ఏడాది ఏమైంది..
ABN, Publish Date - Jun 12 , 2025 | 01:43 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సహకారంతో బీజేపీ మద్దతుతో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గురువారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సహకారంతో బీజేపీ మద్దతుతో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గురువారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది. నాటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సాగిన పాలన తీరును ప్రజలు నిశితంగానే పరిశీలిస్తున్నారు. వైసీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య స్పష్టమైన మార్పులనూ గమనిస్తున్నారు. ఈ ఏడాదిలో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును సైతం జనం బేరీజు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీ ఏం చేశారు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పనిలో ఉన్నారా, వాటిని ఎంతవరకు సాధించారు, ఇంకా వీడని సమస్యలేంటి వంటి అనేక విషయాలను ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. అందులో ప్రధానమైన విషయాలను తెలిపే కథనమిది...
ఏం చేశారు...
కోటిపల్లి రైల్వేలైన్ నిర్మాణంపై దృష్టి
గంటి హరీష్‌మాధుర్, టీడీపీ ఎంపీ
- లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వాటితో చేపట్టిన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
- పాశర్లపూడి నుంచి కడలి వరకు 216 బైపాస్ రహదారి అభివృద్ధి పనులను వేగవంతానికి ఎంపీ హరీష్ కీలక పాత్ర వహించారు.
- వివిధ నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను కల్పించారు.
- చమురు సంస్థలు మంజూరుచేసే సీఎస్సార్ నిధులతో వివిధ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సిఫార్సులు చేశారు.
- పేరూరు వై.జంక్షన్ నుంచి అమలాపురం రూరల్ గ్రామాల మీదుగా రావులపాలెం మండలం వెదిరేశ్వరం వెళ్లే 216ఏ రహదారి అభివృద్ధి డీపీఆర్ రూపకల్పనలో కీలక పాత్ర వహిస్తున్నారు.
వేగుళ్ల జోగేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే, మండపేట, ప్రజా అంచనాల కమిటీ చైర్మన్
- గొల్లపాలెం-కుయ్యేరు మధ్య రూ.36 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టారు.
-నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రామచంద్రపురంలో నియోజవర్గ స్థాయి ఉపాధి కార్యాలయాన్ని నెలకొల్పి ప్రతీ సోమవారం నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరిస్తున్నారు. జాబ్‌మేళాలు, ఎంఎస్‌ఎంఈ ద్వారా ప్రత్యేక అవగాహన సదస్సులు, మహిళలకు బ్యూటీషియన్, కుట్టు శిక్షణ కోర్సులు నేర్పిస్తున్నారు. ఇప్పటివరకు పలు జాబ్‌మేళాల ద్వారా 1500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు.
-రూ.80 లక్షల అంచనా వ్యయంతో రైతుబజార్‌ను నిర్మించి ప్రజలకు అంకితం ఇచ్చారు.
-కోట్లాది రూపాయల వ్యయంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, వంతెనల నిర్మాణాలు చేపట్టారు.
-రామచంద్రపురం పట్టణ అభివృద్ధికి వీలుగా అనేక ప్రణాళికలను అమలుచేస్తున్నారు.
-కోటిపల్లి-ముక్తేశ్వరం మధ్య భారీ వంతెన నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు.
-ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీటిని అందించి ప్రజల ఆరోగ్యానికి సహకరిస్తున్నారు.
ప్రధాన సమస్యలు..
నియోజకవర్గంలో ప్రజల పాలిట శాపంగా మారిన అనధికారిక పశుకబేళా సమస్య పరిష్కరించాల్సి ఉంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా కబేళాల సమస్యను పరిష్కరించడానికి మంత్రి సుభాష్ చర్యలు చేపట్టారు. గౌతమీ నదిపై కోటిపల్లి-ముక్తేశ్వరం వంతెన సమస్య ఉంది. ఇక్కడ భారీ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమై సీఎం చంద్రబాబు పరిశీలనలో ఉంది.
-నియోజకవర్గస్థాయిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కొనసాగుతున్నాయి.
- మండపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా చేసేందుకు అనేక ప్రణాళికలను దశల వారీగా అమలుచేస్తున్నారు.
- రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో ఉన్న అనేక కీలక సమస్యలను పరిష్కరించడానికి కోట్లాది రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు.
- కేశవరం, జడ్.మేడపాడుల వద్ద రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి అంచనాలు సిద్ధమై టెండర్ల దశలో ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
-ఇంటింటికీ కుళాయి పథకం ద్వారా తాగునీటి సమస్యను ప్రధానంగా తీసుకుని పరిష్కరిస్తున్నారు.
ప్రధాన సమస్యలపై..
- ఎన్నికల సమయంలో తాను నెగ్గిన మూడు నెలల కాలంలోనే మండపేటలో నిర్మించిన టిడ్కో గృహాలను అన్ని సౌకర్యాలతో లబ్ధిదారులకు అందజేస్తామన్న హామీ ఏడాదైనా ఇంకా అమలులోకి రాలేదు.
- మొత్తం 6400 గృహాలకుగాను ఫేజ్-2లో నిర్మించిన 2200 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందిస్తామన్న హామీ అమలు కోసం నియోజకవర్గ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ హామీ అమలుపై ప్రతిపక్ష పార్టీలు కూడా ఒత్తిడి పెంచుతున్నాయి.
బండారు సత్యానందరావు, టీడీపీ ఎమ్మెల్యే, కొత్తపేట
- నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో సుమారు రూ.వంద కోట్ల అంచనా వ్యయంతో రహదారుల నిర్మాణం కొన్ని పూర్తికాగా, మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.
- సెంట్రల్ డెల్టాలో అత్యంత కీలకమైన లొల్ల లాకుల ఆధునికీకరణ ప్రక్రియకు భారీ వ్యయ ప్రణాళికతో ప్రతిపాదనలు సిద్ధంచేసి ఇరిగేషన్ మంత్రి ద్వారా ఆ పనులకు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
- వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి విస్తరణ పనులు కోట్ల రూపాయల వ్యయంతో కొనసాగుతున్నాయి.
- కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై జొన్నాడ వద్ద ఫ్లైఓవర్ వారధి నిర్మాణానికి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
- వానపల్లిలో శ్రీపళ్లాలమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెసేందుకు రూ.11 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధంచేసి అధికారులకు పంపించారు.
- వారానికోసారి ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నారు.
కల.. నెరవేరేలా..
కోనసీమ పరిధిలో కాటన్ బ్యారేజీ సమీపంలో పిచ్చుకలంకలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలకు చంద్రబాబు ప్రభుత్వంలో మళ్లీ అడుగులు ముందుకు పడుతున్నాయి. ఓబరాయ్ గ్రూప్ ప్రతినిధులతో కలిసి పిచ్చుకలంకను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఏళ్లతరబడి ఎన్నికల హామీగానే ఉన్న ఈ ప్రాజెక్టు కల సాకారం అవుతుండడం విశేషం.
అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ ఎమ్మెల్యే, అమలాపురం
- నియోజకవర్గ స్థాయిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు భారీ వ్యయ ప్రణాళికలతో అమలవుతున్నాయి.
- ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే కొన్ని నిర్మాణాలను పూర్తిచేశారు. రహదారులను నిర్మించారు. పర్యాటక కట్టడాలు నిర్మితమవుతున్నాయి.
-ఎస్.యానాం బీచ్‌లో భారీ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది.
-అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్య నివారణకు ప్రధాన కెనాల్‌పై రూ.4 కోట్ల అంచనా వ్యయంతో రెండు వంతెనల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
-అమలాపురంలో రైతును బజార్‌ను, అన్న క్యాంటీన్‌ను పునరుద్ధరించారు.
-వారానికోసారి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు.
ప్రధాన సమస్యలపై..
- జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణ పరిసరాల్లో ఏడు ప్రదేశాల్లో వంతెనలు నిర్మించి రహదారులను అభివృద్ధి చేసే ట్రాఫిక్ సమస్య నివారణతోపాటు ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయనే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల్లో ఈ మేరకు హామీ ఇచ్చారు. అమలాపురం-బొబ్బర్లంక కెనాల్‌పై రెండు వంతెనలను ప్రారంభించి మరికొన్ని రోజుల్లో పూర్తి చేసేందుకు తొలిదశ ప్రయత్నాలు తుది దశకు చేరాయి. జిల్లా కేంద్రంగా ఉన్న పట్టణాన్ని సర్వాంగ సుందరంగా చేయాలనే ఆలోచనతో ఉన్నారు.
దేవ వరప్రసాద్, జనసేన ఎమ్మెల్యే, రాజోలు
- నియోజకవర్గ స్థాయిలోని వివిధ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సుమారు రూ.50 కోట్ల వ్యయం కాగల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, కండకర్లు ఏర్పాటుచేశారు.
- గుడిమెళ్లంక వాటర్ ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామాల్లో తాగునీటిని అందించేందుకు చేపట్టిన చర్యలు ఫలవంతమయ్యాయి.
- సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పేద ప్రజలకు వైద్య ఆరోగ్య ఖర్చుల కింద భారీగా నిధులను మంజూరు చేయించి ఆ కుటుంబాలను ఆదుకోవడంలో ఎమ్మెల్యే కృషిని ప్రశంసిస్తున్నారు.
- నియోజకవర్గ స్థాయిలో ఉపాధిహామీ పథకంతో పాటు వివిధ పథకాలతో ఎంపీ ల్యాడ్స్, సీఎస్సార్ నిధులతో సీసీ రోడ్లు, ఇతర నిర్మాణాలను కొనసాగిస్తున్నారు.
ప్రధాన సమస్యలపై..
సముద్ర తీర ప్రాంత గ్రామాలైన గొంది, కరవాక వంటి ప్రాంతాలకు మంచినీటిని అందించి ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కృషి చేస్తున్నారు. ఆ రెండు గ్రామాలకు త్వరలోనే మంచినీటి పథకం అమలు ద్వారా ఆ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి సన్నాహాలు చేపట్టారు. వీటితోపాటు రూ.1800 కోట్ల అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలుచేసే క్రమంలో బొబ్బర్లంక నుంచి నియోజకవర్గానికి ప్రత్యేక పైపులైను ఏర్పాటుచేసే ప్రతిపాదనలపై ఐఏఎస్‌గా తనకున్న అనుభవంతో పనిచేస్తున్నారు.
గిడ్డి సత్యనారాయణ, జనసేన ఎమ్మెల్యే, పి.గన్నవరం
-నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి శరవేగంగా సాగుతోంది.
- రూ.32 కోట్ల ప్యాకేజీతో నాలుగు రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పి.గన్నవరం-మాచవరం మధ్య రహదారి నిర్మాణం పూర్తి అయింది.
- జి.పెదపూడి వద్ద రూ.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వారధి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి కావచ్చాయి.
- అప్పనపల్లి-పాశర్లపూడి మధ్య రూ.8 కోట్ల అంచనా వ్యయంతో కాజ్‌వే, రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనులు చేపట్టాల్సి ఉంది.
- నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పేదలకు వైద్య, ఆరోగ్య ఖర్చుల కింద ఏడాది కాలంలో కోట్లాది రూపాయల నిధులు పంపిణీ చేశారు.
ప్రధాన సమస్యలపై..
నియోజకవర్గ పరిధిలో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ నదీపాయలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో నదీ కోతకు గురవుతున్న భూముల రక్షణకు రివిట్‌మెంట్ల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన పెండింగ్ దశలో ఉంది. వీటితోపాటు ముక్తేశ్వరం-వీరవల్లిపాలెం మధ్య ఉన్న తొగరపాయపై వారధి నిర్మాణానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. నదీ కోతకు గురవుతున్న భూములను రక్షించడానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేయాలి.
దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) టీడీపీ ఎమ్మెల్యే, ముమ్మిడివరం
- నియోకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రహదారుల విస్తరణ, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు.
- తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో రూ.76.90 కోట్ల అంచనా వ్యయంతో వారధుల విస్తరణ, నిర్మాణానికి ప్రతిపాదనలు అమలు దశలో ఉన్నాయి.
- రూ.30.39 కోట్ల అంచనా వ్యయంతో 196 రోడ్లు, కల్వర్టులు, ఇతర నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
-రూ.కోటి 92 లక్షలతో ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతులు చేశారు.
- పాత ఇంజరం వద్ద రూ.3 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణానికి మరమ్మతులు చేపట్టారు.
- రూ.25 కోట్లతో నియోజకవర్గంలో ఓహెచ్‌ఆర్‌లు, 300 కిలోమీటర్ల మేర పైపులైన్ల పనులు చేపట్టారు.
-20,878మంది మత్స్యకార కుటుంబాలకు రూ.133 కోట్లు పంపిణీ చేశారు.
ప్రధాన సమస్యలపై..
గౌతమీ, వృద్ధగౌతమీ నదీపాయల వెంబడి రివిట్‌మెంట్ల నిర్మాణం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా 4 కిలోమీటర్ల మేర పిచ్చింగ్, రివిట్‌మెంట్‌కు రూ.230 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 44.50 కోట్ల అంచనా వ్యయంతో గుత్తెనదీవి-గోగుల్లంక, జి.మూలపొలం-పల్లంకుర్రు మధ్య వారధుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
Updated Date - Jun 12 , 2025 | 01:43 AM