9,10 తేదీల్లో ‘నన్నయ’లో అంతర్జాతీయ సెమినార్
ABN, Publish Date - Jul 04 , 2025 | 01:22 AM
రసాయనశాస్త్రం అంతర్జాతీయ సెమినార్ ఈ నెల 9,10 తేదీల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడెం క్యాంపస్ రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతుందని ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు.
బ్రోచర్ ఆవిష్కరణలో వీసీ ప్రసన్నశ్రీ
దివాన్‌చెరువు, జూలై3 (ఆంధ్రజ్యోతి): రసాయనశాస్త్రం అంతర్జాతీయ సెమినార్ ఈ నెల 9,10 తేదీల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడెం క్యాంపస్ రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతుందని ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఈ మేరకు నన్నయ వర్శిటీ స్థానిక క్యాంపస్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో బ్రోచర్‌ను వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేంద్రీయ విశ్లేషణాత్మక, ఔషధ అభివృద్ధిలో ఇటీవలి ధోరణులు అనే అంశంపై తాడేపల్లిగూడెం క్యాంపస్‌లో ఈ సెమినార్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యవక్తలుగా యూఎస్‌ఏలోని రోహన్ విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య కేవీ రామానుజాచారి, చైనా నుంచి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్.నాగన్న, వరంగల్ ఎన్‌ఐటీ ఆచార్యులు పి.నాగేశ్వరరావు, ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి డాక్టర్ రాంబాబురెడ్డి హాజరై ఉపన్యసిస్తారని చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, తాడేపల్లిగూడెం క్యాంపస్ ప్రిన్సిపాల్ ఆచార్య టి.అశోక్ పాల్గొన్నారు.
యూనియన్ బ్యాంక్ వితరణ
నన్నయ వర్శిటీకి యూనియన్ బ్యాంక్ అధికారులు రూ.2,59,600 విలువైన డోజర్, డిగ్గర్‌లను బహూకరించారు. వాటిని బ్యాంక్ అధికారులతో కలసి వీసీ ప్రసన్నశ్రీ ప్రారంభించారు. వర్శిటీ ప్రాంగణాన్ని శుభ్రపరచడానికి, మొక్కలు నాటేందుకు ఈ పరికరాలు ఉపయోగకరమ న్నారు. యూనివర్శిటీ అభివృద్ధిలో భాగస్వామ్యమైన యూనియన్ బాంక్ రాజమండ్రి రీజనల్ హెడ్ ఎ.విశ్వేశ్వరరావు, డిప్యూటీ రీజనల్ హెడ్ ఏ.మనోజ్, చీఫ్ మేనేజర్ జి.సురేష్‌ను వీసీ అభినందించారు. బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ డి.నిర్మలజ్యోతి, స్థానిక బ్రాంచ్ మేనేజర్ పి.ప్రవీణ్, ఇంజనీర్ ప్రేమచంద్ పాల్గొన్నారు.
అడహక్ కమిటీ నూతన కార్యవర్గం
నన్నయ వర్శిటీ అడహక్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి తాను అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు సహాయాచార్యుడు డీఎస్‌ఆర్‌ఎస్ ప్రకాష్ గురువారం తెలిపారు. ఉపాధ్యక్షులుగా పి.రాజశేఖర్, హీరాబట్టు, ఎల్.మధుకుమార్, కార్యదర్శులుగా ఎల్.సుజాత, వీవీఎం యూ ఫణీంద్ర, సంయుక్త కార్యదర్శిగా డి.శ్రీనివాసరావు, కోశాధికారిగా పి.లక్ష్మీనారాయణతోబాటు10 మంది అడ్వైజరీ బోర్డు సభ్యులను ఎన్నుకున్నట్టు ప్రకాష్ పేర్కొన్నారు. నూతన కార్యవర్గాన్ని వీసీ ప్రసన్నశ్రీ అభినందించారు.
Updated Date - Jul 04 , 2025 | 01:22 AM