‘సుఖీభవ’ అనరే..
ABN, Publish Date - May 31 , 2025 | 12:51 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి రీసర్వే తప్పులు తల నొప్పులుగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అడ్డగోలు వ్యవహారంతో వేలాది మంది అన్నదాతలు ఇప్పుడు పథకానికి దూరమయ్యే ప్రమాదం నెలకొంది. పూర్వపు సర్వే నెంబర్ల స్థానంలో కొత్తగా ఎల్‌పీఎం నెంబర్లు కేటాయించే క్రమంలో అనేక తప్పులు దొర్లడంతో రైతులు నెత్తీనోరు బాదుకుంటున్నారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో అన్నదాత సుఖీభవకు రీసర్వే గండం
గత వైసీపీ ప్రభుత్వంలో తప్పిదాలు అన్నదాతలకు శాపంగా మారిన వైనం
సర్వే నెంబర్ల స్థానంలో తెచ్చిన ఎల్‌పీఎం నెంబర్ల విధానంలో అడ్డగోలు తప్పులు
ఒక్కో ఎల్‌పీఎంల్లో పదులకొద్దీ రైతుల విస్తీర్ణాలు ఉంచేసి రీసర్వే
ఉమ్మడి జిల్లాలో 69,327మంది పథకానికి దూరమయ్యే ప్రమాదం
ఇప్పటివరకు 8,82,286 మంది రైతుల వివరాలు ఆన్‌లైన్ పరిశీలన పూర్తి
మరోపక్క అర్హుల జాబితా ఖరారుకు వ్యవసాయశాఖ దాదాపుగా కసరత్తు పూర్తి
ఈలోపు రెవెన్యూశాఖ తప్పులు సరిదిద్దకపోతే వేలల్లో నష్టపోనున్న రైతులు
(కాకినాడ/పిఠాపురం-ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి రీసర్వే తప్పులు తల నొప్పులుగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అడ్డగోలు వ్యవహారంతో వేలాది మంది అన్నదాతలు ఇప్పుడు పథకానికి దూరమయ్యే ప్రమాదం నెలకొంది. పూర్వపు సర్వే నెంబర్ల స్థానంలో కొత్తగా ఎల్‌పీఎం నెంబర్లు కేటాయించే క్రమంలో అనేక తప్పులు దొర్లడంతో రైతులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఒక రైతుకు ఒక ఎల్‌పీఎంకు బదులు ఒకే నెంబర్ పదుల కొద్దీ రైతులకు ఇచ్చేసి రీసర్వే పాపాలు చేయడంతో వారి పేర్లు సర్వర్లకు ఎక్కడం లేదు. ఈ తప్పులను సరిచేయాలని వ్యవసాయశాఖ అధికారులు రెవెన్యూశాఖకు వివరాలు పంపినా కనీసం ఖాతరు చేయకుండా వాటిని పక్కన పడేసింది. మరోవైపు జిల్లాస్థాయిలో అర్హుల జాబితాలను తయారు చేసి వాటిని ప్రభుత్వానికి పంపడంలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమైంది. ఈలోపైనా సమస్య పరిష్కారం చేయాలని రైతులు కోరుతున్నారు.
అన్నదాత సుఖీభవ పథకం జూన్‌లో అమలు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిసి రైతు కుటుంబం యూనిట్‌గా ఏడాదికి రూ.20వేల చొప్పున ఈ పథ కం ద్వారా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామ ని సీఎం ఈ సందర్భంగా స్పష్టంచేశారు. అంటే పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6వేలు, మిగిలిన రూ. 14 వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున పథకం కింద డబ్బులు జమ చేయనున్నారు. అందులోభాగంగా పథకం అమలుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కసరత్తు మొదలుపెట్టింది. అందులోభాగంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలను తయారు చేయాలని జిల్లాల వ్యవసాయశాఖలను ఆదేశించింది. ఈనేపథ్యంలో తమ వద్దనున్న వెబ్‌ల్యాండ్ వివరాల ఆధారంగా జిల్లాల వారీగా రైతుల వివరాల నివేదికను అధికారులు సిద్ధం చేశారు. వీటిని రైతు సేవా కేంద్రాలు, సచివాలయాల్లో ని వీఏఏలకు, మండల వ్యవసాయాధికారులకు పరిశీలన కోసం ఇటీవల పంపారు. వెబ్‌ల్యాండ్ వివరాలను సరిచూసి తుది జాబితా రూపొందించాలని ఆదేశించా రు. ఈ క్రమంలో కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల పరిధిలో వ్యవసాయాధికారులు, సిబ్బంది ప్రస్తుతం జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. మరో రెండు రోజుల్లో అర్హుల జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. అయితే వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా లబ్ధిదారుల జాబితా తయారీలో ఇప్పుడు వ్యవసాయశాఖ అధికారులు తలలు పట్టు కుంటున్నారు. వేలాదిమంది రైతులకు సంబంధించి వివరాలు గందరగోళంగా ఉండడంతో వాటిని నమోదు చేయడానికి నిబంధనలు అంగీకరించక ఏంచేయాలో తెలియక వారిని పక్కన పెడుతున్నారు. దీనికంతటికి గత వైసీపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న రీసర్వే తప్పులే కారణం. అప్పట్లో రీసర్వే పేరుతో ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్న సర్వే నెంబర్ల స్థానంలో ఎల్‌పీఎం(ల్యాండ్ పార్శిల్ మ్యాప్) నెంబర్ల వ్యవస్థ తీసుకువచ్చింది. ఈవిధానంలో రీసర్వే అనంతరం ఒక రైతుకు ఒక ఎల్‌పీఎం నెంబరు కేటాయించాల్సి ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో రీసర్వే అడ్డదిడ్డంగా జరగడంతో ఎల్‌పీఎం నెంవబర్లు ఒక రైతుకు బదులు అదే నెంబరు పది మందికిపైగా రైతులకు అడ్డదిడ్డంగా కేటాయించేశారు. ఇలా వేలాదిమంది రైతులకు ఒకే నెంబరు ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఈ డేటాను ఆన్‌లైన్ చేయడంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ తప్పులతో అనేకమంది రైతులు పంట రుణాలు పొందేందుకు, ఆకాల వర్షాలు, వరదలప్పుడు వచ్చే పంట నష్టపరిహారం తీసుకునేందుకు వీలుకాక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. అటు ఉమ్మడి ఎల్‌పీఎం ఉన్న రైతులకు సైతం ఈ లబ్ధి అందకుండా పోయిం ది. అప్పటి నుంచి ఉమ్మడి ఎల్‌పీఎంలను విడదీసి ప్రత్యేక నెంబర్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ పెద్దగా జరగడం లేదు. దీంతో వీరంతా ఇప్పుడు సుఖీభవ పథకం అమలుకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. ఆధార్ అనుసంధానంలో తప్పులు, మరణించిన వారి పేరుపై భూమి ఉన్నట్టు చూపించడం, సర్వే నెంబర్లల్లో తేడాలు సైతం చాలా ఇబ్బందికరంగా మారాయి.
సరిచేయకుంటే ఇబ్బందులే..
వాస్తవానికి అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి పొం దేందుకు రైతులకు సంబంధించిన అన్ని వివరాలు సక్రమంగా ఉండాలి. ఉమ్మడి ఎల్‌పీఎం ఉంటే అందు లో ఉండే రైతులకు లబ్ధి అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకే నెంబరు ఇద్దరు, ముగ్గురు రైతులకు వేసేందుకు ఆన్‌లైన్‌లో అవకాశం లేదు. దీంతో ఉమ్మడి ఎల్‌పీఎం నెంబర్లతోపాటు ఇతర రెవెన్యూపరమైన అంశాలను సరిచేసేందుకు వ్యవసాయశాఖ రెవెన్యూ అధికారులకు జాబితా పంపింది. ఎల్‌పీఎం సమస్యలు, సర్వేనెంబర్ల తేడాలు సరి చేయాలని కొంతకాలం కిందట పంపించింది. కానీ ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు దీనిపై అసలు దృష్టిసారించలేదు. దీంతో పథకం అమలుకు గడువు దగ్గరపడ్డా సమస్య పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. వాస్తవానికి కాకినాడ జిల్లాలో ఇంతవరకు 2,63,416 మంది రైతుల వివరాలు ఆన్‌లైన్ చేశారు. రీసర్వే, రెవెన్యూ సంబంధిత సమస్యలున్న 17,021 మంది రైతుల వివరాలను సరిచేసి పంపించాలని తహశీల్దార్లను వ్యవసాయశాఖ అధికారులు కోరారు. కానీ ఇందులో ఇప్పటివరకు 1,169 మాత్రమే పరిష్క రించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,52,002 మంది రైతుల వివరాలు ఆన్‌లైన్ చేయాల్సి ఉండగా, 2,17,007 మందివి మాత్రమే పరిశీలన పూర్తయ్యాయి. రీసర్వే, రెవెన్యూ సంబంధిత సమస్యలున్న 11,932 మంది రైతుల వివరాలను సరిచేయాలని రెవెన్యూశాఖకు పంపారు. ఇందులో ఇంతవరకు 2,141మాత్రమే పరిష్కారమయ్యాయి. అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటివరకు 3,67,049 మంది రైతుల వివరాలకుగాను 3,66,868 మందివి మాత్రమే పరిశీలన పూర్తయ్యాయి. ఇంకా 40,374 మంది రైతుల సమస్యలను రెవెన్యూ అధి కారులు పరిష్కరించాల్సి ఉండగా, అందులో 2,011 మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇలా సరిచేసిన రైతు లకు మాత్రమే అన్నదాత సుఖీభవ అందే అవకాశం ఉంది. లేదంటే అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్న అన్న దాతలకు ప్రయోజనం దక్కే అవకాశం ఉండదు.
కసరత్తు మొదలు..
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్థి పొందేందుకు వీలుగా రెవిన్యూ సమస్యలను వేగంగా పరి ష్కరించాలని రైతులు కోరుతున్నారు. లేదంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 69,327 మంది రైతులు పథకానికి దూరం కానున్నారు. వాస్తవానికి గత వైసీపీ హయాంలో వివిధసాకులతో రైతు భరోసా కింద లబ్ధిపొందే వారి సంఖ్యను అడ్డంగా కుదించేశారు. ఏటేటా వివిధ నిబంధనల పేరుతో లబ్ధిదారులను తగ్గించేశారు. కానీ ఇప్పుడు ప్రభు త్వం మాత్రం సుఖీభవ పథకానికి ఎలాంటి కోతలు లేకుండా వెబ్‌ల్యాండ్ ఆధారంగా కుటుంబం యూనిట్‌గా ప్రతి రైతుకి పథకం అందించేలా అధికారు లను ఆదేశించింది. ఈనేపథ్యంలో రాష్ట్రస్థాయి నుంచి పంపిన వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా జాబితాను తయారు చేసి రెండు రోజుల్లో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు నుంచి ప్రభుత్వానికి జాబితా పంపనున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరోసారి తనిఖీ చేయనుంది. ఆ తర్వాత లబ్ధిదారుల జాబితాలను మళ్లీ జిల్లాలకు పంనుంది. ఈ జాబితాలను రైతుసేవా కేంద్రాల ద్వారా ప్రదర్శించి త్వరలో అభ్యంతరాలు స్వీకరిస్తా రు. ఆతర్వాత తుది జాబితా రూపొందించి పథకం డబ్బులను రైతుల ఖాతాలకు జమ చేస్తారు.
Updated Date - May 31 , 2025 | 12:51 AM