పీజీఆర్‌ఎస్‌కు 279 అర్జీలు
ABN, Publish Date - Jun 03 , 2025 | 01:11 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలతో పాటు, మీ సేవ పోర్టల్ ,1100 టోల్‌ఫ్రీల ద్వారా వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి ఆదేశించారు.
రాజమహేంద్రవరంసిటీ, జూన్ 2 (ఆంధ్ర జ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలతో పాటు, మీ సేవ పోర్టల్ ,1100 టోల్‌ఫ్రీల ద్వారా వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలు అనుసరించి పరిష్కారం చూపాలన్నారు. అనపర్తి మండలం పాలమూరు గ్రామానికి చెందిన నూకారపు సత్యవతి సామాజిక భద్రత పెన్షన్ కింద రూ.6 వేలు పెంపు, అంత్యోదయ కార్డుకు అర్జీపెట్టుకున్నారు.రాజమహేంద్రవరం రూ రల్ మండలం ధవళేశ్వరం, కడియం పంచాయతీలకు చెందిన జి.అనంతలక్ష్మి, వి.దేవి, సి.నాగమణి, ఐ.లక్ష్మి, చాపల త్రివేణి, షేక్ బేగం ఇంటి స్థలం కోసం అర్జీలు పెట్టుకున్నారు. తాళ్ళపూడి మండలం అన్నదేవరపేట కు చెందిన కె.అనిల్ కుమార్ గ్రామంలోని ప్రధానమార్గాల్లో ఆక్రమిత నిర్మాణాలు తొలగించాలన్నారు.పీజీఆర్‌ఎస్‌లో 279 అర్జీలు స్వీ కరించారు. కార్యక్రమంలో డీఆర్‌వో టి.సీతారామమూర్తి, ముఖ్యప్రణాళిక అధికారి జేడీఎల్. అప్పలకొండ,ఎస్డీసీలు ఎంఆర్‌ఆర్.ప్రేమ్ కుమా ర్, టి.భాగ్యలక్ష్మి, డీఎల్‌డీవోలు పి.వీణాదేవి, ఏస్లీవా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ఇళ్ళ స్థలాలకు సీపీఐ ధర్నా
పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు కలెక్టర్ ప్రశాంతిని కలిసి ఇళ్ళ స్థలాల కు 1200 మంది సంతకాలతో కూడిన అర్జీ లను అందించారు. అనంతరం మధు మాట్లాడుతూ అర్హులందరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నారు. దళితుల దారిని మూసివేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు డిమాండ్ చేశారు. రంగంపేట మండలం ఈలకొలను గ్రామపరిధిలోని అచ్యుతాపురం కొత్తపేట కాలనీ దళితులు సోమవారం ధర్నా చేశారు. కొత్తపేట కాలనీకి చెందిన వంద దళిత కుటుంబాలు మార్గంగా వినియోగించుకుంటున్న పుంత రోడ్డును సరిహద్దు రైతు మూసివేశారని..న్యాయం చేయాలని రాజబాబు, బాధిత దళితులు కోరారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి రవి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పా రమణ, నగర కార్యవర్గ సభ్యులు పి.లావణ్య, టి.నాగేశ్వరరావు, పి.త్రిమూర్తులు , కడితి సతీష్, శ్రీకాంత్, డొక్కులూరి సంగీత, రెడ్డి దుర్గాదేవి, మడికి సత్యం పాల్గొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కి 25 ఫిర్యాదులు
రాజమహేంద్రవరం, జూన్ 2(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ(పరిపాలన), ఏవీ సుబ్బరాజు(శాంతి భద్రతలు) ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యపై ఆరా తీశారు. చట్ట పరిధిలో తగు చర్యలు త్వరిత గతిన తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 25 అర్జీలు స్వీకరించారు.
Updated Date - Jun 03 , 2025 | 01:11 AM