NTR University: హెల్త్ వర్సిటీ వీసీగా చంద్రశేఖర్
ABN, Publish Date - Apr 25 , 2025 | 04:52 AM
ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉప కులపతి (వీసీ)గా డాక్టర్ పి. చంద్రశేఖర్‌ను ప్రభుత్వము నియమించింది. గుండె వైద్య నిపుణుడిగా 38 ఏళ్ల అనుభవంతో ఆయన వైద్య రంగంలో సేవలు అందించారు.
ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ సీఎస్ కృష్ణబాబు
ప్రభుత్వ వైద్య రంగంలో 38 ఏళ్ల పాటు సేవలు
అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉప కులపతి (వీసీ)గా డాక్టర్ పి. చంద్రశేఖర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ అనుభవం కలిగిన గుండె వైద్య నిపుణుడిగా పూలల చంద్రశేఖర్‌కు గుర్తింపు ఉంది. 1960లో కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో జన్మించిన చంద్రశేఖర్ ప్రభుత్వ వైద్యరంగంలో 38ఏళ్ల పాటు సేవలు అందించారు. 1987లో చిత్తూరు జిల్లాలోని శ్రీరంగరాజపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాది తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి ఏడేళ్లు పని చేశారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అసోసియేట్, ప్రొఫెసర్‌గా కీలకమైన విధులు నిర్వహించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఆయన 2023లో పదవీ విరమణ చేశారు. చివరి నాలుగేళ్లు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హోదాలో ఉన్న ఆయన కొవిడ్ సమయంలో ప్రభుత్వానికి కీలకమైన సలహాలు, సూచనలు అందించారు. డీఎంఈ డైరెక్టర్‌గా నెల రోజుల పాటు అదనపు బాధ్యతలు నిర్వహించారు. గుండె చికిత్స, వైద్య విద్యాబోధన, పరిపాలన రంగాల్లో చంద్రశేఖర్ విశేష అనుభవం గడించారు. గుండె, దాని సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించేందుకు పలు పుస్తకాలు, కరపత్రాలను ప్రచురించారు. గుండె నిపుణులతో కూడిన పలు జాతీయ సంస్థల్లో సభ్యుడిగా ఉన్నారు. లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ 2023లో ఆయనకు సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్‌ను ప్రదానం చేసింది. చంద్రశేఖర్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అభినందించారు. వర్సిటీ సేవలను మరింత విస్తరించాలని సూచించారు.
వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు
అనుభవం, అర్హత ఉన్న చంద్రశేఖర్‌ను డీఎంఈ కానివ్వకుండా గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ వైద్యుడైనప్పటికీ డైరెక్టర్ హోదా రాకుండా అడ్డుపడింది. దీంతో ఆయన అడిషనల్ డైరెక్టర్ హోదాలోనే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఆయనకు గుర్తింపు ఇచ్చి, హెల్త్ వర్సిటీ వీసీగా నియమించింది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 25 , 2025 | 04:52 AM