వైద్యో..నారాయణో హరి..హరీ!
ABN, Publish Date - Jul 22 , 2025 | 01:21 AM
రాజమహేంద్రవరం ప్రభు త్వాస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి అత్యవస ర చికిత్స తక్షణ అవసరంగా కనిపిస్తోంది. గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని వస్తున్న బాధితులకు నిర్లక్ష్యం ఆహ్వానం పలుకుతోంది.
(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)
రాజమహేంద్రవరం ప్రభు త్వాస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి అత్యవస ర చికిత్స తక్షణ అవసరంగా కనిపిస్తోంది. గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని వస్తున్న బాధితులకు నిర్లక్ష్యం ఆహ్వానం పలుకుతోంది. గోల్డెన్ మినిట్స్‌ని వృథా చేస్తూ యథాలాపంగా విధులు నిర్వహిస్తుండడం బాధితులకు కన్నీటిని మిగులుస్తోంది. జిల్లా ఆస్పత్రి కావడంతో అత్యవసరంగా ఒక వ్యక్తిని ఆస్పత్రి వరకూ తీసుకొచ్చినా చికిత్స లోపలకు తీసుకెళ్లే వారు కానరావడంలేదు. స్ట్రెచర్, వీల్ చైర్ కోసం వెతుకులాట తప్పదు. దీంతో క్షతగాత్రులు రక్తం కారుతూ, బాధను ఓర్చుకుంటూ ఆటోలో, అంబులెన్సులో అప్పటి వరకూ ఉండాల్సిందే. స్ట్రెచర్‌ని బాధితులు వెతికి తెచ్చుకొని దానిపై క్షతగాత్రుని ఎక్కించడానికి నానా యాతన పడుతున్నారు. తీరా లోపలకు తీసుకెళ్లిన తర్వాత కూడా సిబ్బందిలో తాపత్రయం కనబడడం లేదు. కసురుకోవడం, విసుక్కోవడం ఎక్కువైపోయింది. ఒకవేళ ప్రాణం గుటుక్కుమంటే సీఎంవో గది బయటే స్ట్రెచర్‌పై గంటల తరబడి ఆ మృతదేహాన్ని వదిలేస్తున్నారు. ఇటువంటి ఘటనలు జిల్లా ఆసుపత్రిలో నిత్యకృత్యంగా మారాయి. వాస్తవానికి 2022 డిసెంబరు 21న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ కమిషనర్ ఆఫ్ ఏపీవీవీపీ ఆదేశాల ప్రకారం అత్యవసర చికిత్స కోసం వచ్చే వారిని క్యాజువాలిటీకి తీసుకెళ్లడానికి ద్వారం వద్ద 2 స్ట్రెచర్లు, 2 వీల్ చైర్లు, ఒక్కొక్కరు చొప్పున ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, వైద్యుడును (సీఎఎస్-జనరల్/జీడీఎంవో/హౌస్ సర్జన్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి) నిరంతరం అందుబాటులో ఉంచాలి.కానీ ఇక్కడ స్ట్రెచర్ కూడా కానరాదు.
ఈ ఫొటోలు చూస్తే ప్రభుత్వాస్పత్రిలోని అత్యవసర విభాగం అలసత్వం అర్థమవు తుంది. ఓ దివ్యాంగురాలు ఆస్పత్రి వరకూ ఆటోలో వచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్లే వీల్ చైర్ లేక గంటల తరబడి అలాగే ఉండిపోయింది. మరొక మహిళను ఆస్పత్రికి అత్యవసర చికిత్సకు తీసుకొచ్చి స్ట్రెచర్‌పై ఇబ్బందులు పడుతూ తీసుకెళ్లారు. ఈ దుస్థితి ఇక్కడ నిత్యకృత్యంగా మారిపోయింది. అర్ధరాత్రి వేళలో వస్తే వైద్యో నారాయణో హరి..హరీయే!
Updated Date - Jul 22 , 2025 | 01:21 AM