జిల్లాలో ఐదు చోట్ల ప్రత్యేక సదరం శిబిరాలు
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:29 AM
జిల్లాలో ఐదుచోట్ల ప్రత్యేక సదరం వెరిఫికేషన్ క్యాంపులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. త్వరలో నిడదవోలు సీహెచ్‌సీ పరిధిలో కూడా ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
త్వరలో నిడదవోలు సీహెచ్‌సీలో కూడా ..
రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిలో మౌలిక సదుపాయాలకు చర్యలు
వైద్యాధికారుల సమీక్షలో కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఐదుచోట్ల ప్రత్యేక సదరం వెరిఫికేషన్ క్యాంపులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. త్వరలో నిడదవోలు సీహెచ్‌సీ పరిధిలో కూడా ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ బోధనాసుపత్రి సూపరింటెండెంట్, ఇతర సమన్వయశాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 32,500 మంది దివ్యాంగ పింఛన్ల తనిఖీ, రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తుండగా, గత మూడు నెలల్లో 10,500 దివ్యాంగ పింఛన్లు తనిఖీ చేశామన్నారు. ఇంకా సుమారు 21 వేల దివ్యాంగ పింఛన్లు తనిఖీ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం, అనపర్తి, కడియం, కొవ్వూరు, గోపాలపురంలో దివ్యాంగ పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోందన్నారు. కాగా, రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందజేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ప్రధానంగా ఆర్దోపెడిక్ విభాగంపై ప్రత్యేక దృష్టిసారించాలని, పిల్లల విభాగంలో వెంటిలేటర్లు, కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ వైద్యుల కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. అలాగే చిన్నారులు ఎక్కువ మంది కుక్కకాటు బారిన పడుతున్నారని, దీనిపై నగరపాలక సంస్థ అధికారులు, పంచాయతీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో స్టెరిలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలు, సిఫారసులకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతస్థాయి అధికారులకు పంపించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ బోధనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.లక్ష్మీసూర్యప్రభ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 12:29 AM