Certificate Issues: డిగ్రీ పట్టాల పాట్లు
ABN, Publish Date - Jul 19 , 2025 | 04:50 AM
రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల మధ్య సమన్వయం కొరవడటం డిగ్రీ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కోర్సు పూర్తిచేసి నెలలు గడుస్తున్నా కొందరి చేతికి పట్టా మాత్రం అందడం లేదు.
సర్టిఫికెట్ల కోసం వందల మంది ఎదురుచూపులు
అఫిలియేషన్, పరీక్ష ఫీజులు కట్టని కొన్ని కాలేజీలు
ధ్రువపత్రాల జారీని ఆపేస్తున్న ఏయూ, ఏఎన్‌యూ
కోర్టు ఆదేశించినా పట్టించుకోని వర్సిటీ అధికారులు
ఐసెట్ కౌన్సిలింగ్‌కు దూరమైన విద్యార్థులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల మధ్య సమన్వయం కొరవడటం డిగ్రీ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కోర్సు పూర్తిచేసి నెలలు గడుస్తున్నా కొందరి చేతికి పట్టా మాత్రం అందడం లేదు. 2024-25 విద్యా సంవత్సరంలో చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వందలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవైపు పీజీ కోర్సుల్లో చేరడానికి గడువు పూర్తవుతోంది. అయినా ధ్రువపత్రాలు జారీ కాకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. నాగార్జున, ఆంధ్రా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. కాలేజీల యాజమాన్యాలు పరీక్ష ఫీజులు, అఫిలియేషన్ల ఫీజులు చెల్లించనందుకు వర్సిటీలు సర్టిఫికెట్ల జారీని నిలిపివేశాయి. ఏయూ పరిధిలోని కాలేజీలు ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.1,100 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే కాలేజీల్లో కొనసాగుతున్న వారి ఫీజులు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలు చెబుతుండగా, డిగ్రీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులందరికీ ఫీజు చెల్లించాలని ఏయూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాలేజీలో చేరి, మధ్యలోనే చదువు మానేసినవారికి కూడా ఫీజులు ఎందుకు కట్టాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ గందరగోళంతో వర్సిటీ పరిధిలో అనేకమంది విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీ ఆగిపోయింది. ఇక ఏఎన్‌యూ పరిధిలోని కొన్ని కాలేజీలు అఫిలియేషన్ల ఫీజులు చెల్లించడం లేదు. డిగ్రీ కాలేజీలు ప్రతి సంవత్సరం ఫీజు చెల్లిస్తేనే వర్సిటీలు వాటికి అఫిలియేషన్లు పునరుద్ధరిస్తాయి. కానీ ఏఎన్‌యూ పరిధిలో కొన్ని కాలేజీలకు ఈ ఫీజులు కట్టకపోయినా అఫిలియేషన్లు కొనసాగిస్తున్నారు. తీరా ఇప్పుడు ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో ఆ కాలేజీల్లోని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఆపేశారు. దీంతో పీజీ కోర్సుల్లో చేరే అవకాశాన్ని విద్యార్థులు కోల్పోతున్నారు. ఇటీవల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ రాసిన విద్యార్థుల్లో కొందరు డిగ్రీ సర్టిఫికెట్లు రాకపోవడంతో కౌన్సెలింగ్‌కు రిజిస్ర్టేషన్ చేసుకోలేకపోయారు.
దీనిపై కాలేజీల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సర్టిఫికెట్లు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అయినా ఏఎన్‌యూ అధికారులు స్పందించకపోవడంతో ఐసెట్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు అవకాశం కోల్పోయారు. అయితే ఐసెట్ రాసిన విద్యార్థులకు మాత్రమే ఏయూ సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ఇతరత్రా పీజీ కోర్సుల్లో చేరేవారికి మాత్రం ఇవ్వడం లేదు.
ఫీజు బకాయిలను చూపుతూ..
కాలేజీ యాజమాన్యాలు యూనివర్సిటీలకు అఫిలియేషన్, వర్సిటీ డెవల్‌పమెంట్, పరీక్ష, ఇతరత్రా పలు రకాల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెరిగిపోవడం వల్లే ఈ ఫీజులు కట్టలేకపోతున్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం మూడు క్వార్టర్ల ఫీజులు బకాయిలు పెట్టింది. 2024-25 విద్యా సంవత్సరంలోనూ బకాయిలున్నాయి. అయితే ఫీజులు చెల్లించకపోయినా అఫిలియేషన్ ఎందుకు కొనసాగిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Updated Date - Jul 19 , 2025 | 04:55 AM