రజకుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తా
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:34 AM
రాజమహేంద్రవరం అర్బన్, జూలై 6(ఆంధ్రజ్యోతి): రజకుల అవసరాలను, వారి సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, వారిని ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర సామాజిక, న్యాయశాఖామంత్రితో రజక సంఘ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రజకు
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ
రాజమహేంద్రవరంలో రజకుల ఆకాంక్ష సభ
రాజమహేంద్రవరం అర్బన్, జూలై 6(ఆంధ్రజ్యోతి): రజకుల అవసరాలను, వారి సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, వారిని ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర సామాజిక, న్యాయశాఖామంత్రితో రజక సంఘ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రజకుల ఆకాంక్ష సభ నిర్వహించారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేశారు. కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రజకుల అభ్యున్నతికి వారికి అవసరమైన డిమాండ్లకు తన మద్దతు ఉంటుందన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రజకుల సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ బలహీనవర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రజకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ కులవృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి మాట్లాడుతూ రజకులకు మేలు చేకూర్చే జీవో 27ను అమలుపై రాష్ట్ర మంత్రులకు విన్నవించగా సానుకూల స్పందన వచ్చిందన్నారు. ప్రభుత్వ రంగంలోని దోబీ పోస్టులు, కాంట్రాక్టులను రజకులకు కేటాయించేలా ప్రత్యేక జీవో తీసుకురావాలని కోరుతున్నామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రజకసేవా సంఘం నాయకులు, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు, రజకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 12:34 AM