మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - May 29 , 2025 | 11:57 PM
ప్రముఖపుణ్యక్షేత్ర మైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు.
మంత్రాలయం, మే 29(ఆంధ్రజ్యోతి): ప్రముఖపుణ్యక్షేత్ర మైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. గురువారం రాఘవేంద్రస్వామికి ఇష్టమైన దినం కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదీతీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైనన్లు, పరిమళప్రసాదం వద్ద భక్తుల సందడిగా మారింది. భక్తుల రద్దీ పెరగడంతో లాడ్జీలు, హోటల్‌లు, పూజా సామగ్రికి డిమాండ్ పెరిగింది. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు ప్రధాన రహదారిపైనే పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
వెండి గజవాహనంపై ప్రహ్లాదరాయలు
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి గజవాహనంపై బంగారు అంబారిలో విహరించారు. రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన జ్యేష్ఠ తదియ గురువారం శుభదినాన్ని పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆఽశీస్సులతో తెల్లవారుజాము నుంచే రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి, మంచాలమ్మకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛ రణాలు, మంగళ వాయిద్యాల మధ్య వెండి గజవాహనంపై స్వర్ణ అంబారిలో వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి అర్చకుల మహామంగళహారతితో ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం స్వామివారికి ఊంజలసేవ నిర్వహించారు.
శ్రీ మఠం అన్నదానానికి రూ. 2 లక్షల విరాళం
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి హైదరాబాదుకు చెందిన ప్రమీల అనేభక్తురాలు రూ.2లక్షలు అన్నదానానికి విరాళంగా ఇచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజరు వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్, శ్రీపతి ఆచార్ తెలిపారు. గురువారం రాత్రి కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని నగదును విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. విరాళం ఇచ్చిన దాత కుటుంబానికి శ్రీమఠం పండితులు రాఘవేంద్ర స్వామి జ్ఞాపిక, శేషవస్త్రం, ఫల, పుష్ప, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీపాదాచార్, దేశాయ్ నరసింహాచార్, అనంతపురాణిక్, సుజ్ఞానేంద్ర ఆచార్, లక్ష్మీకాంతాచార్ పాల్గొన్నారు.
Updated Date - May 29 , 2025 | 11:57 PM