురొడ్డి పోరాడిన పార్టీ శ్రేణుల త్యాగాలు ఎప్పటికీ వృథా పోవని పేర్కొన్నారు. చంద్రబాబుని జైలులో పెట్టి రాష్ట్రంలో మరో పార్టీ లేకుండా చేయాలనే జగన్‌పై ప్రజలు ఓటుతో చేసిన తిరుగుబాటు ఫలితంగా గడిచిన శాసనసభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ స్థానాలతో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబా బు, ఉపముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్‌ల నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పయనిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో రూ.10 లక్షల కోట్లను అప్పులుచేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పేరు ప్రతిష్ఠలను దిగజార్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 92 పథకాల అమలుకు సంబంధించి 60శాతం నిధులు రూపంలో మూడున్నర లక్షల కోట్లు నిధులను మళ్లించారని అవి ఎక్కడికి వెళ్లాయో కూడా లెక్కలు లేవని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 1.30 లక్షల కోట్లు చెల్లించి కేంద్ర పథకాల నిధులు అమలుకు చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. రానున్న జూన్‌ నుంచి ప్రభుత్వం సూపర్‌-6 పథకాల్లో భాగంగా హామీల అమలుకు నడుం బిగించిందని, జూన్‌ 12న 1.20 లక్షల మంది వితంతువులకు పెన్షన్లు మంజూరు చేస్తామని, తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.15 వేల వంతున సహాయం అందిస్తామని, త్వరలో ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పారు. కోనసీమ జిల్లా అభివృద్ధికి అవసరమైన అన్ని ప్రణాళికలను దశలవారీగా అమలు చేస్తామన్నారు. టూరిజంతోపాటు ఈ ప్రాంతంలో లభ్యమయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మహానాడు సభావేదికగా అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.

కోనసీమను అభివృద్ధి చేయాలి : ఎమ్మెల్యేలు

అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ కోనసీమ జిల్లాను కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లాలకు ధీటుగా అభివృద్ధి చేయాలని, ఎయిర్‌పోర్టు నిర్మించాలని, పర్యాటకంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి ప్రణాళికలను ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వ విప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కోనసీమలో లభ్యమయ్యే మత్స్య సంపద ఉత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సహకాలు అందించాలని, పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చి పదవుల్లో నియమింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ వ్యవసాయా ఆధారిత జిల్లాగా ఉన్న కోనసీమలో పంటకాల్వలు, డ్రెయిన్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, దశాబ్దాల కాలంగా వాటికోసం ప్రభుత్వం చర్య లు తీసుకోకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అంచనాల కమిటీ చైర్మన్‌, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు కోనసీమ జిల్లా అభివృద్థికి ప్రత్యేక ప్రణాళికలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేస్తున్న గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఉన్న కార్యకర్తలకు నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అముడా చైర్మన్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామినాయుడు నివేదికను సమర్పించారు. సమావేశానికి తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి మంత్రి అచ్చెన్నాయుడు పూలమాలలువేసి నివాళులర్పించిన అనంతరం మహానాడు సభ ప్రారంభమైంది. ఈ సభలో టీడీపీకి చెందిన జడ్పీ మాజీ చైర్మన్‌ నామన రాంబాబు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పెచ్చెట్టి చంద్రమౌళి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మెట్ల రమణబాబు, మాజీ ఎమ్మెల్యేలు చిల్లా జగదీశ్వరి, అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావు, చెల్లి వివేకానందతోపాటు టీడీపీ నాయకులు మోకా ఆనందసాగర్‌, పెచ్చెట్టి విజయలక్ష్మి, మాకిరెడ్డి పూ ర్ణిమ, నాగిడి నాగేశ్వరరావు, బోళ్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు సమక్షంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బో నం సత్తిబాబు ఆధ్వర్యంలో టీడీపీ నేత మెట్ల రమణబాబుకు పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మహానాడులో 11 తీర్మానాలు ఆమోదం

కోనసీమ జిల్లా మహానాడు సమావేశంలో 11 తీర్మానాలపై నాయకులు చర్చించి ఆమోదం తెలిపారు. ఒక్కో తీర్మానాన్ని ఒక్కో నాయకుడు ప్రతిపాదించగా సభ ఏకగ్రీవంగా వాటిని ఆమోదించింది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. ఆపరేషన్‌ సిందూర్‌లో అమరవీరులైన సైనికులకు, లోక్‌సభ పరిధిలో మరణించిన తెలుగుదేశం పార్టీ నా యకులు, కార్యకర్తలకు సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. సంస్థాగత ఎన్నికలపై చర్చించే తీర్మానానికి ఆమోదం తెలిపారు. జిల్లాస్థాయిలో టీడీపీ భవన నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ గురించి చర్చించి తీర్మానాన్ని ఆమోదించారు. సూపర్‌-6 పథకాలతో పాటు కోనసీమ జిల్లాలో రైల్వేలైన్‌ నిర్మాణంతో పాటు అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి పలు అంశాలపై మహానాడు ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించింది. భారీగా టీడీపీ శ్రేణులు హాజరయ్యారు.

202వ అన్న క్యాంటీన్‌

అమలాపురంలో ప్రారంభం

అమలాపురం, మే 22(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాలతో పాటు ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో అన్న క్యాంటీన్ల ద్వారా అల్పాహారం, భోజన సదుపాయాలను కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో 202వ అన్న క్యాంటీన్‌ను అమలాపురంలోని మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో ఏర్పాటుచేసిన పండుగ వాతావరణంలో గురువారం మధ్యాహ్నం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అన్న క్యాంటీన్‌ ద్వారా రూ.5కే భోజనం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని నాణ్యంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేయడం జరగిందని, మరో 70 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తున్నట్టు మంత్రి తెలిపారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో పట్టణాల్లో ఎక్కువ ఉన్న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఒకటికి తగ్గకుండా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. భోజన సదుపాయాల నిర్వహణపై ఒక కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు సొసైటీని కూడా నియమించామన్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా దాతల దానంతో పేదలకు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేయవచ్చనని, అలాగే పుట్టినరోజు జరుపుకుంటే ఆరోజు అన్న క్యాంటీన్‌కు అయ్యే ఖర్చును భరిస్తే వారి పేరిట భోజన సదుపాయం అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ప్రభుత్వ విప్‌ దాట్ల సుబ్బరాజు, కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, జేసీ టి.నిషాంతి, అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, ఆర్డీవో కె.మాధవి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 02:12 AM