ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tungabhadra Project : గేటా.. గేట్లా?!

ABN, Publish Date - Feb 24 , 2025 | 04:48 AM

సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో పది రోజులకుపైగా శ్రమించి ‘స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌’ ఏర్పాటు చేశారు.

  • తుంగభద్ర డ్యాం గేట్లపై తేల్చని ప్రాజెక్టు బోర్డు.. 19వ గేటు కొట్టుకుపోయి ఆరు మాసాలకు పైగా పూర్తి

  • మొత్తం 33 గేట్లు మార్చాలని నిపుణుల కమిటీ సూచనలు

  • నెలలు గడిచినా చర్యలు శూన్యం

  • 4 మాసాల్లో వర్షాలు ప్రారంభం

  • 19వ గేటైనా ఏర్పాటు చేయాలని సూచిస్తున్న జలవనరుల నిపుణులు

  • లేకుంటే మొత్తానికే ముప్పని హెచ్చరిక

తుంగభద్ర ప్రాజెక్టుకు గేట్లు అమర్చే విషయంలో కాలయాపన కొనసాగుతోంది. గత ఏడాది ఆగస్టులో 19వ నెంబరు గేటు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ‘స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌’ను ఏర్పాటు చేశారు. కానీ, డ్యాంను పరిశీలించిన నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ మొత్తం 33 గేట్లు మార్చాలని సూచించింది. అయితే.. ఈ వ్యవహారంపై తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో నాలుగు మాసాల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో గేట్లు మార్చాలని లేకపోతే 19వ గేటైనా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక, తెలుగు రాష్ట్రాల జీవనాడి. కరువుతో తల్లడిల్లే రాయలసీమకు ప్రాణాధారం. గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు 19వ నెంబరు క్రస్ట్‌గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో పది రోజులకుపైగా శ్రమించి ‘స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌’ ఏర్పాటు చేశారు. తరువాత డ్యాంను పరిశీలించిన కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ ఏకే బజాజ్‌ నేతృత్వంలోని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ) ‘‘డ్యాం గేట్లు జీవిత కాలం తీరిపోయింది. మరమ్మతులతో కాలయాపన చేయడం సరికాదు. అత్యాధునిక డిజైన్‌తో 33 గేట్లు కొత్తగా ఏర్పాటు చేయడమే ఉత్తమం’’ అని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అందుకున్న తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు.. దీనిపై క్రస్ట్‌గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించాలని, గత ఏడాది డిసెంబరు ఆఖరులోగా డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌(డీపీఆర్‌) తయారు చేయించాలని నవంబరులోనే నిర్ణయించింది. అయితే.. నెలలు గడిచిపోతున్నా గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించలేదు.


కనీసం కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో కొత్త గేటు ఏర్పాటు చేయలేదు. మరోవైపు.. వర్షాకాలం ప్రారంభమయ్యేందుకు నాలుగు నెలలే గడువుంది. అప్పటిలోగా అయినా గేటు ఏర్పాటు చేయాలని జలవనరుల నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే, 2009లో వచ్చిన భారీ వరదలు పోటెత్తితే డ్యాం భద్రతకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం, తుంగభద్ర బోర్డు అధికారులు స్పందించి గేట్ల ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

నెలలు గడిచినా నిదానమే!

డ్యాం 19వ నెంబరు గేటు కొట్టుకుపోయి ఆరు నెలలు పూర్తయ్యాయి. బజాజ్‌ కమిటీ నివేదిక బోర్డుకు చేరి ఐదారు నెలలు కావస్తోంది. క్రస్ట్‌గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించి నివేదిక తెప్పించాలని తీర్మానించి కూడా 4 నెలలు అవుతోంది. అయినప్పటికీ గేట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలే దు. మరోవైపు, జంషెడ్‌పూర్‌లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో కొనసాగుతున్న సంస్థకు చెందిన క్రస్ట్‌గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించాలని బోర్డులో చర్చ జరుగుతోంది. పోనీ ఆ దిశగా అయినా చర్యలు తీసుకుంటున్నారా? అంటే అదీ లేదు.


పొంచి ఉన్న ముప్పు!

తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌ వేశారు. ఈ నేపథ్యంలో తక్షణమే కొత్త గేటు ఏర్పాటు చేస్తామని అప్పట్లో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు ప్రకటించాయి. నెలలు గడిచినా గేటు ఏర్పాటుపై అడుగులు పడడం లేదు. ఇదిలావుంటే, మరో నాలుగు మాసాల్లో(జూన్‌) డ్యాంకు వరద ప్రారంభమవుతుంది. ఇప్పటికీ గేట్‌ డిజైన్‌, డీపీఆర్‌ తయారు కాలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే డిజైన్‌, డీపీఆర్‌ తయారీ, బోర్డు అప్రూవల్‌, టెండర్లు, కాంట్రాక్ట్‌ సంస్థలో ఒప్పందం వంటి ప్రక్రియలు పూర్తి చేసి ఉంటే.. తాత్కాలిక స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌ తొలగించి సకాలంలో కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉండేది. టీబీపీ బోర్డు సెక్రెటరీ ఒ. రామకృష్ణారెడ్డి(ఓఆర్కే రెడ్డి) సహా బోర్డు ఉన్నతాధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జూన్‌ ప్రారంభానికి ముందే కొత్త గేటు ఏర్పాటు చేయాలని, లేదంటే మొత్తం ప్రాజెక్టుకే ప్రమాదం ముంచుకొచ్చినా ఆశ్చర్యం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Feb 24 , 2025 | 04:48 AM