జాప్యం!
ABN, Publish Date - Apr 08 , 2025 | 12:49 AM
జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. గత ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులే సొంత ఖర్చులు పెట్టుకుని ధాన్యం మిల్లులకు రవాణా చేశారు. ఆ రవాణా బిల్లులు ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమకాలేదు. పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్లు ధాన్యం రవాణా ఖర్చుల లెక్కలు నేటికీ తేల్చక పోవడంతో బిల్లులు వస్తాయో.. రావో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీకి వినతిపత్రం అందించారు. ధాన్యం రవాణా బిల్లులను త్వరగా ఇప్పించాలని వేడుకున్నారు. ఒక్క కోలవెన్ను గ్రామంలోనే రూ.12.21 లక్షలకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
-ధాన్యం రవాణా బిల్లులు అందక రైతుల అవస్థలు
-ఒక్క కోలవెన్ను గ్రామంలోనే రూ.12.21 లక్షలు పెండింగ్
- త్వరగా ఇప్పించాలని కలెక్టర్ బాలాజీకి రైతుల వినతి
- జిల్లా వ్యాప్తంగా ఇంకా తేలని లెక్కలు
- నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్న రైతులు
జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. గత ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులే సొంత ఖర్చులు పెట్టుకుని ధాన్యం మిల్లులకు రవాణా చేశారు. ఆ రవాణా బిల్లులు ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమకాలేదు. పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్లు ధాన్యం రవాణా ఖర్చుల లెక్కలు నేటికీ తేల్చక పోవడంతో బిల్లులు వస్తాయో.. రావో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీకి వినతిపత్రం అందించారు. ధాన్యం రవాణా బిల్లులను త్వరగా ఇప్పించాలని వేడుకున్నారు. ఒక్క కోలవెన్ను గ్రామంలోనే రూ.12.21 లక్షలకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి చెందిన 405 మంది రైతులు గతేడాది డిసెంబరు 15వ తేదీ నాటికి ధాన్యం విక్రయాలు పూర్తిచేశారు. వరి కోతల సమయంలో వర్షాలు వర్షాలు పడటంతో యంత్రాల ద్వారా కోతలు పూర్తి చేసి, స్థానికంగా ఉన్న మిల్లులతోపాటు జగ్గయ్యపేట, తదితర ప్రాంతాలకు ధాన్యం వాహనాల్లో తరలించారు. వాహనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులే కిరాయికి లారీలు సమకూర్చుకుని, ఒక్కో లారీకి రూ.5,500 చొప్పున నగదు చెల్లించి మరీ వాహనాలకు అనుమతులు తీసుకున్నారు. మూడు కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల దూరంలోని మిల్లులకు ధాన్యం రవాణా చేశారు. ఈ సమయంలో రైతులకు సంబంధించిన పేర్లు, వాహనాల నంబర్లు, వాహనాలు రైతులు సమకూర్చుకుంటే ఆ వివరాలు, ఎఫ్‌టీపీ నంబర్లను నమోదు చేసి ఎన్ని టన్నుల ధాన్యం రవాణా చేశారో జాబితాలు సిద్ధం చేశారు. ఈ ఒక్క గ్రామం నుంచే 2,988 టన్నుల ధాన్యం రవాణా చేశారు. ఇందు కోసం రూ.12.21 లక్షలు వరకు ఖర్చు అయినట్లు సమాచారం. కానీ నేటి వరకు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం రవాణా బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు.
టన్నుకు ఎంత ఇస్తారనే అంశంపై సందిగ్ధం
ధాన్యం విక్రయించిన సమయంలో ప్రభుత్వ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులే సొంత ఖర్చులు పెట్టుకుని మరీ ధాన్యం ఆర్‌ఎస్‌కేలు సూచించిన మిల్లులకు రవాణా చేశారు. లారీలకు కిరాయిని రైతులే చెల్లించారు. 10 కిలోమీటర్ల లోపు దూరం ఉన్న మిల్లులకు రవాణా చేస్తే టన్నుకు రూ.350, అంతకు మించి దూరం తరలిస్తే అందుకు అనుగుణంగా బిల్లులను ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. ఎంత దూరంలోని మిల్లుకు ఽధాన్యం పంపినా టన్నుకు రూ. 650లకు మించి చెల్లించబోమని అప్పట్లో అధికారులు రైతులకు తెలిపారు. డిసెంబరులో వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలని కోలవెన్ను రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాలసంస్థ కమిషనర్, ఎండీలను ఈ గ్రామానికి పంపి ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేయించారు. ధాన్యం బిల్లులు రెండు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. కానీ ధాన్యం రవాణా బిల్లులు మాత్రం పెండింగ్‌లోనే ఉంచారు. ఇంతకాలంగా ఈ బిల్లుల కోసం వేచి చూసిన రైతులు, మహిళా రైతులు కోలవెన్ను గ్రామ టీడీపీ అధ్యక్షుడు తుమ్మల జగదీష్‌తో కలసి మచిలీపట్నం వచ్చి ధాన్యం రవాణా బిల్లులను ఇప్పించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
6 లక్షల టన్నుల వరకు ధాన్యం కొనుగోలు
గతేడాది నవంబరు 15వ తేదీ నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. 5.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం తొలివిడతగా అనుమతులు ఇచ్చింది. రెండు, మూడు విడతల్లో మరో 30 వేల టన్నుల చొప్పున ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతులు వచ్చాయి. ఇప్పటి వరకు పౌరసరఫరాల సంస్థ ద్వారా సుమారు ఆరు లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఖరీఫ్ సీజన్‌లో మిగులుబాటుగా ఉన్న ధాన్యం 40 వేల టన్నులు, రబీ సీజన్ కోటాలో మరో 10వేల టన్నులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇచ్చింది. సుమారు ఆరు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా ఇంతవరకు ధాన్యం రవాణా బిల్లులను పూర్తిస్థాయిలో లెక్కలు తేల్చలేదు. ఈ లెక్కలు ప్రభుత్వానికి పంపితేనే, నగదును విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. ధాన్యం రవాణా బిల్లులను ప్రభుత్వానికి ఎప్పటికి పంపుతారు, ఎప్పటికి విడుదల అవుతాయనే అంశంపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే మిల్లు యాజమానులు ధాన్యం రవాణాకు సంబంధించిన బిల్లులను పూర్తిస్థాయిలో పంపలేదని పౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ పద్మాదేవి చెబుతున్నారు.
Updated Date - Apr 08 , 2025 | 12:49 AM