కోనసీమలో 3వేల సీసీ కెమెరాలు
ABN, Publish Date - May 22 , 2025 | 12:25 AM
మలికిపురం, మే 21(ఆంధ్రజ్యోతి): నేరాల అదుపునకు పోలీసులు నూతన టెక్నాలజీని ఉపయోగించి చాలా ఫలితాలు సాధించినట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ని ముఖ్య కూడళ్లలో ఇప్పటికే 3వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు
మహిళలపై జరిగే నేరాలను గుర్తించడానికి 6 జిల్లాల్లో ప్రత్యేక టీములు
ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్
మలికిపురం, మే 21(ఆంధ్రజ్యోతి): నేరాల అదుపునకు పోలీసులు నూతన టెక్నాలజీని ఉపయోగించి చాలా ఫలితాలు సాధించినట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ని ముఖ్య కూడళ్లలో ఇప్పటికే 3వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. బుధవారం మలికిపురం పోలీసుస్టేషన్ సందర్శనకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. నేరాల దర్యాప్తు, పరిశోధనలలో కెమెరాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన నేరాలు, దొంగతనాలను, నేరస్తులను గుర్తించడానికి సీసీ కెమెరాలు చాలా దోహదపడ్డాయన్నారు. పలు గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, వర్తక సంఘాలు, దాతలు ముందుకు వస్తున్నారని ప్రసంశించారు. గ్రామాల్లో నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసుకునేవారు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. మలికిపురం పోలీసుస్టేషన్ పరిధిలో క్రైమ్ రేటు తక్కువగా ఉందన్నారు. సీసీ కెమెరాల ద్వారా అమలాపురం వంటి ప్రాంతాల్లో దేవాలయాల్లో దోపిడీలు చేసినా శ్రీకాకుళం గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. జిల్లాలో గంజాయి నేరాలు తగ్గాయని, ఈ కేసుల్లో పాత నేరస్తులపై నిఘా ఉంచి కట్టడి చేస్తున్నామని వీటి కోసం ఈగల్ బృందాలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. గల్ఫ్ వెళ్లేవారు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారని, మోసాలకు గురవుతున్నారని, లైసెన్సు కలిగిన ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లేలా అవగాహన కల్పిద్దామన్నారు. మహిళలపై జరిగే నేరాలపై వెంటనే స్పందించి ప్రత్యేక బృందాల ద్వారా గుర్తించి వారికి వెంటనే శిక్షలు పడేలా ఏలూరు రేంజ్ పరిధిలోని 6జిల్లాల్లో ప్రత్యేక టీములు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.
మహిళల కోసమే శక్తి యాప్
ప్రమాదాలు జరిగే ప్రాంతాలు గుర్తించామని, రోడ్ సేఫ్టీ సమావేశాల్లో ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎక్కువ ప్రమాదాలు రోడ్లుపై నిలిపి ఉంచిన వాహనాల ద్వారా జరుగుతున్నాయని, రోడ్డుపై వాహనాలు నిలిపి ఉంచకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం శక్తి యాప్ ప్రవేశపెట్టిందని, నేరాలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై చర్యలు వెంటనే తీసుకోనున్నట్టు తెలిపారు. మలికిపురం స్టేషన్‌లో రికార్డులను ఐజీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా ఆయనకు జిల్లా ఎస్పీ కృష్ణారావు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఐజీ పోలీసు వందనాన్ని స్వీకరించారు. మలికిపురం ఎస్‌ఐ పి.సురేష్‌కి మొక్క అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ సుంకర మురళీమోహన్, సీఐ నగేష్‌కుమార్, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2025 | 12:25 AM