Srikakulam : దివ్యాంగురాలిపై అత్యాచారం
ABN, Publish Date - Feb 10 , 2025 | 05:18 AM
మామ అయిన వ్యక్తి మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
పలాసరూరల్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): దివ్యాంగురాలైన ఓ మహిళను వరసకు మామ అయిన వ్యక్తి మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కాశీబుగ్గ సీఐ టి.సూర్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పలాస మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలికి.. అదే గ్రామానికి చెందిన వరిశ భాస్కరరావు అనే వ్యక్తి మాయమాటలు చెప్పేవాడు. మామ వరసయిన అతడు. 7 నెలల కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్దని నిరాకరించినా కల్లబొల్లి మాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె గత నెల 22న ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా గర్భవతి అని వైద్యులు తేల్చారు. విషయం బయటపడడంతో కుటుంబ సభ్యులు భాస్కరరావును పిలిపించి గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఇందులో తన తప్పు లేదని భాస్కరరావు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆదివారం బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాస్కరరావు తనను గర్భవతిని చేశాడని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 10 , 2025 | 05:19 AM