ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ!
ABN, Publish Date - Jul 26 , 2025 | 01:04 AM
కొవ్వూరు -భద్రాచలం రైల్వే లైను నిర్మాణంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు ఆరున్నర దశాబ్దాలుగా కాలయాపన చేస్తున్నాయి.
గత 65 ఏళ్లుగా ఇంతే
నేడు..రేపు అంటూ సాగదీత
నేటికీ లైన్‌లో పడని పనులు
తెలంగాణలో పూర్తయిన వైనం
ఏపీలో ఎదురుచూపులు
పాజెక్ట్ పూర్తయితే ఉపయోగం
ఎంపీ పురందేశ్వరి దృష్టి పెట్టాల్సిందే
కొవ్వూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): కొవ్వూరు -భద్రాచలం రైల్వే లైను నిర్మాణంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు ఆరున్నర దశాబ్దాలుగా కాలయాపన చేస్తున్నాయి. అసలు ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తుందా అని సందేహాలను వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం - కొవ్వూరు రైల్వేలైను నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రైల్వే శాఖ నుంచి గతేడాది హామీ లభించింది. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారం భం కాలేదు. ఎప్పుడు ప్రారంభమయ్యేది కూట మి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని రైల్వే అధికారులు తేల్చి చెబుతున్నారు.
నిధులిస్తామన్నా.. కదలికేది..
కొవ్వూరు -భద్రాచలం రైల్వే మార్గంపై తొలిసారిగా 1960లో సర్వే చేశారు.అప్పటి నుంచి ప్రతి బడ్జెట్‌లోను ఈ రైల్వే లైను గురించి ప్రస్తావన వస్తున్నప్పటికీ ఏనాడు రూపాయి విదల్చలేదు.గడచిన పదేళ్లలో సర్వే,ఇతర పనుల కు రూ.40 కోట్ల వరకు కేటాయించారు. 2011- 2012 బడ్జెట్‌లో రైల్వే శాఖ కొవ్వూరు -భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిం ది. ఈ లైను నిర్మాణానికి రూ.2,155 కోట్లు అవసరమని అంచనాలు తయారుచేశారు. ఇదిలా ఉండగా ఇటీవల సుమారు రూ.2,155 కోట్లు ప్రతిపాదిత వ్యయం మంజూరు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటిస్తూ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి రాతపూర్వకంగా తెలియజేశారు. అయినా ముందుకు కదల్లేదు. ప్రస్తుతం రాజమ హేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి ఉండడంతో కదలిక వస్తుందని అంతా ఆశించారు. అయినా అంతే.నిర్మాణం వ్యయం పెరుగుతుంది.
తెలంగాణలో ఓకే.. ఏపీలో షాకే..
2014లో రాష్ట్ర విభజన అనంతరం బొగ్గు రవాణా అవసరాల దృష్ట్యా భద్రాచలం రోడ్ నుంచి సత్తుపల్లి వరకు దాదాపు 54 కిలోమీటర్లు రైల్వేలైను నిర్మాణానికి తెలంగాణ ప్రభు త్వం తరపున సింగరేణి సంస్థ యాజమాన్యం రూ. 706 కోట్లు ఖర్చు భరించగా.. దక్షిణ మధ్య రైల్వే తన వాటా రూ.85 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.దీంతో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే లైనును 2022లో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.ప్రస్తుతం కొవ్వూరు- సత్తుపల్లి మధ్య రైల్వే లైను నిర్మాణం పూర్తిచేస్తే సరిపోతుందని భావిస్తున్నారు.సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు (కొవ్వూరు,దేవరపల్లి, జంగారెడ్డిగూడెం మీదుగా తెలంగాణలోని ఆశ్వారావుపేట, సత్తుపల్లి వరకు రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉండగా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైల్వే లైను పనుల్లో పురోగతి లేదు.ఈ రైలు మార్గం నిడివి మొదట్లో 165 కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం 119 కిలోమీటర్లకు తగ్గింది. ఒప్పందం ప్రకారం 100 కిలోమీటర్ల వరకు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఇప్పటికే తెలంగాణలో నిర్మాణం పూర్తిచేసుకుని ఏపీ నిధులకు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.కూటమి ప్రభుత్వమైనా రైల్వే లైను నిర్మాణ పనులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
భూసేకరణ చేస్తే సరి..
ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ, రైల్వే యూనియన్ నాయకుడు ఉన్నికృష్ణణ్‌లతో కలిసి ఈ నెల 15న సికింద్రాబాద్ రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర అధికారులను కలిసి సత్తుపల్లి నుంచి కొ వ్వూరు నూతన రైల్వే నిర్మాణ పనులపై ప్రస్తావించారు.దీనిపై రైల్వే జీఎం శ్రీవాస్తవ స్పందిస్తూ భద్రాచలం రోడ్- కొవ్వూరు రైల్వే లైను నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తమ వాటా సొమ్ము చెల్లించడంతో భద్రాచలం రోడ్ నుంచి సత్తుపల్లి వరకు లైను నిర్మాణం పూర్తయిందని, ఏపీ ప్రభుత్వం భూ సేకరణ చేసి అప్పగిస్తే 2030 నాటికి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. రైల్వే లైను నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అసెంబ్లీలో చర్చించారు.ఇప్పటికైనా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఎంపీలు ఈ రైల్వే లైను నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభిం చి పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖపై ఒత్తిడి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ లైన్ పూర్తయితే లాభం..
కొవ్వూరు-భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) మధ్య రైల్వే లైను నిర్మాణం పూర్తయితే విశాఖ-సికింద్రాబాద్‌ల మద్య సుమారు 110 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. రెండున్నర గంటలకు పైగా ప్రయాణ సమయం ఆదా అవుతుంది. విజయవాడ రైల్వేస్టేషన్‌పై భారం తగ్గించే వెసులబా టు ఉంటుంది. కేవలం హైదారాబాద్ ప్రయాణించే రైళ్లే కాకుండా వరంగల్ మీదుగా నాగపూర్, జైపూర్, న్యూఢిల్లీ వైపు వెళ్లే రైళ్లను ఈ మార్గంలో మళ్లించవచ్చు. ఈ రైలు మార్గం పూర్తయితే డివిజన్ కేంద్రమైన కొవ్వూ రు రైల్వేస్టేషన్ ఇటు విజయవాడ, మరోవైపు భద్రాచలం వైపు వెళ్లే రైళ్లకు ప్రధాన రైల్వే జంక్షన్‌గా మారుతుంది. దీంతో ఇక్కడ మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఉంటుంది.
Updated Date - Jul 26 , 2025 | 01:04 AM