IT Development : మిలీనియం టవర్లకు మోక్షం!
ABN, Publish Date - Jan 01 , 2025 | 03:39 AM
విశాఖలో ఐటీ హబ్ శరవేగంగా దూసుకుపోతోంది. ప్రభుత్వం మారడంతో ఐటీకి అన్నీ శుభసంకేతాలే కనిపిస్తున్నాయి. రుషికొండ ఐటీ పార్కులో గల మిలీనియం టవర్లకూ మంచి రోజులు రానున్నాయి.
ఐటీ సెజ్ నుంచి మినహాయింపు యత్నాలు
డీనోటిఫై చేయడానికి ఏపీఐఐసీ ప్రతిపాదనలు
త్వరలోనే కొత్త ఐటీ కంపెనీలకు కేటాయింపు
వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖలో ఐటీ హబ్ శరవేగంగా దూసుకుపోతోంది. ప్రభుత్వం మారడంతో ఐటీకి అన్నీ శుభసంకేతాలే కనిపిస్తున్నాయి. రుషికొండ ఐటీ పార్కులో గల మిలీనియం టవర్లకూ మంచి రోజులు రానున్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న అంతస్థులను ఐటీ సంస్థలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొత్తగా వస్తున్న ఐటీ కంపెనీలన్నీ ప్రత్యేక ఆర్థిక మండలి (స్పెషల్ ఎకనామిక్ జోన్-సెజ్)తో సంబంధం లేని భవనాలనే కోరుకుంటున్నాయి. హిల్ నంబరు 3 మొత్తం సెజ్ పరిధిలో ఉంది. అక్కడే మిలీనియం టవర్లు ఉన్నాయి. కొత్త కంపెనీలను ఆహ్వానిస్తున్నందున వాటికి అనుకూలంగా ఉండేలా ఈ రెండు టవర్లను సెజ్ పరిధి నుంచి డీ నోటిఫై చేయాలని అధికారులు యత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే రెండు టవర్లలో ఖాళీగా ఉన్న స్థలాన్ని కొత్త ఐటీ సంస్థలకు కేటాయిస్తారు. దాంతో ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలున్నాయి.
నాడూ టీడీపీ హయాంలోనే...
తెలుగుదేశం ప్రభుత్వ హయాం (2014-19)లో రుషికొండ ఐటీ పార్కు హిల్ నంబరు 3పై మిలీనియం టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగించారు. టవర్-ఎ, టవర్-బిలను నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించేందుకు రూ.145 కోట్లు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. మొదట రూ.90 కోట్లతో టవర్-1 నిర్మించారు. దానిని 2019 ఫిబ్రవరిలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. టవర్-ఏ లో మొత్తం పది అంతస్థులు ఉండగా, నాలుగు అంతస్థులను కాండ్యుయెంట్ కంపెనీకి కేటాయించారు. అదేరోజు ఆ సంస్థను ఆయనే ప్రారంభించారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం టవర్-ఏ లో మిగిలిన నాలుగు అంతస్థులను ఎవరికీ కేటాయించకుండా ఐదేళ్లు ఖాళీగా ఉంచింది. విశాఖలో పరిపాలనా రాజధాని పెడతామని, అందుకు అవసరమైన కార్యాలయాలు పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటామని చెప్పి ఖాళీగా ఉంచేశారు.
టవర్-ఏ పక్కనే టవర్-బీ నిర్మాణాన్ని ఏపీఐఐసీ రెండేళ్లలో పూర్తిచేసింది. అందులో మరో 8 అంతస్థులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని కూడా వైసీపీ హయాంలో ఎవరికీ కేటాయించకుండా మూడేళ్లు ఖాళీగా ఉంచారు. టవర్-బీ లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో ‘ప్రీమియం రిజిస్ట్రేషన్ కార్యాలయం’ పెట్టించాలని భావించినా కుదర్లేదు. ఈ రెండు టవర్లలో సుమారు 3 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది. అడుగుకు రూ.50 అద్దె వేసుకున్నా.. నెలకు రూ.15 లక్షల వరకు అద్దె వస్తుంది.
డీనోటిఫికేషన్ ఎందుకంటే..?
సెజ్‌లో ఏ కంపెనీ పెట్టినా అక్కడ తయారుచేసే ఉత్పత్తులను 100 శాతం ఎగుమతి చేయాలి. అప్పుడే వారికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల రాయితీలు అందుతాయి. ఐటీ కంపెనీలు కేవలం విదేశీ ప్రాజెక్టులపైనే ఆధారపడకుండా దేశీయ సంస్థలకూ పెద్ద సంఖ్యలో సేవలు అందిస్తున్నాయి. ఆ వ్యాపారం దక్కాలంటే.. తప్పకుండా సెజ్ బయటే ఉండాలి. అందుకని వాటికి అనుగుణంగా హిల్-3పై కేవలం మిలీనియం టవర్లను మాత్రమే డీనోటిఫై చేయడానికి ఏపీఐఐసీ ఫైల్ పెట్టింది. డీ నోటిఫై అనంతరం టవర్స్‌లో కొత్త కంపెనీలు ఏర్పాటైతే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Updated Date - Jan 01 , 2025 | 03:39 AM