శరవేగంగా ఈదరపల్లి వంతెన పనులు
ABN, Publish Date - May 30 , 2025 | 12:24 AM
రూ.4కోట్ల అంచనా వ్యయంతో ఈదరపల్లి, నడిపూడి గ్రామాల్లో బెండా కెనాల్‌పై చేపట్టిన వంతెనల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అమలాపురం రూరల్, మే 29(ఆంధ్రజ్యోతి): రూ.4కోట్ల అంచనా వ్యయంతో ఈదరపల్లి, నడిపూడి గ్రామాల్లో బెండా కెనాల్‌పై చేపట్టిన వంతెనల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 12వ తేదీన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రతిష్టాత్మకంగా వంతెన నిర్మాణ పనులకు భూమిపూజచేసి పనులు ప్రారంభించారు. బొబ్బర్లంక రహదారి 1/10 కిలోమీటరు వద్ద మైనరు బ్రిడ్జి (ఈదరపల్లివంతెన), ముక్కామల లాకు రహదారి 2/2 కిలోమీటరు వద్దమైనరు బ్రిడ్జి (నడిపూడి వంతెన) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది అమలాపురం పట్టణాన్ని ఆనుకుని మరో ఐదు వంతెనల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ఆనందరావు ముందుగానే ప్రకటించడం విశేషం. గత వైసీపీ ప్రభుత్వంలో వంతెనల నిర్మాణాలు కేవలం ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమయ్యాయి. దశాబ్దాల కాలంనాటి ఈదరపల్లి వంతెన వద్ద నూతన వంతెన నిర్మాణంతో పాటు ఆక్రమణల తొలగింపుపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మాణంలో భాగంగా బెండా కెనాల్‌కు ఆనుకుని నడిపూడి డాబా గార్డెన్ మీదుగా ప్రత్యేక తాత్కాలిక వంతెన నిర్మించారు. అయితే అటుగా వాహనాలు వెళ్లేందుకు స్థానికులు రెండు రోడ్డు మార్గాలకు అడ్డంకులు సృష్టిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
Updated Date - May 30 , 2025 | 12:24 AM