Gorukallu Reservoir: ప్రమాదంలో గోరుకల్లు రిజర్వాయర్
ABN, Publish Date - Jun 02 , 2025 | 06:06 AM
గోరుకల్లు రిజర్వాయర్‌లో రాతి పరుపు కుంగిపోవడంతో ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. శాశ్వత మరమ్మతులకు రూ.58 కోట్ల ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయి నిధులు మంజూరు కాలేదు.
నీటిలోకి కుంగుతున్న కీలకమైన రాతిపరుపు
నాలుగు చోట్ల గుర్తింపు.. పెరుగుతున్న విస్తీర్ణం
వైసీపీ ప్రభుత్వంలో రెండుచోట్ల కుంగిన మట్టికట్ట
నాడు తాత్కాలిక మరమ్మతులతో సరిపుచ్చిన వైనం
బ్యాలెన్స్ పనులు, మరమ్మతులకు 58 కోట్లు అవసరం
సీడీవో బృందం తనిఖీ.. పలు సూచనలు
(కర్నూలు-ఆంధ్రజ్యోతి)
రాయలసీమ జలనాడి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. కీలకమైన మట్టి ఆనకట్ట రాతి పరుపు (స్టోన్ రివెట్‌మెంట్) కుంగిపోతోంది. నాలుగు చోట్ల రాతిపరుపు నీటిలోకి జారిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మట్టి ఆనకట్ట పనులను అసంపూర్తిగా వదిలేశారు. రాతి పరుపు, మట్టి మధ్యలో వర్షపు నీరు చేరుతుండడంతో శాండ్ ఫిల్టర్ మీడియా దెబ్బతిని (వాష్‌అవుట్) స్టోన్ రివెట్‌మెంట్ జారిపోతోందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఈ నెల 13న సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ (సీడీవో) సీఈ విజయభాస్కర్‌రెడ్డి, ఎస్‌ఈ శివశంకర్‌రెడ్డి బృందం రిజర్వాయర్‌ను తనిఖీ చేసింది. మట్టికట్ట బ్యాలెన్స్ పనులు, అప్‌టెక్ స్లూయిస్, జలాశయం డౌన్ స్ట్రీమ్ డ్రైన్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో బ్యాలెన్స్ మట్టికట్ట, అప్‌టెక్ (ఓటీ) నిర్మాణం, శాశ్వత మరమ్మతులకు ఇంజనీర్లు రూ.58 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. తాత్కాలిక మరమ్మతులకు నంద్యాల కలెక్టర్ జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నుంచి రూ.2.50 కోట్ల నిధులు ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేయాలని రాయలసీమ సాగునీటి రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
కుంగుతున్న మట్టికట్ట రాతిపరుపు
గోరుకల్లు రిజర్వాయర్ లైవ్ కెపాసిటీ 10.29 టీఎంసీలు కాగా.. డెడ్ స్టోరేజ్ కెపాసిటీ 2.15 టీఎంసీలు. గరిష్ఠ నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 261 మీటర్లు. ఆనకట్ట పొడవు 3.46 కిలోమీటర్లు కాగా, 1.90 కిలోమీటర్లు మట్టి ఆనకట్ట, 1.56 కిలోమీటర్లు సిమెంట్ కాంక్రీట్ ఆనకట్ట నిర్మించారు. ఆనకట్ట ఎత్తు గరిష్ఠంగా 45 మీటర్లు కాగా.. 4.6 మీటర్ల ఎత్తులో మట్టి ఆనకట్ట నిర్మాణం, రాతి పరుపు, ఆప్‌టెక్ స్లూయిస్, డ్రైన్.. వంటి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గత వైసీపీ హయాంలో ఐదేళ్లూ బాలెన్స్ పనులను నిర్లక్ష్యంగా వదిలేశారు. ఫలితంగా కీలకమైన రాతిపరుపు నీటిలోకి జారిపోతోందని, ఆనకట్ట కుంగిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2,600 మీటర్లు నుంచి 3,400 మీటర్ల మధ్యలో నాలుగు చోట్ల 150-200 మీటర్లకు పైగా రాతిపరుపు జారిపోయిందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. రోజురోజుకూ ఈ విస్తీర్ణం పెరుగుతోంది. 2023 మేలో మట్టికట్ట రెండు చోట్ల కుంగిపోవడాన్ని తొలిసారి గుర్తించారు. నాడు తాత్కాలిక మరమ్మతులతో సరిపుచ్చారు. వైసీపీ హయాంలో శాశ్వత మరమ్మతులు, బ్యాలెన్స్ పనుల జోలికి వెళ్లకపోవడం రైతులకు శాపంగా మారింది.
రూ.58.6 కోట్లతో ప్రతిపాదనలు
రాతి పరుపు శాశ్వత మరమ్మతులు, మట్టికట్ట సహా మెకానికల్ బ్యాలెన్స్ పనుల నిర్మాణం కోసం ఫేజ్-1 కింద తక్షణమే రూ.58.6 కోట్ల నిధులు ఇవ్వాలని ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే రాతిపరుపు మరమ్మతులకు నంద్యాల కలెక్టర్ రాజకుమారి డీఎంఎఫ్ కింద రూ.2.50 కోట్లు ఇచ్చారు. ఇంజనీర్లు టెండర్లు పిలిచారు. అయితే శాశ్వత మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసుకెళ్లగా.. గోరుకల్లు రిజర్వాయర్ స్టోన్ రివెట్‌మెంట్ నాలుగు చోట్ల జారిపోయిందని తెలిపారు. కలెక్టర్ ఇచ్చిన నిధులతో తక్షణ మరమ్మతుల చేపడతామని చెప్పారు. బ్యాలెన్స్ పనులు, శాశ్వత మరమ్మతుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు రాగానే పనులు చేపడతామన్నారు.
‘గోరుకల్లు’ బహు కీలకం
రాయలసీమ ఉమ్మడి జిల్లాలైన కర్నూలు, కడప, చిత్తూరుతో పాటు నెల్లూరులో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 5 లక్షల జనాభాకు తాగునీరు అందించాలన్న ప్రధాన ఆశయంతో గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టారు. నంద్యాల జిల్లాలో ఎస్సార్బీసీ, అవుకు జలాశయం కింద 1.95 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. శ్రీశైలం జలాశయం పైభాగంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 38 టీఎంసీల కృష్ణా వరద జలాలు తీసుకునేందుకు వీలుగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. జీఎన్‌ఎ్‌సఎ్‌సలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామం వద్ద 12.44 టీఎంసీల సామర్థ్యంతో గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. దీని నుంచే కడప జిల్లా కొండాపురం మండలంలో నిర్మించిన గండికోట జలాశయానికి 26.85 టీఎంసీలు, పులివెందుల నియోజకవర్గంలోని పైడిపాలెం రిజర్వాయర్‌కు 6 టీఎంసీలు, చిత్రావతి జలాశయానికి 10 టీఎంసీలు, కమలాపురం నియోజకవర్గంలోని వామికొండ రిజర్వాయర్‌కు 1.6 టీఎంసీలు, సర్వరాయసాగర్ జలాశయానికి 3.06 టీఎంసీలను గాలేరు-నగరి వరద కాలువ (జీఎన్‌ఎ్‌సఎ్‌స ఫ్లడ్‌ప్లో కెనాల్) ద్వారా మళ్లించాల్సి ఉంది. ఆయా జలాశయాలకు కృష్ణా వరద జలాలు మళ్లించే అత్యంత కీలకమైనగోరుకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో పడింది. తాజా పరిస్థితుల దృష్ట్యా 11 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయలేమని ఇంజనీర్లు అంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 06:06 AM