నేడే బడి పండుగ
ABN, Publish Date - Jul 10 , 2025 | 01:23 AM
బడి పండుగకు పాఠశాలలు సిద్ధమయ్యాయి.. పచ్చని తోరణాలతో అలకరించుకున్నాయి.ప్రభుత్వం గతేడాది మాదిరిగానే నిర్వహిస్తున్న ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్’కి బడులు, జూనియర్ కళాశాలల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
5 లక్షల మంది హాజరవుతారని అంచనా
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
బడి పండుగకు పాఠశాలలు సిద్ధమయ్యాయి.. పచ్చని తోరణాలతో అలకరించుకున్నాయి.ప్రభుత్వం గతేడాది మాదిరిగానే నిర్వహిస్తున్న ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్’కి బడులు, జూనియర్ కళాశాలల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అటు ఉపాధ్యాయులకు బోధనకు సమయం లేకపోగా.. ఇటు విద్యార్థుల చదువు అటకెక్కింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రేపటి పౌరుల బంగారు భవిత కోసం విద్యారంగాన్ని గాడిలో పెట్టే పని మొదలుపెట్టింది. ప్రతి పాఠ శాలలోని, ప్రతి విద్యార్థిపై దృష్టి సారించారు. గతేడాది ప్రభుత్వ పాఠశా లల్లో మాత్రమే నిర్వహించిన ఈ వేడుకలను.. ఈసారి ప్రైవేటు పాఠశా లలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు విస్తరించారు. దీనిలో విద్యార్థి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు/సంరక్షకులు కూ ర్చుని విద్యార్థి భవిష్యత్తు,బడి అభివృద్ధే లక్ష్యంగా స్నేహ పూర్వ కంగా చర్చిస్తారు. ముఖ్యంగా పాఠశాలలకు పాలకులు ఇస్తున్న నిధులు,చేస్తున్న అభివృద్ధి, చదువుకోవడానికి కల్పిస్తున్న వాతావ రణం ఇవన్నీ పారదర్శకంగా ఉంచ డానికి వీలు కలుగుతుంది. జిల్లాలో 976 ప్రభుత్వ, 568 ప్రైవేటు, 120 ఇంటర్మీడియట్ కళా శాలల్లోని విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు..ఆ ప్రాం తంలోని ప్రజాప్రతినిధులు వేడుకలకు హాజరుకాను న్నారు.ఈ మేరకు ఇప్ప టికే ప్రభుత్వం నిధులు విడు దల చేసింది.పిల్లల బంగారు భవితకు ఒక్క అడుగు ముందుకు అనే నినాదంతో భారీ కార్యక్రమానికి పాఠశాలలను సిద్ధం చేశారు.ఇప్పటికే ఆయా పాఠశాలలు,కళాశాలల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులు/సంరక్షకులు పండుగకు రావాలంటూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.కార్యక్రమ నిర్వహ ణపై ఇప్పటికే కలెక్టర్ పి.ప్రశాంతి సమీక్ష చేసి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కోనసీమలో..
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే ఏకైక లక్ష్యంతో గురువారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ‘మెగా పేరెంట్స్-టీచర్స్’ సమావేశాలు నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సమావేశాల నిర్వహణకు పరిశీలకులను సైతం నియమించారు. పీటీఎం 2.0కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈమెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశాల నిర్వ హణకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిలోభాగంగా జిల్లాలో వందకు పైగా ఉన్న జూనియర్ కళాశాలలు, 1595 ప్రభుత్వ పాఠశాలలు, 555ప్రైవేటు పాఠశాలల్లో ఈ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లకు సంబంధించి పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కార్యక్రమాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కచ్చితంగా హాజరై విజయవంతంచేయాల్సిం దిగా ఆదేశించారు. మెగా పేరెంట్స్-టీచర్స్ నిర్వహణ ద్వారా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సంబంధాలు మెరుగు పరచడంతోపాటు విద్యార్థుల అభ్యసన పురోగతిని చర్చించడానికి ఈ తరహా సమావేశాలు ఉపయోగపడతాయని, ముఖ్యంగా విద్యార్థుల సామర్థ్యాల అంచనా, వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారుబాట వేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి కార్యక్రమం నిర్వహణ చేపట్టాలి. మీటింగ్ ప్రారంభ సమయం, చర్చా సమయాలు, విరామం, ముగింపు సమయాలపై సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమాల నిర్వహణకు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి పురోగతి, బలాలు, బలహీనతలు, మెరుగుదల అంశాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య వ్యక్తిగత చర్చలకు ఈ సమావేశం వేదిక కావాలి. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో సమావేశాల నిర్వహణ చేపట్టాలి. అమ్మ పేరుతో మొక్కలు నాటాలి. ఆటల పోటీలు నిర్వహించారు. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. గురువారం ఉదయం 9 గంటలకు జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లు ప్రారంభమవుతాయి. తల్లిదండ్రులు, ఇతర ప్రముఖులను పాఠశాలకు ఆహ్వానిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ఫొటోబూత్‌వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫొటోలు దిగుతారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి క్లాస్ టీచర్‌తో కలిసి సమావేశమై చర్చిస్తారు. తల్లికి వందనం పథకం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, పాజిటివ్ పేరెంట్ మీటింగ్, మనబడి తదితర అంశాల గురించి అవగాహన కల్పిస్తారు. 11గంటలకు విద్యార్థులతోవారి తల్లులకు పుష్పాలు సమర్పించి పాదాలకు నమస్కరిస్తారు. అనంతరం తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటుతారు. డ్రగ్స్ సైబర్ అవెర్‌నెస్ కార్యకలాపాలపై చర్చిస్తారు. సమావేశాలకు హాజరైన అందరూ విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి సహపంక్తి భోజనాల్లో పాల్గొనేలా జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోను ఈ తరహా ఏర్పాట్లు జరిగాయి.
కాకినాడలో..
(ఆంధ్రజ్యోతి-పిఠాపురం)
పాఠశాలప్రగతిలో భాగస్వాములు చేయడం, విద్యార్థుల పురోగతి, ఆరోగ్య పరీక్షల వివరాలను తల్లిదండ్రులకు తెలియచెప్పడం లక్ష్యంగా అన్ని యజమాన్యాల్లోని పాఠశాలలు,కళాశాలల్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను గురువారం నిర్వహించనున్నారు. ఇందునిమిత్తం ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపారు. పా ఠశాలలు, కళాశాలలును ముస్తాబు చేశారు.కాకినాడ జిల్లాలోని 1260 ప్రభుత్వ పాఠశాలలు, 598 ప్రైవేటు, 20 ఎయిడెడ్ పాఠశాలల్లో 2,78,932మంది విద్యార్థులు చదువుతుండగా, 141 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 45,344మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి తల్లిదండ్రులందరినీ ఆయా పాఠశాలలు, కళాశాలల్లో 10వతేదీ ఉదయం 9గంటలనుంచి సా యంత్రం వరకూ నిర్వహించే మెగా పేరెంట్ టీ చర్ మీటింగ్(మెగా పీటీఎం-2.0)లో భాగస్వాములు చేయడం ద్వారా గిన్నీస్‌బుక్‌లో రికార్డు సాధించాలని విద్యాశాఖ సంకల్పించింది. విద్యాశాఖాధికారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వీటి ని ర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వి స్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాల లు, కళాశాలలనుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులకు ఆహ్వానాలు పంపారు. వీరితోపా టు పూర్వవిద్యార్థులు, విద్యారంగ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆహ్వానించారు.
తల్లిదండ్రులతో ముఖాముఖి
ఈసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో వి ద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖికి అత్యం త ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా వి ద్యార్థుల విద్యాప్రగతికి సంబంధించి ప్రోగ్రస్‌కార్డులను తల్లిదండ్రులకు సంబంధిత క్లాస్ టీచ ర్లు అందజేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకం గా సమయాన్ని కేటాయించారు. విద్యార్థుల ప్రతిభ, పురోగతి, తరగతి గదిలో వారి ప్రవర్తన, పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన వైద్యపరీక్షల్లో గుర్తించిన అంశాలను వివరించనున్నారు.
తల్లిదండ్రులతో ఫొటోలకు ఫొటోబూత్
తర్వాత విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఫొ టోలు దిగేందుకు వీలుగా ఫొటో బూత్, పేరెంట్స్‌కు ఆటల పోటీలు, సమావేశం నిర్వహణ, అనంతరం పాఠశాల, కళాశాలల్లోనే అందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం తదితర కార్యక్రమాలు ఉంటాయి. పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వం కల్పించిన, కల్పించబోతున్న సదుపాయాలు, మౌలిక వసతుల గురించి వివరించడం తోపాటు ఇంకా ఏయే సౌకర్యాలు కల్పించాలన్న అంశంపై పేరెంట్స్ అభిప్రాయాలు సేకరించనున్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థు లు, ఉన్నతస్థానాల్లో నిలిచిన పూర్వవిద్యార్థులతో మాట్లాడిస్తారు. జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో పాలుపంచుకోనున్నారు.
మెగా పీటీఎం-2.0 నిర్వహణను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాఠశాలలు, కళాశాలల్లో జరిగే ఈ కార్యక్రమంలో ఎక్కువమంది పాలుపంచుకునే ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. అందరూ తమ పిల్లలు చదివే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలని, వారి ప్రగతి తెలుసుకోవాలని విద్యాశాఖాధికారులు కోరుతున్నారు.
అందరూ హాజరుకావాలి..
ఇదొక అద్భుతమైన కార్యక్రమం. అన్ని ఏర్పాట్లూ చేశాం. పిల్లల బంగారు భవితకు, విద్యాలయ అభివృద్ధికి స్నేహపూర్వక వాతావ రణంలో చర్చ జరుగుతుంది. తల్లిదండ్రులకు భోజన ఏర్పాట్లు చేశాం. ప్రతి విద్యార్థి ప్రస్తుత స్థితిని తల్లిదండ్రులకు వివరించ డమే కాకుండా వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందజేశాం. అందరూ హాజరు కావాలి.
- కె.వాసుదేవరావు,డీఈవో, తూర్పుగోదావరి
Updated Date - Jul 10 , 2025 | 01:23 AM