బడికి వెళదాం!
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:44 AM
పాఠశాలలు, కళాశాలలు ముస్తాబవుతు న్నాయి.. పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు సన్నద్ధమ వుతున్నాయి.
10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
కూటమి ప్రభుత్వంలో రెండోసారి
(ఆంధ్రజ్యోతి-రాజమహేంద్రవరం)
పాఠశాలలు, కళాశాలలు ముస్తాబవుతు న్నాయి.. పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు సన్నద్ధమ వుతున్నాయి.కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమావేశాలు నిర్వహించడం రెండోసారి. ఆ రోజున అమ్మపేరుతో మొక్కలు నాటడం, ఫొటో బూత్ వద్ద తల్లిదండ్రులతో ఫొటోలు దిగడం, ఆటలపోటీలు, సహపంక్తి భోజనాలు ఇలా పండుగ వాతావరణంలో సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారి గతేడాది డిసెంబరు నెలలో నిర్వహించిన మెగా పీటీఎం విజయవంతం కావడంతో ఈసారి మెగా పీటీఎం-2.0 నిర్వహిస్తున్నారు.
అందరి భాగస్వామ్యంతో..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర విద్యాశాఖా మం త్రి నారా లోకేశ్ పాఠశాలలు, కళాశాలల పనితీరు, విద్యాబోధనలో పలు మార్పులు తెచ్చా రు. వీటిని తల్లిదండ్రులకు వివరించడం, పాఠశాలల అభివృద్ధిలో వారితో పాటు పూర్వ విద్యార్థులు, విద్యారంగ ప్రముఖులు, దాతలను భాగస్వాములు చేయడం లక్ష్యంగా దేశంలోని విద్యారంగ చరిత్రలో తొలిసారి గతేడాది డిసెంబరు 7న నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సత్ఫలితాలను ఇచ్చింది. రెండో విడత ఈనెల 10న ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్యాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలతో పాటు ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్-2.0(మెగా పీటీఎం) నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంపై ఇప్ప టికే ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్లు అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడి తగు ఆదేశాలు ఇచ్చారు.సమావేశం ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై రాష్ట్రస్థాయి నుంచే మినిట్ టూ మినిట్ ప్రోగ్రామ్‌ను పంపించారు.
ఫొటో సెషన్, ఆటల పోటీలు
10న ఉదయం 9గంటలకు సమావేశాలు ప్రారంభించి మధ్యాహ్నం ఒంటి గంటకు ముగి స్తారు. ఉదయం తల్లిదండ్రులు, ఇతర ప్రముఖులను పాఠశాలకు ఆహ్వానిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే ఓపెన్‌హౌస్ ఫొటోబూత్ వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఫొటో దిగే ఏర్పాటు చేయనున్నారు. అనంతరం తమ పిల్లలతో కలిసి వారి క్లాస్‌రూమ్‌లో తల్లిదండ్రులు కూర్చునేలా, ఇతర ప్రముఖులు హెచ్ ఎం రూమ్‌లో ఉండేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో సంబంధిత క్లాస్ టీచర్ ప్రత్యేకంగా సమావేశమై వారి పిల్లల సమగ్ర పురోగతి కార్డులు(పోగ్రస్ కార్డు), హెల్త్ కార్డును అందిస్తారు. అదే సమయంలో వీడియోల ద్వారా తల్లికి వందనం పథకం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పాజిటివ్ పేరెంటింగ్, మన బడి మేగజైన్ తదితర అంశాల గురించి అవగాహన కల్పిస్తారు. విద్యార్థుల తల్లులకు రంగోళి లేదా లెమన్ అండ్ స్పూన్ లేదా మ్యూజికల్ చైర్, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహిస్తారు. 11గంటలకు సమావేశాలు ప్రారంభించి మా తెలుగు తల్లికి పాట అనంతరం తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్దేశించారు.ఇందులో భాగంగా విద్యార్థులతో వారి తల్లులకు పుష్పాలు సమర్పించి పాదాలకు నమస్కరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో మొక్క నాటడం, గ్రీన్ పాస్‌పోర్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నో టూ డ్రగ్స్, సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యులవుతామంటూ సామూహిక ప్రతిజ్ఞ ఉం టుంది. చివరగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాకమిటీ ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, ఆహ్వానితులు కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని చేస్తారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో కామన్ లంచ్ ఏర్పాటు చేయాలి.
1677 పాఠశాలల్లో పేరెంట్స్ మీట్
ప్రశాంతి, కలెక్టర్, తూర్పుగోదావరి
ఈ నెల 10న జిల్లాలో 1537 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, 120 కళాశాలల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. విద్యా నాణ్యతను మెరుగుపర్చేందుకు సమగ్ర శిక్షా మిషన్ కింద ప్రత్యేక చర్యలు చేపడుతు న్నాం. ప్రతి పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా సేకరించేందుకు సమగ్ర ప్రశ్నావలి, రూపొందించి దాని కనుగుణంగా అభిప్రాయ సేకరణ చేయడం ప్రధాన లక్ష్యం. పేరెంట్స్ మీటింగ్‌కు పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated Date - Jul 07 , 2025 | 12:44 AM