ఊరెళ్తున్నారా...కాస్త చెప్పి వెళ్లండి!
ABN, Publish Date - May 11 , 2025 | 01:22 AM
పరీక్షలు పూర్తయ్యాయి. స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చేశారు. సమ్మర్ టూర్లకు చాలా మంది సిద్ధమవుతుంటారు. పిల్లలను తీసుకుని సరదాగా గడిపేందుకు ఊర్లు వెళ్తారు. కొంతమంది నగరాలు, పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళితే.. మరికొందరు పుణ్యక్షేత్రాలు, వేసవి విడిదులకు వెళ్లి వస్తుంటారు. ఇక ఇదే అదునుగా చోరులు కూడా రెచ్చిపోతుంటారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుల్ల చేస్తుంటారు. ఏటా వేసవి వచ్చిందంటే చాలు దొంగలకు పండగే.. పొద్దున్న రెక్కీ నిర్వహించడం.. రాత్రికి ఇళ్లను కొల్లగొట్టడమే వీరి పని. అయితే ఇటువంటి చోరీలకు పాల్పడేవారికి చెక్ పెడుతున్నారు కాకినాడ జిల్లా పోలీసులు. ఎల్‌హెచ్‌ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానటరింగ్ సిస్టం)తో వారి ఆటకట్టిస్తున్నారు.
ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలపై కాకినాడ జిల్లా పోలీసుల విస్తృత ప్రచారం
ఇళ్ల దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని పిలుపు
నిఘా కెమెరాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన
పరీక్షలు పూర్తయ్యాయి. స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చేశారు. సమ్మర్ టూర్లకు చాలా మంది సిద్ధమవుతుంటారు. పిల్లలను తీసుకుని సరదాగా గడిపేందుకు ఊర్లు వెళ్తారు. కొంతమంది నగరాలు, పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళితే.. మరికొందరు పుణ్యక్షేత్రాలు, వేసవి విడిదులకు వెళ్లి వస్తుంటారు. ఇక ఇదే అదునుగా చోరులు కూడా రెచ్చిపోతుంటారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుల్ల చేస్తుంటారు. ఏటా వేసవి వచ్చిందంటే చాలు దొంగలకు పండగే.. పొద్దున్న రెక్కీ నిర్వహించడం.. రాత్రికి ఇళ్లను కొల్లగొట్టడమే వీరి పని. అయితే ఇటువంటి చోరీలకు పాల్పడేవారికి చెక్ పెడుతున్నారు కాకినాడ జిల్లా పోలీసులు. ఎల్‌హెచ్‌ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానటరింగ్ సిస్టం)తో వారి ఆటకట్టిస్తున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై పోలీసు యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తోంది. సెలవుల్లో ఊర్లకు, టూర్లకు వెళ్లే వారు కచ్చితంగా ఈ సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఈ సిస్టమ్‌పై అవగాహన ఉన్న వారు ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో ప్రస్తుతం 44 కెమెరాలను అందుబాటులో ఉంచారు. కాకినాడ వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, సర్పవరం, ఇంద్రపాలెం, పోర్టు, గొల్లప్రోలు, పెద్దాపురం, సామర్లకోట, తుని పోలీసు స్టేషన్లలో ఈ కెమెరాలను అందుబాటులో ఉంచారు. గతేడాది ఈ సేవలను సుమారు 38 ఇళ్ల యజమానులు వినియోగించుకున్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాలను అమర్చడమే కాదు.. ఇద్దరు కానిస్టేబుళ్ల నిఘా కూడా ఆ ఇంటి పరిసరాల్లో ఉంటుంది.
యాప్ కూడా ఉంది...
ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీసు అనే యాప్ కూడా అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసి ముందుగా రిజిస్టర్ అవ్వాలి. రిక్వెస్ట్ పోలీస్ వాచ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ వివరాలు, ఇంటి చిరునామా వివరాలు, మొబైల్ నెంబరు పొందుపరచాలి. మీరు ఉండే లొకేషన్ చూపిస్తుంది. తర్వాత మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. అలాగే మీ రిజిస్ట్రేషన్ విజయవంతమైనట్టుగా సాధారణ మెసేజ్ రూపంలో రిజిస్ట్రేషన్ నెంబరు వస్తుంది. ఆ నెంబరును వాచ్ రిక్వెస్ట్ ఫామ్‌లో ఎంటర్ చేసి.. ఎప్పుడు ఊరెళుతున్నారు? ఎప్పుడు వస్తారు? తేదీలను నమోదు చేయాలి. ఆ సమాచారం ఆధారంగా ఎల్‌హెచ్‌ఎంఎస్ సర్వీస్ యాక్టివేషన్ ప్రారంభమవుతుంది.
ఏమిటిది...ఎలా పనిచేస్తుంది?
ఎల్‌హెచ్‌ఎంఎస్.. ఇది ఓ నిఘా కెమెరా. ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్న వారు పోలీసులకు సమాచారం అందిస్తే దానిని ఆ ఇంట్లో ఏర్పాటుచేసి వెళతారు. ఈ సేవలు పూర్తిగా ఉచితం. గరిష్ఠంగా 15 రోజుల వరకు ఇంట్లో ఈ సిస్టమ్ ఉంచే అవకాశం ఉంది. ఇంటి యజమానులు ముందుగా తమ ఏరియా పరిధిలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తమ ఇంటికి ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టం అమర్చాలని కోరాలి. అప్పుడు వారు ఈ కెమెరాను ఇంటిలోపల అమర్చుతారు. దొంగలు ఎవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే పోలీసు కేంద్ర కార్యాలయంలో అలారం మోగుతుంది. అంతే కాదు.. ఇంటి యజమాని, సమీప పోలీసు స్టేషన్‌కు కూడా సమాచారం వెళ్తుంది. దీంతో పోలీసులు ఐదు నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని చోరీని అడ్డుకునే అవకాశం ఉంది. దొంగలను కూడా పట్టుకుంటారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి విస్తృత ప్రచారం చేశారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే..
ఇంట్లో, ఇంటి బయట సీసీ కెమెరాలు తప్పనిసరిగా వేయించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక సీసీ కెమెరా వేయి కళ్లతో సమానమని చెప్తున్నారు. ప్రస్తుతం నేర, చోరీ సంబంధిత కేసుల్లో సీసీ కెమెరాలే కీలకంగా మారుతున్నాయంటున్నారు. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఇంటి నిర్మాణం చేసుకునేవారు.. కేవలం రూ.పదివేలలోపు ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నిరంతర పర్యవేక్షణ ఉంటుందని సూచిస్తున్నారు.
పర్యవేక్షణ పెంచాం: ఎస్పీ బిందుమాధవ్
జిల్లాలో చోరీలను అరికట్టేందుకు గట్టి నిఘా, గస్తీ నిర్వహిస్తున్నాం. రాత్రివేళల్లో వాహనాలను తనిఖీ చేయిస్తున్నాం. అపరిచిత వ్యక్తులపైన, ఆరా, పాత నేరస్తులపైన నిఘా ఉంచుతున్నాం. పగలు, రాత్రి కూడా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నాం. ముఖ్యంగా సెలవుల్లో ఊర్లకు, విహారయాత్రలకు వెళ్లే వారు కచ్చితంగా ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలను వినియోగించుకోవాలి. ఇళ్ల దొంగతనాలు అరికట్టేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీ సమీప పోలీసు స్టేషన్లో సమాచారం ఇస్తే వీటిని అందజేస్తారు.
Updated Date - May 11 , 2025 | 01:22 AM