ఓడలరేవులో ఓఎన్జీసీ టెర్మినల్ ముట్టడిలో ఉద్రిక్తత
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:33 AM
కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో దక్షిణ భారతదేశంలో చమురు ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఓఎన్జీసీ ఆన్‌షోర్ టెర్మినల్‌ను మహిళలు, గ్రామస్తులు శుక్రవారం ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థి తి ఏర్పడింది.
అల్లవరం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో దక్షిణ భారతదేశంలో చమురు ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఓఎన్జీసీ ఆన్‌షోర్ టెర్మినల్‌ను మహిళలు, గ్రామస్తులు శుక్రవారం ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థి తి ఏర్పడింది. రూరల్ సీఐ డి.ప్రశాంత్‌కుమార్, ఎస్పీఎఫ్ సీఐ పి.రంజిత్‌కుమార్, ఎస్‌ఐలు టి.తిరుమలరావు, ఎం.శ్రీరాములు సాయుధ పోలీసు బలగాలతో ముట్టడిని అడ్డుకున్నారు. 40 ఏళ్లుగా ఓడలరేవు నుంచి రూ.లక్ష కోట్ల చమురు ఉత్పత్తులు తరలించుకుపోతున్న ఓఎన్జీసీ సంస్థ ఓడలరేవు గ్రామాభివృద్ధి పట్ల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ 54 రోజులుగా గ్రామస్తులు, మహిళలు రిలే దీక్షల ద్వారా నిరసనలు తెలుపుతున్నారు. ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు ఓడలరేవు ఓఎన్జీసీ రోడ్డుపై ధర్నాకు దిగడంతో కలకలం రేగింది. మార్చి 27న ఓఎన్జీసీ అధికారులు అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో చర్చలు జరిపి, వారం గడువు కోరి ఆలస్యం చేయడంతో సహనం కోల్పోయిన గ్రామస్తులు, మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. మహిళలు భోజనాలు తినకుండా ఆగ్రహంతో ఓఎన్జీసీ టెర్మినల్ గేటు ముట్టడికి మూకుమ్మడిగా తోసుకువెళ్లడంతో సీఐలు డి.ప్రశాంత్‌కుమార్, రంజిత్‌కుమార్ వారిని అడ్డుకునే ప్రయత్నంచేయ డంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబురాజు, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, పచ్చిమాల ఏడుకొండలు గ్రామస్తుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. గత వైసీపీ పాలనలో కొందరికే ఓఎన్జీసీలో ఉద్యోగాలిచ్చారని, స్థానికులకు అన్యాయం చేశారంటూ దెందుకూరి ఆరోపించారు. కొల్లు విష్ణుమూర్తి, కొప్పాడి వెంకటరామకృష్ణ, నాతి లెనిన్‌బాబు, సోమాని వెంకటరమణ, గుండుమేను శ్రీనివాస్, కామాడి గంగాభవానీ, కొల్లు శుభకీర్తి, బడుగు గౌరీ తదితరులు ఓఎన్జీసీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓఎన్జీసీ రెసిడెంట్ ఇన్‌చార్జి భరత్‌భూషణ్, ఎస్‌ఈ హేమనాథ్, ఓఎన్జీసీ అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపారు. వారం రోజులు గడువు ఇవ్వాలంటూ ఓఎన్జీసీ అధికారులు కోరినా ససేమిరా వినలేదు. దీంతో ఈనెల 29న చర్చలకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Updated Date - Apr 26 , 2025 | 01:33 AM