Polavaram: పోలవరం ఎత్తిపోతల వద్దు
ABN, Publish Date - May 22 , 2025 | 06:25 AM
పోలవరం ఎత్తిపోతల పథకం రద్దు చేసి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. గోదావరి వరద జలాలను వినియోగించడం, కృష్ణా జలాలను పరిరక్షించడం కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.
కొల్లి నాగేశ్వరరావు వర్ధంతి సభలో నిపుణులు, ఉద్యమకారుల డిమాండ్
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): పోలవరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించవద్దని సామాజిక ఉద్యమకారులు, సాగునీటి రంగ నిపుణులు డిమాండ్ చేశారు. రూ.912.84 కోట్ల అంచనాతో తయారుచేసిన ఈ ప్రతిపాదనను రద్దుచేసి రూ.1,000 కోట్లతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పోలవరం-బనకచర్ల పథకంపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు ఈ పథకాన్ని ఉపసంహరించుకుని పోలవరం-సోమశిల అనుసంధాన పథకాన్ని చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు వర్ధంతి సభ బుధవారం విజయవాడలో జరిగింది. దీనికి కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం సమన్వయకర్త టి.లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. నదుల అనుసంధాన ఆవశ్యకత-ప్రతిపాదనలు-సానుకూల, ప్రతికూలాంశాలపై చర్చించారు. పోలవరం గరిష్ఠ ఎత్తు 45.72 మీటర్లపై సీఎం చంద్రబాబు విస్పష్ట ప్రకటన చేయాలని సభ డిమాండ్ చేసింది. జలాశయ గర్భంలో 32-35 మీటర్ల వద్ద నుంచి నీటిని తోడేందుకు గతంలో జగన్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టిందని, దానిని తక్షణమే రద్దు చేయాలని స్పష్టం చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యమివ్వాలని కోరింది. పోలవరం-బనకచర్ల పథకంపై చర్చించి గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకోవడానికి, బచావత్ ట్రైబ్యునల్ ద్వారా సంక్రమించిన కృష్ణా జలాలను పరిరక్షించుకోవడానికి.. రాయలసీమకు కృష్ణా జలాల తరలింపు ద్వారా శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టడంపై సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 06:25 AM